'తండాలను పంచాయతీలుగా మార్చాలి'


తాండూరు (రంగారెడ్డి జిల్లా): తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలని లంబాడ సంక్షేమ సమితి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సమితి రాష్ట్ర అధ్యక్షులు అంగోత్ ధన్‌రాజ్‌నాయక్, రాష్ట్ర గౌరవాధ్యక్షులు విఠల్‌నాయక్, రాఘవనాయక్‌లు తాండూరులో విలేకరులతో మాట్లాడారు. మైదాన ప్రాంతాల్లోని అన్ని గిరిజన తండాలకు ఐటీడీఏ హోదా కల్పించాలన్నారు. ఎలాంటి షరతులు లేకుండా గిరిజనులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి నియోజకవర్గంలో బంజరాభవన్ ఏర్పాటు చేయాలన్నారు. సేవాలాల్ మహరాజ్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.



గిరిజనులకు 12శాతం రిజర్వేషన్‌ను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన జాగృతి యాత్ర ద్వారా గిరిజన తండాల్లో పర్యటిస్తూ సారా తయారీని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆడపిల్లలను విక్రయించొద్దని తండాల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. కర్ణాటక తరహాలో గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అంతకుముందు సమితి నాయకులు తాండూరులోని పలు తండాల్లో పర్యటించారు.




 

Read also in:
Back to Top