5 కి.మీ. పరుగు ఇక ఉండదు!

5 కి.మీ. పరుగు ఇక ఉండదు! - Sakshi


సాక్షి, హైదరాబాద్: పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి శుభవార్త. త్వరలో నిర్వహించే రిక్రూట్‌మెంట్‌లో 5 కిలోమీటర్ల పరుగును రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. పోలీస్ రిక్రూట్‌మెంట్ సందర్భంగా అభ్యర్థులకు నిర్వహించే 5 కిలోమీటర్ల పరుగు పరీక్ష కారణంగా మరణాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



అయితే ఇదే సమయంలో సృజనాత్మకతకు పెద్ద పీట వేసి ప్రతిభను గుర్తించాల ని ప్రభుత్వం భావిస్తోంది. మొదటగా రాత పరీక్షలు నిర్వహించి, తర్వాత భౌతిక పరీక్ష లు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.

 

10 వేల పోస్టులకు చేరువగా...

తొలి విడత ఉద్యోగాల జాతరలో భాగంగా ప్రభుత్వం వెలువరించిన 15వేల ఉద్యోగాలలో పోలీసుశాఖకు సంబంధించే 9వేలకు పైగా ఉన్నాయి. వీటిలో అగ్నిమాపక, హోంశాఖకు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్‌ల నియామకాలనే ప్రధానంగా పేర్కొన్నారు. అదే విధంగా జైళ్లశాఖలో కూడా ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రాగానే ఖాళీల సంఖ్య ప్రకటించే అవకాశం ఉంది. ఇలా మొత్తం మీద అన్ని విభాగాల్లో కలుపుకొని పోలీసు పోస్టుల సంఖ్య 10 వేలకు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.



వీటన్నింటినీ భర్తీ చేసే బాధ్యత పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుపైనే ఉంటుంది. అందుకోసం రిక్రూట్‌మెంట్ బోర్డు కసరస్తు ప్రారంభించింది. 5 కిలోమీటర్ల పరుగు రద్దు, పోస్టులను స్పష్టంగా పేర్కొంటూ ప్రభుత్వం నుంచి అనుమతి  రాగానే నియామక ప్రక్రియను ప్రారంభించాలని బోర్డు భావిస్తోంది. 10 రోజుల్లోగా నోటిఫికేషన్లు జారీ చేయాలని రిక్రూట్‌మెంట్‌బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది.




 

Read also in:
Back to Top