ఢిల్లీ పేలుళ్ల కేసుపై వెలువడ్డ తీర్పు


న్యూఢిల్లీ: ఢిల్లీ వరుస బాంబు పేలుళ్ల కేసు(2005) నిందితుడు తరిక్‌ అహ్మద్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పటియాల కోర్టు గురువారం తీర్పు చెప్పింది. తరిక్‌ అహ్మద్‌తో పాటు కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్‌ రఫీక్‌ షా, మహ్మద్‌ హుస్సేన్‌ ఫజిల్‌లను నిర్దోషులుగా పేర్కొంది. నిందితులపై పోలీసులు టెర్రర్‌ చార్జీలు దాఖలు చేశారు. 

 

కానీ కేసును విచారించిన కోర్టు తరిక్‌పై ఉన్న అన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌కు శిక్షను విధించింది. దీంతో ఢిల్లీ పోలీసులను షాక్‌ కు గురయ్యారు. దోషుల్లో ఎవరూ బాంబులను పెట్టలేదనే సమాచారం ఉంది. వీరందరూ బాంబు పేలుళ్లకు సహకారం మాత్రమే అందించారని తెలిసింది. పటియాలా కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లాలా? లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం పేర్కొంది. 

 

పేలుళ్లు ఎలా జరిగాయంటే..

- 2005 అక్టోబర్‌ 29న సాయంత్రం 5.38 నిమిషాలకు పహర్‌గంజ్‌లోని రద్దీ మార్కెట్లో తొలి బాంబు పేలింది.

- సాయంత్రం 6.00గంటలకు దక్షిణ ఢిల్లీలోని గోవింద్‌పురిలో బస్సుకు దగ్గరగా రెండో బాంబు పేలింది.

- సాయంత్రం 6.05 గంటలకు సరోజని నగర్‌ మార్కెట్లో మూడో బాంబు పేలింది. 

- పేలుళ్లలో మొత్తం 63 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు.



 

Read also in:
Back to Top