విద్యుత్ ఉద్యోగులను చేర్చుకోండని టి.సర్కారును ఆదేశించండి


కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్‌కు ఏపీ సీఎస్ ఐవైఆర్ లేఖ

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా స్థానికత పేరుతో రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్‌ను కోరారు. శనివారం గోయల్‌కు కృష్ణారావు నాలుగు పేజీల లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 82 ప్రకారం ఏడాదిలోగా ప్రభుత్వ రంగ సంస్థలే ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసుకోవాలని, సంప్రదింపుల ద్వారా ఇరు రాష్ట్రాలు పంపిణీ చేసుకోని పక్షంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనే నిబంధన ఉందనే విషయాన్ని లేఖలో సీఎస్ గుర్తు చేశారు.



అయితే తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని విద్యుత్ సంస్థల నుంచి స్థానికత ఆధారంగా ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేసిందని వివరించారు. దీన్ని హైకోర్టు కూడా తప్పుబట్టిందని, అయినా తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ న్యాయస్థానం సూచనలను కూడా పాటించడం లేదని సీఎస్ పేర్కొన్నారు. 40, 50 ఏళ్లుగా తెలంగాణలో స్థిరనివాసం ఏర్పరుచుకుని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారిని స్థానికేతరులుగా తెలంగాణ ప్రభుత్వం పేర్కొనడం సమజసం కాదన్నారు.



ఆంధ్రా ఉద్యోగులను తొలగించి ఆ స్థానంలో తెలంగాణ వారికి పదోన్నతులు కల్పించడం, కొత్త వారిని నియమించుకోవడానికే తెలంగాణ సర్కారు స్థానికత తెరపైకి తెచ్చిందని సీఎస్ పేర్కొన్నారు. ఇదే అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు నష్టపోతారని, ఇందులో సమన్యాయం లేదని సీఎస్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని తెలంగాణ ప్రభుత్వం తొలగించిన ఆంధ్రా ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేలాగ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జనాభా ప్రాతిపదికనే ఉద్యోగుల పంపిణీ జరగాలని, కానీ తెలంగాణ ప్రభుత్వం స్థానికత అంటూ కొత్తగా తెరపైకి తేవడం అన్యాయమన్నారు.




 

Read also in:
Back to Top