చట్టాలకు కట్టుబడి ఉంటాం


నూతన రాజధానిపై ఎన్జీటీలో ఏపీ ప్రభుత్వం వాదనలు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి ఉన్న పర్యావరణ ముప్పు, వరద ప్రభావం తదితర అంశాలపై తగిన సమాచారాన్ని రెండు వారాల్లో అందజేస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాజధాని ప్రాంతానికి వరద ముప్పు ఉందని, అలాగే సారవంతమైన భూములను వినియోగించి పర్యావరణానికి హాని తలపెడుతున్నారని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో శ్రీమన్నారాయణ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ యూడీ సాల్వి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ సోమవారం విచారించింది.



నదీ పరివాహక ప్రాంతంలో నగరాలు నిర్మించడం వల్ల వివిధ రాష్ట్రాల్లో అలాంటి నగరాలకు జరిగిన ప్రమాదాలను పిటిషనర్ తరుఫున న్యాయవాది సంజయ్ ఫారిఖ్ వివరించారు. దీనికి కౌంటర్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాది ఎ.కె.గంగూలీ తన వాదనలు వినిపిస్తూ పర్యావరణానికి ఎలాంటి ముప్పు జరగనివ్వబోమని, రాజధాని నిర్మాణంలో ఏ చట్టాన్నీ ఉల్లంఘించబోమని, ఏ పని చేసినా చట్టబద్ధంగానే చేస్తామని వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వారాల్లో సమాచారం ఇస్తానంటున్నందున ఇప్పుడు జోక్యం అవసరం లేదని పేర్కొంటూ ట్రిబ్యునల్ తన విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది.




 

Read also in:
Back to Top