ఏయ్.. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి?!

ఏయ్.. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి?! - Sakshi


సాక్షి, విజయవాడ బ్యూరో: సమస్యలపై వినతులు ఇచ్చేందుకు వచ్చిన మహిళా సంఘాల నేతలపై  చంద్రబాబు పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నావేంటి’ అంటూ తీవ్ర అసహనం ప్రదర్శించారు. దీనిపై వారు అభ్యంతరం తెలపడంతో క్షమాపణలు చెప్పారు. డ్వాక్రా రుణాల మాఫీపై చర్చించేందుకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వామపక్ష మహిళా సంఘం రాష్ట్ర సదస్సు జరిగింది. సదస్సు తర్వాత మహిళలంతా ర్యాలీగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారించి సీఎం వద్దకు 10 మందిని అనుమతించారు.   



డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదని, దీనివల్ల వారు ఇబ్బంది పడుతున్నారని ప్రగతి శీల మహిళా సంఘం నేత ఎం.లక్ష్మి చెప్పగా సీఎం అసహనం వ్యక్తం చేశారు. వాళ్ల జేబులో వేసుకోవడానికి ఎంతంటే అంత డబ్బులు ఇవ్వలేమని, ఉపాధి కోసమే డబ్బు ఇస్తామని చెప్పారు. ఇతర నేతలు ఇసుక ర్యాంపుల్లో మహిళలకు 25 శాతం వాటా రావాల్సివున్నా రావడంలేదని, రూ.150 కూలి మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. దీంతో సీఎం వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఏయ్ ఎక్కువమాట్లాడుతున్నావేంటి.. నువ్వు నాకు చెప్పాలా’ అని లక్ష్మిపై విరుచుకుపడ్డారు. మిగిలిన నేతలు అభ్యంతరం చెప్పడంతో...  సీఎం క్షమాణలు చెప్పారు.



అనంతరం గుడి, బడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ  బెల్టు షాపులు పెడుతున్నారని, దీనివల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా... ఎక్కడున్నాయో చూపించాలని గద్దించారు. రామకృష్ణాపురం బుడమేరు వంతెన దగ్గరే బెల్టుషాపు ఉందని దీంతో ఏపీ మహిళా సమాఖ్య నేత   చెప్పగా... దాని సంగతి చూస్తానంటూ వెళ్లిపోయారు. తాము మాట్లాడుతుండగానే సీఎం వెళ్లిపోవడంపై మహిళా సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు బయటకు పంపించివేశారు. ప్రగతిశీల మహిళా సంఘం నేత లక్ష్మి మాట్లాడుతూ... ఇలాంటి సీఎంను ఎప్పుడూచూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.




 

Read also in:
Back to Top