కాంగ్రెస్ తీరు సరికాదు

కాంగ్రెస్ తీరు సరికాదు - Sakshi


జీఎస్‌టీ బిల్లుపై అరుణ్ జైట్లీ

* రాజకీయ కారణాలతోనే బిల్లుకు అడ్డుపడుతోంది


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని పరోక్ష పన్నుల స్థానంలో ప్రవేశపెట్టాలనుకుంటున్న వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) విషయంలో అడ్డుపడుతూ కాంగ్రెస్ అభివృద్ధి నిరోధక వైఖరి కనబరుస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. తమ ప్రభుత్వంపై రాజకీయ కారణాలతో కలవరపడుతూ జీఎస్‌టీ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటోందని దుయ్యబట్టారు.



ఈ విధానం దేశానికి, ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరుస్తుందనే విషయాన్ని ఆ పార్టీ ఇప్పటికైనా అంగీకరించి ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం తన ఫేస్‌బుక్ పేజీలో ‘డిసెంట్ ఆర్ డిస్ప్ష్రన్: కాంగ్రెస్ పార్టీస్ పొజిషన్ ఆన్ జీఎస్‌టీ’ పేరిట జైట్లీ తన అభిప్రాయాలను నెటిజన్ల ముందుంచారు. ఆ పార్టీ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన జీఎస్‌టీ బిల్లులో తమ ప్రభుత్వం కీలక మార్పులేవీ చేయలేదని, ఈ బిల్లుకు కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలు కూడా మద్దతు తెలిపాయన్నారు.



బిల్లులోని అంశాలను కాంగ్రెస్ ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నా గత యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీలు రూపొందించిన జీఎస్‌టీ బిల్లుల్లో ఈ ప్రతిపాదనలేవీ లేవని జైట్లీ గుర్తుచేశారు. జీఎస్‌టీ రేటు 18 శాతంగా ఉండాలంటూ కాంగ్రెస్ చేసిన డిమాండ్ సహేతుకమైనదే అయినప్పటికీ దీనిపై జీఎస్‌టీ మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జీఎస్‌టీ మండలిలో రాష్ట్రాల ఓటింగ్ అధికారాలను మూడొంతులకు పెంచాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను కూడా జైట్లీ తోసిపుచ్చారు.




 

Read also in:
Back to Top