మాకూ తోడ్పాటు అందించండి

మాకూ తోడ్పాటు అందించండి


మంత్రి జూపల్లితో ఫిక్కీ మహిళా విభాగం భేటీ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ.200 కోట్ల పెట్టుబడులతో రెండువేల మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని భారతీయ పరిశ్రమలు, వాణిజ్య సమాఖ్య (ఫిక్కీ) అనుబంధ మహిళా సంస్థ (ఎఫ్‌ఎల్‌ఓ) వెల్లడించింది. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఎఫ్‌ఎల్‌ఓ ప్రతినిధి బృందం సోమవారం భేటీ అయింది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా 2014 నవంబర్‌లో ఎఫ్‌ఎల్ ఓకు భూమి కేటాయించేందుకు టీఎస్‌ఐఐసీ ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని బృందం సభ్యులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వస్త్రోత్పత్తులు, ఆభరణాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫర్నిచర్ తయారీ తదితర రంగాల్లో 36 మంది ఎఫ్‌ఎల్‌ఓ సభ్యులు ఆసక్తితో ఉన్నారని, భూ కేటాయింపులు జరిగిన రెండేళ్ల వ్యవధిలో పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉన్నారన్నారు.  



భూమి ధరలో 50 శాతం తగ్గించాలని, ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఎఫ్‌ఎల్‌ఓ సభ్యులకు కూడా వర్తించేలా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పారిశ్రామిక విధానంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలనూ ప్రోత్సహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎఫ్‌ఎల్‌ఓ ప్రతినిధులు రేఖా లహోటి, సామియా ఆలంఖాన్, వాణి సుభాష్, జోత్స్న అంగర తదితరులు జూపల్లిని కలసిన వారిలో ఉన్నారు.

 

నోటు పుస్తకాలపై తెలంగాణ చరిత్ర:జూపల్లి

నోటు పుస్తకాల తయారీ, సరుకు రవాణా వ్యాపారాలను మరింత విస్తరించాలని టీఎస్‌టీపీసీ అధికారులకు పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వాణిజ్య అభివృద్ధిలో భాగంగా చేనేత, జౌళి, హస్తకళల ఉత్పత్తులను ఆన్‌లైన్ మార్కెటింగ్ చేయడంపై దృష్టి సారించాలన్నారు. టీఎస్‌టీపీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నోటు పుస్తకాల తయారీ డివిజన్‌తో పాటు రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలోని సరుకు రవాణా కేంద్రాన్ని మంత్రి సోమవారం సందర్శించారు. తెలంగాణ సంక్షిప్త చరిత్ర, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నోటు పుస్తకాలపై తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ముద్రించాల్సిందిగా మంత్రి అదేశించారు.




 

Read also in:
Back to Top