విజయవాడలో రేపు మంత్రివర్గ సమావేశం


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలో జరగనుంది. ఇక నుంచి ప్రతి సోమవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఒక్కో సమావేశాన్ని ఒక్కో జిల్లాలో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇందుకు సన్నద్ధమై ఉండాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. రాష్ట్రానికి దూరంగా పరిపాలన కొనసాగుతోందనే భావనను ప్రజల్లో తొలగించటంలో భాగంగానే జిల్లాల్లో మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన ట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

 

1న పార్టీ విస్తృత సమావేశం

టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఆగస్టు 1న జరగనుంది. విజయవాడలో ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సాయంత్రం వరకూ జరుగుతుంది. పార్టీ కమిటీల ఏర్పాటు, ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు.. తదితరాల అంశాలను చర్చించనున్నారు. గత విస్తృతస్థాయి సమావేశాన్ని కూడా విజయవాడలోనే నిర్వహించారు.

 

నేడు రామేశ్వరం వెళ్లనున్న సీఎం


సీఎం చంద్రబాబు గురువారం ఉదయం తమిళనాడులోని రామేశ్వరం వెళ్లనున్నారు. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తారు. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియల్లో పాల్గొని సాయంత్రానికి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

 

ఒకటో తేదీ రాత్రి విదేశాలకు..


ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు ఒకటో తేదీ రాత్రి లేదా రెండో తేదీ తెల్లవారుజామున ఆయన టర్కీ దేశ పర్యటనకు వెళతారు. ఏడో తేదీ అర్ధరాత్రి లేదా ఎనిమిదో తేదీ ఉదయం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.




 

Read also in:
Back to Top