కేంద్ర నిధులతోనే రాజధాని భవనాలు


సాక్షి, హైదరాబాద్: నూతన రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి పూర్తిగా కేంద్ర నిధులను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నూతన రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం వెయ్యి కోట్లు, భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులను పూర్తిగా ఖర్చు చేసిన తరువాతనే కేంద్రం తదుపరి నిధులను విడుదల చేయనుంది. ప్రభుత్వ భవనాలు మినహా రాజధానిలో మిగతా నిర్మాణాలన్నీ పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టనున్నట్లు సీనియర్ మంత్రి ఒకరు పేర్కొన్నారు.



నూతన రాజధానిలో పలు విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని ఆ మంత్రి పేర్కొన్నారు. ఇలా ఉండగా ప్రభుత్వ భవనాలను 12,28,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో రాజ్‌భవన్ నిర్మాణ విస్తీర్ణం 65 వేల చదరపు మీటర్లుండగా సచివాలయ నిర్మాణ విస్తీర్ణం 15 వేల చదరపు మీటర్లుగా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి సవివరమైన ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ కోసం సీఆర్‌డీఏ కన్సల్టెంట్లను ఆహ్వానించింది.




 

Read also in:
Back to Top