‘స్మార్ట్’ జాబితాలో పలు చిన్న నగరాలు!

‘స్మార్ట్’ జాబితాలో పలు చిన్న నగరాలు! - Sakshi


న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వంద ‘స్మార్ట్’ నగరాల అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన జాబితాలో రాష్ట్రాల రాజధానులను తోసిరాజని పలు చిన్న నగరాలు చోటు పొందడం విశేషం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈ జాబితాలో.. ఎన్నికల ముంగిట్లో ఉన్న బిహార్ రాజధాని పాట్నాకు చోటు దక్కకపోగా.. బిహార్ షరీఫ్ పేరు నామినేట్ అయింది. హిమాచల్‌ప్రదేశ్‌లో సిమ్లాను తోసిరాజని ధర్మశాల చోటుపొందింది. కర్ణాటకలో శివమొగ్గకూ చోటు దక్కింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 13 నగరాలకు  చోటు లభించింది.



జాబితాలో చేరిన వాటిలో ఇంకా రాయ్‌పూర్, గువాహటితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఉంది.  ఢిల్లీతోపాటు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకూ చోటు లభించింది. ముంబై, కోల్‌కతా, లక్నో, జైపూర్, రాంచీ, భువనేశ్వర్‌లూ ఇందులో ఉన్నాయి. ఇప్పటివరకు తమకు 98 నగరాలకు సంబంధించిన ప్రతిపాదనలు అందాయని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. వీటిపై విశ్లేషించి తొలి విడతలో 20 నగరాలను ఎంపిక చేసి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కోదానికి రూ.200 కోట్ల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఈ నెలాఖరుకల్లా 20 నగరాల ఎంపిక జరుగుతుందన్నారు. అనంతరం రాబోయే రెండేళ్లలో 40 నగరాలు చొప్పున ఎంపిక చేసి  నిధులను అందజేస్తామని తెలిపారు.




 

Read also in:
Back to Top