సవాల్ చేస్తే గట్టి జవాబిస్తాం

సవాల్ చేస్తే గట్టి జవాబిస్తాం


హోం మంత్రి రాజ్‌నాథ్ హెచ్చరిక

నీముచ్(మధ్యప్రదేశ్): పాకిస్తాన్‌తో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని, అయితే దేశ ప్రతిష్టకు సవాల్ విసిరితే గట్టి జవాబిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం హెచ్చరించారు. గురుదాస్‌పూర్ ఘటన నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘పొరుగు దేశంతో మేం సత్సంబంధాలను కోరుకుంటూ ఉంటే సీమాంతర ఉగ్రవాద ఘటనలు ఎందుకు పదేపదే జరుగుతున్నాయో నాకు అర్థం కావడం లేదు. మేం శాంతిని కోరుకుంటున్నామని, అయితే అందుకు దేశ ప్రతిష్టను పణంగా పెట్టబోమని పొరుగు దేశానికి చెప్పదల్చుకున్నా’ అని ఆయన అన్నారు.  



సీఆర్‌పీఎఫ్ 76వ వ్యవస్థాపక దినం సందర్భంగా ఆ బలగం ఏర్పాటైన నీముచ్‌లో జరిగిన కార్యక్రమానికి రాజ్‌నాథ్ హాజరయ్యారు. గురుదాస్‌పూర్ ఘటన వివరాలు తెసుకున్నానని, పంజాబ్ సీఎం, జాతీయ భద్రతా సలహాదారు, హోం శాఖ కార్యదర్శితో మాట్లాడానని చెప్పారు. ఈ ఉదంతంపై మంగళవారం పార్లమెంట్‌లో ప్రకటన చేస్తానన్నారు. కాగా, ఉగ్రవాదం జాతీయ సమస్య అని, దాన్ని జాతీయ విధానాలతోనే అరికట్టాలని పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ పేర్కొన్నారు. పంజాబ్‌లో ఉగ్రవాద దాడి జరుగుతుందని సమాచారమొస్తే సరిహద్దును మూసేయాల్సి బాధ్యత  కేంద్రానిదేనన్నారు. ఆయన అమృత్‌సర్‌లోని గురునానక్ ఆస్పత్రికివెళ్లి దాడి క్షతగాత్రులను పరామర్శించారు.




 

Read also in:
Back to Top