సకలం బంద్

సకలం బంద్ - Sakshi


- తిరుపతిలో సంపూర్ణం, కుప్పంలో అనూహ్య స్పందన

- పలమనేరులో ఉద్రిక్తత, పుంగనూరులో పోలీసుల అత్యుత్సాహం

- పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల అరెస్టు

- వామ పక్షనేతలు, ప్రజా సంఘాల పూర్తి మద్దతు

సాక్షిప్రతినిధి, తిరుపతి:
విభజన తర్వాత శేషాంధ్రప్రదేశ్‌ను విశేషాంధ్రగా మార్చాలంటే ప్రత్యేకహోదా తప్పనిసరంటూ... వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం చేపట్టిన బంద్ జిల్లాలో సంపూర్ణమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖరిని అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే మోడీ, చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. హోదాముద్దు... ప్యాకేజీ వద్దంటూ నినాదాలు చేశారు.



ముఖ్యంగా నిరస నల్లో పాల్గొన్న యువతలో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఆకాంక్ష  బలంగా కనిపించింది. ఉదయం 4.30   గంటల నుంచే  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, యువకులు, మహిళలు, స్వచ్ఛందంగా తరలి వచ్చి బంద్‌లో పా ల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండులు, జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. ఎక్కడి  వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విద్యా, వ్యాపార  సంస్థలు మూతపడ్డాయి. కొన్నిచోట్ల పోలీసులు బలవంతంగా బంద్‌ను విఫలం చేసేందుకు యత్నించి విఫలమయ్యారు. జిల్లా వ్యాప్తంగా పలువురు  ఎమ్మెల్యేలను, ముఖ్యనేతలను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మేల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో బంద్‌ను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.

 

తిరుపతిలో ఉదయం  4.40 గంటలకే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో  కార్యకర్తలు ఆర్టీసి బస్టాండు వద్ద బస్సులను అడ్డుకున్నారు. నగరంలో బంద్ సక్సెస్  చేసేందుకు వీలుగా ఆయన వారం రోజుల పాటు ప్రత్యేక కృషి చేశారు.  10 వేల పోస్టర్‌లను ముద్రించి, అన్ని వర్గాల నాయకులతో బంద్ విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో జిల్లా ఎంపీ వరప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, పార్టీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ట్రేడ్‌యూనియన్ నాయకులు నగరంలోని ప్రధాన కూడళ్లలో బైఠాయించారు. వీరికి వామపక్షాల నేతలు కుమార్‌రెడ్డి, రామానాయుడుతోపాటు ప్రజాసంఘాల నాయకులు మద్దతు పలికారు. మోటార్ సైకిళ్లతో తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామిలను ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సినీపక్కీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్టును నిరసిసూ తకార్యకర్తలు ధర్నా చేపట్టారు.

 

చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుల్లెట్‌పై తిరుగుతూ బంద్ పర్యవేక్షించారు.  చెర్లోపల్లి క్రాస్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. నాయకుల అరెస్టును నిరసిస్తూ చెర్లోపల్లి క్రాస్‌లో ఆర్టీసి బస్సుల అద్దాలు పగుల కొట్టారు. పాకాలలో మాజీ ఎమ్మెల్యే జయచంద్రనాయుడు ఆధ్వర్యంలో బంద్ సాగింది.

 

శ్రీకాళహస్తిలో నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో బంద్‌సాగింది. మధ్యాహ్నం  పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్న సమయంలో తోపులాట జరిగింది. మున్నీర్‌బాషా అనే యువకుడికి గాయాలయ్యాయి. ఇతన్ని ఆసుపత్రికి తరలించారు. నేతలు మిద్దెల హరి, గుమ్మ డి బాలకృష్ణ, అందూరి శ్రీనివాసులు పాల్గొన్నారు.

