వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు


వెల్దుర్తి: వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్ లో భాగంగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో జాతీయ రహదారిని నిర్భందించారు. ఈ మేరకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారి నిర్భందంలో పాల్గొన్నారు. దీంతో శనివారం పోలీసులు 15 మంది వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదైనట్లు సమాచారం. అంతేకాకుండా జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమపై అక్రమ కేసులు పెడుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.



కాగా, జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 డిపోల్లో 920 బస్సులు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. నంద్యాలలో బస్సులు నిలిచిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు వామపక్షాల శ్రేణులు బంద్ విజయవంతానికి కృషి చేశారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఉదయం 9.30 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


వాణిజ్య, వ్యాపార సంస్థలను మూసివేశారు. ఎమ్మిగనూరులో తెల్లవారు జాము నుంచే పార్టీ శ్రేణులు బస్సులను ఆపివేశారు. దుకాణాలను మూసివేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. పత్తికొండలో నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకుపాడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బంద్ పూర్తి స్థాయిలో జరుగుతోంది.


పట్టణంలో వంద బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. బేతంచెర్లలో జరిగిన ధర్నాలో డోన్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కోస్గి మండలం కేంద్రంలో భారీ ఎత్తున బంద్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆందోళనకు దిగారు. మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొని బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




 

Read also in:
Back to Top