ఆన్‌లైన్‌లో ఇంటర్ మూల్యాంకనం!

ఆన్‌లైన్‌లో ఇంటర్ మూల్యాంకనం! - Sakshi


* అధ్యాపకుల వద్దకే జవాబు పత్రాలు

* ప్రత్యేక ఫార్మాట్‌లో మార్కులు

* అధ్యయనం చేస్తున్న ఇంటర్మీడియెట్ బోర్డు


సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల జవాబు పత్రాలను ఆన్‌లైన్ ద్వారా మూల్యాంకనం చేసే అంశంపై రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు దృష్టి సారించింది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం సీబీఎస్‌ఈ సిలబస్‌లో 11, 12వ తరగతులకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఆన్‌లైన్ ద్వారానే చేస్తున్నారు. ఇదే విధానాన్ని రాష్ట్రంలో అమలుచేయాలని బోర్డు భావిస్తోంది.



అయితే సీబీఎస్‌ఈ విద్యార్థులతో పోల్చితే ఇంటర్ విద్యార్థుల సంఖ్య దాదాపు 8 రెట్లు ఉంటుంది. ఈ నేపథ్యంలో 9.5లక్షల మంది విద్యార్థులకు చెందిన 56 లక్షల జవాబు పత్రాలను స్కాన్ చేయించి, ఇన్విజిలేటర్లకు పంపి వ్యాల్యుయేషన్ చేయించడం ఏమేరకు సాధ్యమవుతుందన్న అంశాలను పరిశీలిస్తోంది. అయితే ప్రస్తుతం కాకినాడ జేఎన్టీయూ ఇంజనీరింగ్ విద్యార్థుల జవాబు పత్రాలను ఆన్‌లై న్ ద్వారా మూల్యాంకనం చేయిస్తోంది. తద్వారా లెక్చరర్లకు పేపర్లు పంపించడం, లేదా అందరిని ఒకచోటికి రప్పించి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించడం వంటి పనులకు స్వస్తి చెప్పింది. ఇదే తరహా విధానాన్ని ఇంటర్‌లోనూ అమలు చేస్తే వందల మంది లెక్చరర్లు ఒకచోట కూర్చొని వ్యాల్యుయేషన్ చేయడం లేదా జవాబు పత్రాలను లెక్చరర్లకు ఇచ్చి మూల్యాంకనం చేయించడం వంటి పనుల భారం తగ్గించుకోవచ్చని ఇంటర్ బోర్డు భావిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే అవకాశముంది.

 

ఇదీ ఆన్‌లైన్ మూల్యాంకన విధానం

పరీక్ష కేంద్రాల నుంచి జవాబు పత్రాలను జిల్లా కేంద్రాల్లోని జిల్లా సేకరణ, పంపిణీ కేంద్రానికి పంపిస్తారు. ఒక జిల్లాకు చెందిన విద్యార్థుల జవాబు పత్రాలను మరో జిల్లాకు పంపుతారు. అక్కడ వాటిని స్కాన్ చేసి, ముందుగా ఎంపిక చేసిన లెక్చరర్లకు ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. వారు కంప్యూటర్‌లో వాటిని ఓపెన్ చేసి, పరిశీలించి ఇంటర్ బోర్డు ఇచ్చే ఫార్మాట్‌లో మార్కులు వేస్తారు. ఈ మార్కుల షీట్లను స్కాన్ చేసి.. తిరిగి జిల్లా సేకరణ, పంపిణీ కేంద్రానికి పంపిస్తారు. అక్కడి నుంచి అన్ని జవాబుపత్రాల మార్కుల వివరాలతో కూడిన షీట్లను ఇంటర్ బోర్డుకు పంపిస్తారు. ఆయా జవాబు పత్రాల బార్‌కోడ్ ఆధారంగా హాల్‌టికెట్ నంబర్‌తో అనుసంధానం చేసి, విద్యార్థుల మార్కులను ప్రకటిస్తారు.




 

Read also in:
Back to Top