రూ.15కే మద్యం!

రూ.15కే మద్యం! - Sakshi


గుడుంబాకు విరుగుడుగా సర్కారు నిర్ణయం

* 90 ఎం.ఎల్. సీసాల్లో అందుబాటులోకి..

* మండలం యూనిట్‌గా కొత్త మద్యం పాలసీ

* గ్రామ గ్రామానికి చౌకమద్యం చేరేలా ప్రతిపాదనలు

* గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి మద్యం

* కల్తీ కల్లు నివారణకు ఈత, తాటి చెట్లు పెంచడమే మార్గం

* ఎక్సైజ్ శాఖ సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

* మూడు రోజుల్లో సమగ్ర విధానం రూపొందించాలని ఆదేశం


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబాను అరికట్టేందుకు చౌకమద్యం అందించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... కేవలం రూ.15కే 90 మిల్లీలీటర్ల మద్యం అందేలా చర్యలు చేపడుతోంది.



అంతేగాకుండా పల్లెపల్లెనా ఈ చౌకమద్యం అందుబాటులో ఉండేలా కొత్త మద్యం పాలసీని రూపొందిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘కాయకష్టం చేసుకునే పేదలు సేద తీరేందుకు మద్యానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు దాన్ని మార్చలేం. ప్రాణాలకు హాని కలగని విధంగా చవకగా మద్యాన్ని అందుబాటులోకి తేవాలి. పది రూపాయలకు గుడుంబా ప్యాకెట్ దొరుకుతున్నప్పుడు రూ.40 పెట్టి చీప్ లిక్కర్ ఎందుకు కొంటారు. వారి కోసం రూ.15కే 90 ఎం.ఎల్. మద్యం సీసాలు అందుబాటులో ఉండేలా చూడాలి..’’ అని సూచించినట్లు తెలిసింది.



నూతన మద్యం విధానంపై సీఎం కేసీఆర్ శుక్రవారం సచివాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుగౌడ్, రెవెన్యూ(ఎక్సైజ్, సీటీ) ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఇతర అధికారులతో సమీక్షించారు. నూతన మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై కేసీఆర్ ఈ సమావేశంలో స్పష్టత ఇచ్చారు. గుడుంబాను అరికట్టేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలేవీ సత్ఫలితాలివ్వడం లేదని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోనే సమస్యకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు.



‘‘గుడుంబా తయారీలో అవలంబించే పాడు పద్ధతుల వల్ల అది విషంతో సమానమవుతుంది.

 గుడుంబా వల్ల ఇంటి యజమానులు చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో మహిళలు వితంతువులుగా మారుతున్నారు. గుడుంబా అనేదే లేకుండా చేయడానికి అవలంబించాల్సిన విధానాన్ని ఖరారు చేయాలి..’’ అని ఎక్సైజ్ అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. రూ.15కే హానికలగని రీతిలో 90 ఎం.ఎల్ మద్యం సీసాలను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించినట్లు తెలిసింది.

 

మండలం యూనిట్‌గా..

ఇప్పటివరకు జిల్లాను యూనిట్‌గా తీసుకొని మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో లెసైన్సులు జారీ చేస్తున్నారు. కానీ కొత్త మద్యం విధానంలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని ఆ మండలంలోని జనాభా, గతంలో జరిగిన మద్యం అమ్మకాల రికార్డుల ఆధారంగా ఎ-4 మద్యం దుకాణాలను ఖరారు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అయితే మండలంలో ఒకటి లేదా రెండు మద్యం దుకాణాలకే అవకాశం ఉండడంతో.. పల్లెలకు కూడా సర్కారీ చీప్‌లిక్కర్ ఎలా చేరాలో అధ్యయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనిపై మూడు రోజుల్లో ప్రతిపాదనలు రూపొందించి, అందించాలని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్‌కు సూచించినట్లు తెలిసింది. మండలంలో లెసైన్సు పొందిన మద్యం దుకాణదారుడే అనుబంధంగా బి-లెసైన్స్ పొంది ఆయా గ్రామాల్లో చౌక మద్యం విక్రయించేలా పాలసీని రూపొందించే అవకాశమున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

 

గ్రేటర్‌కు ప్రత్యేక పాలసీ

దేశంలోని మెట్రో నగరాల సరసన చేరిన గ్రేటర్ హైదరాబాద్‌కు విడిగా మద్యం పాలసీని తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ‘పారిశ్రామిక, పర్యాటక రంగాలతో పాటు ఐటీలో దూసుకుపోతున్న హైదరాబాద్‌కు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. వారికి అవసరమైన విదేశీ మద్యం స్టార్ హోటళ్లలో అందుబాటులో ఉండాలి. వైన్‌లోని మేలిమి రకం ఇక్కడ లభించడం లేదని పలువురు విదేశీ ప్రతినిధులు నాతో అన్నారు. అంతర్జాతీయ స్థాయి నగరంలో అదే ప్రమాణాలతో కూడిన మద్యం కూడా అందుబాటులోకి తేవాలి..’’ పేర్కొన్నారు.

 

చెరువుల గట్లపై ఈతచెట్లు..

గత పాలకులు అవలంబించిన విధానాల వల్ల స్వచ్ఛమైన కల్లు స్థానంలో కల్తీకల్లు, మందు కల్లు మొదలైందని... మంచి కల్లు అందించాలంటే తాటి, ఈత వనాలు పెంచడమే మార్గమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కల్తీకల్లు వల్ల ప్రజల మానసిక స్థితి దెబ్బతినే పరిస్థితి నెలకొంది. కల్తీకల్లు లేకుండా చేయాలి.. చెరువుల చుట్టూ, చెరువు కట్టల కింద విరివిగా ఈత చెట్లు పెంచాలి. వచ్చే ఏడాది చెరువుల వద్ద ఐదు కోట్ల ఈత మొక్కలు నాటి పెంచాలి.



ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోనే నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలి. ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకంగా ఇద్దరు డీఎఫ్‌వోలను కేటాయిస్తాం’’ అని తెలిపారు. రాష్ట్రంలో వినియోగమయ్యే మద్యం ఇక్కడే తయారయ్యేలా డిస్టిలరీస్ ఉండాలని, దాంతో ఇక్కడివారికి ఉద్యోగావ కాశాలు, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని కేసీఆర్ చెప్పారు.




 

Read also in:
Back to Top