 

పీలేరులో  ఎమ్మెల్యే చింతలరామచంద్రారెడ్డి నేతృత్వంలో ఉదయం 4.30 గంటల నుంచే బంద్ సాగింది. పీలేరు నియోజకవర్గంలో కనీసం ఆటోలు కూడా తిరగలేదు. ఈ బంద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యనేతలు నారే వెంకటరమణారెడ్డి, కె.మహిత, రెడ్డిబాషా, డీడీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. జాతీయ రహదారిలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

 

పుంగనూరులో బంద్ విజయవంతమైంది. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి బంద్‌ను విఫలం     చే సేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేతలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఎంబికె రోడ్డులో బైఠాయించి ప్రధాన మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 200 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ బంద్‌లో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, ఆవుల అమరేంద్ర, ఫకృద్దీన్ షరీప్‌లు పాల్గొన్నారు. పుంగనూరు ఎమ్మెల్యే జిల్లా వ్యాప్తంగా బంద్‌ను పర్యవేక్షించడంతో పాటు తన నియోజకవర్గంలోనూ పర్యటించారు.

 

పూతలపట్టు నియోజక వర్గంలో ఎమ్మేల్యే సునిల్ కుమార్ ఆధ్వర్యంలో బంద్ సాగింది. జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకొన్నారు.

 

కుప్పంలో  మండల కన్వీనర్ వెంక టేశ్ బాబు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. స్వచ్ఛందంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. వాహనాల రాక పోకలు నిలిచిపోయాయి. జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది.

 

సత్యవేడులో నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో ఉదయం 5గంటలకే నాగలాపురం వద్ద తిరుపతి- చెన్నై హైవే వద్ద  బైఠాయించారు. దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అపరంజిరాజు, బాలాజీ రెడ్డి, మునిశేఖర్‌రెడ్డి, సుశీల్‌కుమార్‌రెడ్డిలతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

 

చిత్తూరులో ఉదయం 5 గంటల నుంచే  నియోజకవర్గ సమన్వయకర్త జంగాల పల్లి శ్రీనివాసులు, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రి ఆధ్వర్యంలో బంద్‌ను నిర్వహించారు. మధ్యాహ్నం ప్రాంతంలో దాదాపు 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు నగరలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారసంస్థలు , విద్యాసంస్థలు మూతపడ్డాయి. సీపీఐ నాయకులు నాగరాజు, సీపీఎం నాయకులు చైతన్య మద్దతు పలికారు.

 

ఎమ్యేల్యే ఆర్కె రోజా నేతృత్వంలో బంద్‌ను చేశారు. పట్టణ అధ్యక్షుడు అయ్యప్ప బంద్‌ను పర్యవేక్షించారు. పుత్తూరు మండలంలో స్వచ్ఛందంగా ప్రజలు బంద్‌కు మద్దతు తెలపడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి.

 

మదనపల్లిలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో బంద్ సాగింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు  ఆరు బృందాలుగా ఏర్పడి బంద్‌ను పర్యవేక్షించారు. వైఎస్సార్‌సీపీ నేతలు బాబ్జాన్, షమీర్‌అస్లామ్, జింకా వెంకటచలపతి పాల్గొన్నారు.

 

తంబళ్ల పల్లె బంద్ జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరెస్టును నిరసిస్తూ ఆపార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కొనసాగించాయి. జీడీ నెల్లూరు నియోజక వర్గంలో బంద్ ప్రశాంతంగా సాగింది.

 

 పలమనేరులో ఎమ్మెల్యే అరెస్ట్ యువకుని ఆత్మహత్యాయత్నం

ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచే చెన్నై -బెంగళూరు జాతీయ రహదారిలో వాహనాలను అడ్డుకుని బైఠాయించారు. ఆర్టీసి డిపోవద్ద  ధర్నా చేశారు.  మధ్యాహ్నం 11.30 గంటల ప్రాంతంలో డీఎస్పీశంకర్ ఓవర్‌యాక్షన్ చేసి భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి  ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఎమ్మెల్యే అరెస్టును నిరసిస్తూ పోలీసు స్టేషన్ ఎదుటే బైఠాయించి వెఎస్సార్‌సీపీ నేతలను రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ప్రత్యేక హోదాతోపాటు ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో శివకుమార్ అనే యువకుడు మనస్థాపం చెంది పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు.




 

Read also in:
Back to Top