అవమాన భారంతో... రైతు ఆత్మహత్యాయత్నం

చికిత్స పొందుతున్న రైతు నారాయణరెడ్డి - Sakshi


తీవ్ర మనస్తాపంతో పురుగులమందు తాగిన రాప్తాడు రైతు నారాయణరెడ్డి రుణమాఫీ జరగకపోవడంతో దారుణం

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ నమ్మి మోసపోయిన మరోరైతు ఉసురు తీసుకునే ప్రయత్నంచేశాడు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను వేలం వేయనున్నట్లు పత్రికల్లో ప్రకటించడంతో అవమానభారం భరించలేక అనంతపురం జిల్లాకు చెందిన వై.నారాయణరెడ్డి బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించాడు.



ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వాస్పత్రి ఐసీయూలో వెంటిలేటర్‌పై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు మండలం యర్రగుంటకు చెందిన నారాయణరెడ్డి ఆత్మాభిమానంతో, అవమానభారంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. అతనికి పదెకరాల పొలముంది. ఏటా వేరుశనగ సాగు చేస్తున్నాడు. ఈ ఏడాదీ వేసినా పూర్తిగా దెబ్బతినింది. దీనికితోడు ఇటీవల దాదాపు రూ.1.50 లక్షలు ఖర్చు చేసి పొలంలో మూడు బోరుబావులు త వ్వించినా చుక్క నీరు పడలేదు.



వ్యవసాయంకోసం అదే మండలంలోని బండమీదపల్లి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.87 వేల పంటరుణం తీసుకున్నాడు. ఆవుల కోసం రూ.35 వేల రుణాన్ని రాప్తాడు కెనరా బ్యాంకులో తీసుకున్నాడు. అనంతపురం కెనరా బ్యాంకులో 48 గ్రాముల బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణం రూ.1.16 లక్షలుంది. భార్య నాగేంద్రమ్మ పేరుతో రూ.46 వేల డ్వాక్రా అప్పు ఉంది. ఇవి కాకుండా మరో రూ.2.75 లక్షల ప్రైవేటు అప్పులున్నాయి. మొత్తమ్మీద రూ. 6.02 లక్షల అప్పుంది. చంద్రబాబు చెప్పిన మాట మేరకు డ్వాక్రా, వ్యవసాయ, బంగారు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తే రూ.3.34 లక్షలు రుణమాఫీ కావాలి.



అయితే ఇతనికి అన్ని రుణాలు కలిపి  రూ.21,026 మాత్రమే మాఫీ అయ్యింది. మరోవైపు అప్పు చెల్లించకపోతే బంగారం వేలం వేస్తామని బ్యాంకు అధికారులు 28వ తేదీన నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 7న వేలం వేస్తామంటూ బుధవారం పత్రికల్లో నోటీసులు ఇచ్చారు. దీంతో నారాయణరెడ్డి కుంగిపోయాడు. తన పొలంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.

 

రుణమాఫీ అయ్యుంటే ఇలా జరిగేది కాదు

మాకు రుణమాఫీ అయ్యుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పంటలు పండక అప్పులు ఎక్కువయ్యాయి. పెద్దోణ్ని ఇంటర్ వరకు చదివించాం. ఆర్థిక స్తోమత లేక ఇంట్లోనే ఉంటున్నాడు. చిన్నోన్ని ఇంటర్ చదివిస్తున్నాం. ఓ పక్క నోటీసులొచ్చాయి. మరో పక్క అప్పులిచ్చినోళ్ల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువవుతోంది. అందుకే ఆయనీ పని చేశాడు.     - నాగేంద్రమ్మ (రైతు నారాయణరెడ్డి భార్య)




 

Read also in:
Back to Top