ఉప్పల్ డీసీపై ‘సమ్మె’ట వేటు!


* ప్రభుత్వానికి సరెండర్ చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్

* బీజేపీ ఎమ్మెల్యే దీక్షకు ‘ఇస్కాన్’ నుంచి భోజనం అందించారని ఆరోపణ


సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మె పరిష్కారం విషయంలో పంథాలు ఓ అధికారి కుర్చీకే ఎసరు పెట్టాయి! సమ్మె పట్ల కఠినంగా వ్యవహరించలేదనే ఆరోపణలపై ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్(డీసీ)పై జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ వేటు వేయడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.



ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేసినందుకు సమ్మెలో పాల్గొన్న 1,300 మంది కార్మికులను జీహెచ్‌ఎంసీ తొలగించిన విషయం తెలిసిందే. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాలు, వామపక్షాలతో పాటు బీజేపీ సైతం ఆందోళనలు చేస్తోంది. ఇదే కోవలో ఉప్పల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ గత 24 నుంచి 31 వరకు ఉప్పల్ సర్కిల్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేశారు. వారం పాటు కొనసాగించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళను విరమించారు. ధర్నాలో పాల్గొన్న వారికి ఒకరోజు  ‘హరే రామ హరే కృష్ణ’ మఠం నిర్వాహకులు ఉచితంగా భోజనాన్ని సరఫరా చేశారు.



జీహెచ్‌ఎంసీ రాయితీతో ‘హరే రామ హేరే కృష్ణ’ మఠం రూ.5కే భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వారికి ఈ పథకం కింద భోజనం వడ్డించారని ఉన్నతాధికారులు భావించారు. ఈ అంశంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ శనివారం డిప్యూటీ కమిషనర్ పి.విశ్వనాథ్‌ను వివరణ కోరారు. ఇందులో తన ప్రమేయం లేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అయితే విశ్వనాథ్‌ను ఉప్పల్ సర్కిల్ బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

 

ప్రసాదం పంపాలని కోరా..

దీనిపై ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ వివరణ ఇస్తూ.. ధర్నాలో పాల్గొన్న వారికి తన కోరిక మేరకే ఇస్కాన్ మఠం వాళ్లు ప్రసాదం పంపించారని చెప్పారు. ‘ఏకాదశి నాడు చాలా మంది ఉపవాస దీక్ష చేశారు. ఆ మరుసటి రోజు ధర్నా చేయడంతో మఠం నుంచి ప్రసాదాన్ని తెప్పించాను. రూ.5కే భోజనం పథకంతో ఈ ప్రసాదానికి ఎలాంటి సంబంధం లేదు.’ అని తెలిపారు.




 

Read also in:
Back to Top