మళ్లీ తెరపైకి టీచర్ల ‘ఏకీకృతం’


వివాదాల పరిష్కారానికి మళ్లీ కసరత్తు

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఉపాధ్యాయులందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి అందరికీ ఒకేరకమైన నిబంధనలు అమలు చేయాలని ఎంతోకాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏకీకృత సర్వీసుపై పంచాయతీరాజ్, మున్సిపల్ పాఠశాలల టీచర్లు, ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు మధ్య గతకొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా.. గతంలో టీచర్ల సంఘాల ప్రతినిధులు, అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.



సోమవారం ఈ కమిటీతో సిసోడియా, పంచాయతీరాజ్, మున్సిపల్, న్యాయశాఖల ఉన్నతాధికారులు  సమావేశమయ్యారు. సమావేశంలో కమిటీలోని టీచర్ల తరఫున ప్రతినిధులు ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కమలాకర్‌రావు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండడం, ఏకీకృత సర్వీసు రూల్సుకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలంటూ  కేంద్రానికి పంపిన నివేదికలకు ఆమోదం లభించకపోవడంతో మధ్యేమార్గంగా ఈ సమస్యకో పరిష్కారం కనుగొనాలని సమావేశంలో చర్చించారు.



అన్ని సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి ఆమోదయోగ్యమైన ఒప్పందం చేసుకోవడం ద్వారా రాష్ట్ర స్థాయిలోనే సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు.ఏకీకృత  రూల్సుకు ప్రభుత్వ పాఠశాలల టీచర్లు అభ్యంతరం చెబుతుండడంతో వారిని ముందుగా అంగీకరింపచేయాలని భావిస్తున్నారు. ఈనెల 6న ఆ సంఘంతో చర్చించి తుది నిర్ణయానికి రానున్నారు.




 

Read also in:
Back to Top