గబ్బిలాల్లా వేలాడుతున్నారు

గబ్బిలాల్లా వేలాడుతున్నారు - Sakshi


సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ నుంచి రిలీవైన  ఉద్యోగులకు సిగ్గు లేదు. వెళ్లగొట్టినా ఇక్కడే గబ్బిలాల్లా వేలాడుతున్నారు. ఇంకా వెళ్లకపోతే పొగబెట్టి పంపించడం మాకు బాగా తెలుసు’ అంటూ ఏపీ విద్యుత్ ఉద్యోగులపై టీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తీవ్ర స్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో కేవలం తెలంగాణ ఉద్యోగులే పనిచేస్తారని, ఏపీ ఉద్యోగులు పనిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. రిలీవైన ఉద్యోగులు ఏపీ విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతల ఉచ్చులో పడి బలికావద్దని హితవు పలికింది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు వైఖరికి వ్యతిరేకంగా టీ విద్యుత్ జేఏసీ శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ సౌధ ఎదుట నిరసన సభ ఏర్పాటు చేసింది.



ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు వెళ్లిపోయాకే తెలంగాణలో విద్యుదుత్పత్తి మెరుగుపడిందని జేఏసీ నేతలు వ్యాఖ్యానించారు. చంద్రబాబు వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. ఏపీ అధికారుల పర్యవేక్షణలో రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం తరచుగా బ్రేక్ డౌన్ అయ్యేదని, వారు వెళ్లిపోయాక ఆ సమస్య ఒక్కసారి కూడా రాలేదని పేర్కొన్నారు. రూ.97 వేల కోట్ల అంచనాలతో 22 వేల మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ఏపీ అధికారులు ఇక్కడే ఉంటే వారి కుట్రలతో ఈ వ్యయం రూ.2 లక్షలకు పెరుగుతుందని ఆరోపించారు. సభలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, టీఆర్‌ఎస్ నేత దేవీప్రసాద్, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి రామచంద్రు, జేఏసీ నేతలు శివాజి, జానయ్య, రవి, సత్యనారాయణ, మాధవి  పాల్గొన్నారు.

 

ఉద్యోగుల విభజనకు అడ్డుపడుతున్న బాబు

చంద్రబాబు శాడిస్ట్ అని, ఉద్యోగుల విభజనకు అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జిల్లా, జోనల్ ఉద్యోగుల విభజనకు హోంశాఖ కమిటీలు ఏర్పాటు చేస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల విభజనలో తాత్సారం చేస్తున్న కమలనాథన్, షీలాభిడే కమిటీలు దొంగ కమిటీలని మండిపడ్డారు. ఏపీ ఉద్యోగులు తెలంగాణలోనే ఉండేలా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దేవీప్రసాద్ మండిపడ్డారు. అర్థగణాంక శాఖలో 240 మందికి పైగా ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేస్తే కోర్టు ఉత్తర్వులు తెచ్చుకుని ఇక్కడే ఉండేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. విద్యుత్ వాటాల పం పకాలపై కేంద్ర హోంశాఖ నియమించిన నీరజా మాథూర్ కమిటీ సమర్పించిన నివేదిక ఏపీ సీఎం కుట్రల వల్లే బయటకు రాలేదని రామచంద్ర ఆరోపించారు.




 

Read also in:
Back to Top