సింగరేణి సిగలో మరో నగ


* భూపాలపల్లి కేంద్రంగా కొత్తగా ఏడు గనులు

* ప్రతిపాదనలు సిద్ధం చేసిన సింగరేణి కాలరీస్    

సాక్షి, హన్మకొండ: విద్యుత్, పారిశ్రామిక రంగాల నుంచి వస్తున్న డిమాండ్‌ను లక్ష్యంగా చేసుకుని సింగరేణి కాలరీస్ సంస్థ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా వరంగల్ జిల్లా భూపాలపల్లి కేంద్రంగా కొత్తగా ఏడు గనులు ప్రారంభించనుంది. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా భూపాలపల్లి కేంద్రంగా కొత్త ఏరియాను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.  

 

ప్రస్తుతం భూపాలపల్లిలో 5 భూగర్భ, ఒక ఉపరితల గని ఉంది. రాబోయే ఐదేళ్ల వ్యవధిలో భూపాలపల్లి చుట్టూ వెంకటాపురం, గోవిందరావుపేట, ఘణపురం మండలాల పరిధిలో కొత్తగా ఏడు గనులు ప్రారంభించాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పాలనపరమైన, పర్యావరణశాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. అనుమతుల ఆధారంగా ఘణపురం మండలం పెద్దాపూర్, వెంకటాపురం మండలకేంద్రంతో పాటు మల్లయ్యపల్లి, లక్ష్మీదేవిపేట, గోవిందరావుపేట మండలం పస్రా బ్లాక్‌లలో నూతన గనులు ప్రారంభిస్తారు. వీటితోపాటు కేటీకే 2 గనిని ఓపెన్‌కాస్ట్‌గా మారుస్తారు. ఇవన్నీ ఏర్పాటైతే.. పాలన సౌలభ్యం దృష్ట్యా భూ పాలపల్లి-2 పేరుతో కొత్త ఏరియాను ఏర్పాటు చేయాల్సి అవసరం ఏర్పడుతోంది.




 

Read also in:
Back to Top