‘ఎనీవేర్’ దందా!

‘ఎనీవేర్’ దందా! - Sakshi


సాక్షి, హైదరాబాద్: ప్రజల సౌలభ్యం కోసమని ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ ప్రక్రియను ప్రారంభిం చింది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. అయితే ఇది ఇప్పుడు సర్కారు భూములకే ఎసరు పెడుతూ ‘ఎనీవేర్ దందా’గా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అమలుతో నిషేధిత ఆస్తుల పుస్తకం(ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్)లోని ప్రభుత్వ భూములు సైతం ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. కొందరు సబ్‌రిజిస్ట్రార్లు సొమ్ముకు ఆశపడి ప్రభుత్వం నిర్దేశించిన భూమి రిజిస్ట్రేషన్ విలువను సగానికి సగం తగ్గించి మరీ రిజిస్ట్రేషన్లు కాని చ్చేస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు.



హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కొందరు సబ్‌రిజిస్ట్రార్లు తమ పరిధిలోకిరాని భూములకు ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్ల పేరిట  భారీ దందాకు పాల్పడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ దందాల్లో కొందరు రాజకీయ నేతల ప్రమే యం కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి ఒత్తిడుల వల్లే ఉన్నతాధికారులు కూడా ఈ దందాలను చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

 

సర్కారు భూమి.. ప్రైవేటు పరం

ఎల్బీనగర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ‘సిరీస్’ అనే పరిశోధనా సంస్థకు ప్రభుత్వం 1960 ప్రాంతంలో సుమారు 20 ఎకరాల భూమిని కేటాయించింది. సర్వే నంబర్ 9/4లో కేటాయించిన ఈ భూమిని పరిశోధనా సంస్థ ప్రయోజనాలకు మాత్రమే వినియోగించుకోవాలి. ఈ భూమిని ఇతర సంస్థలకు కేటాయించేందుకుగానీ, ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేందుకుగానీ వీల్లేదు. ప్రభుత్వ అనుమతి లేకుండా సదరు భూమికి సంబంధించి ఎటువంటి క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు జరపకూడదని ప్రొహిబిటరీ ఆర్డర్ కూడా ఉంది.



అయితే ఈ నిబంధనలను తుంగలో తొక్కిన ఎల్బీ నగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అడ్డంగా రిజిస్ట్రేషన్ చేసేశారు. వాస్తవానికి సిరీస్ సంస్థకు కేటాయించిన భూమి సరూర్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి వస్తుంది. అయితే ‘ఎనీవేర్’ ఆసరాగా కొందరు ప్రైవేటు వ్యక్తులు ఎల్‌బీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు కానిచ్చేశారు. సాధారణంగా ఒక్కో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 20 నుంచి 30 రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. కానీ, ఎల్‌బీనగర్‌లో మాత్రం కొద్దిరోజులుగా 200 నుంచి 300 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

ఖజానాకు రూ. కోట్లలో గండి..

సర్కారు భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడాన్ని తప్పుగా భావించని ఎల్‌బీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది.. సదరు భూమి రిజిస్ట్రేసన్ ధరను కూడా భారీగా తగ్గించి మరీ రిజిస్ట్రేషన్ చేసేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ భూమికి ప్రభుత్వం నిర్దేశించిన రిజిస్ట్రేషన్ ధర గజం రూ.35 వేలు. అయితే దీనిని రూ.13 వేలకు తగ్గించి పైవేటు వ్యక్తులకు కట్టబెట్టేశారు. వాస్తవానికి ఒకే డోర్ నంబర్‌తో ఉన్న భూమి మొత్తానికి ఒకేరకమైన రిజిస్ట్రేషన్ విలువను వర్తింపజేయాలి.



ప్రైవేటు వ్యక్తులిచ్చే సొమ్ముకు కక్కుర్తిపడిన అధికారులు ఈ నిబంధనలను తుంగలో తొక్కేశారు. జాతీయ రహదారిని అనుకొని ఉన్న స్థలాన్ని గజం రూ.35 వేలు(కమర్షియల్) కేటగిరీగా, మిగిలిన భూమి విలువను గజం రూ.13 వేలు(రెసిడెన్షియల్)గా విభజించి.. గత వారం రోజు ల్లో కొందరు ప్రైవేటు వ్యక్తుల పేరిట సుమారు 12 వేల గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేశారు. దీంతో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో సుమారు రూ. 2 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి పడింది. ఏదైనా ప్రాంతంలో భూమి రిజిస్ట్రేషన్ ధరను సవరించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కానీ, ఎల్‌బీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఈ నిబంధనను పట్టించుకోలేదు. గత కొంతకాలంగా ఈ తరహా అక్రమాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.




 

Read also in:
Back to Top