బలమైన వ్యవస్థ కావాలి


అతివాద నిరోధంపై కేంద్రం

న్యూఢిల్లీ: ఐఎస్‌ఐఎస్ వంటి సంస్థలు ప్రచారం చేసే తరహా అతివాద సిద్ధాంతాల పట్ల యువత ఆకర్షితులు కాకుండా నిరోధించేందుకు.. ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మత పెద్దలతో యువతకు ప్రబోధాలు ఇవ్వటం, యువతకు, వారి తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు ఇవ్వటం, అతివాద సామాజిక మీడియా వేదికలపై భావ వ్యక్తీకరణల పరిశీలన వంటి పలు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్ అధ్యక్షతన శనివారం ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఒక వ్యూహాన్ని ఖరారు చేశారు.



ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, అస్సాం, పంజాబ్, పశ్చిమబెంగాల్ తదితర డజను రాష్ట్రాల డీజీపీలు, హోంశాఖల కార్యదర్శులు, ఢిల్లీ (పోలీస్ కమిషనర్).. ఈ సమావేశానికి హాజరయ్యారు. ఐఎస్‌ఐఎస్ వంటి సంస్థల్లో చేరేందుకు యువకులు ఆలోచిస్తున్నారన్న నివేదికలకు సత్వరమే స్పందించటం ఎలా? అతివాద సిద్ధాంతాల ప్రభావానికి భారతీయ యువకులు లోబడకుండా నిరోధించటం ఎలా? అనే అంశాలపై సర్కారు దృష్టి కేంద్రీకరించనుంది.



దేశవ్యాప్తంగా 25 మంది యువకులు ఐఎస్‌ఎస్ సిద్ధాంతానికి ఆకర్షితులై, ఆ సంస్థలో చేరాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు అధికారిక అంచనా. తెలంగాణలో 17 మంది సిరియా వెళ్లేందుకు ప్రయత్నించగా.. సకాలంలో నిరోధించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దేశంలో అంతర్గత భద్రతకు ప్రస్తుతం ఉన్న, రాబోతున్న ముప్పుల గురించి రాష్ట్రాలను అప్రమత్తం చేసేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది.




 

Read also in:
Back to Top