ఆవిడ మాటలే ఈరోజు నన్నిక్కడ నిలబెట్టాయి!

ఆవిడ మాటలే  ఈరోజు నన్నిక్కడ నిలబెట్టాయి! - Sakshi


అమ్మ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది ప్రగతిని చూస్తే. యంగ్ మదర్‌గా తల్లి పాత్రలకు క్రేజ్‌ను తెచ్చిన నటి ఆవిడ. తమిళనాట హీరోయిన్‌గా అడుగు పెట్టి, సీరియల్స్‌లో ప్రధాన పాత్రల్లో సత్తా చాటి, ఇప్పుడు క్యారెక్టర్ నటిగా తనదైన ముద్ర వేస్తున్నారు ప్రగతి. ఇటీవలే ‘ఆగడు’ చిత్రంలో తమన్నాకి తల్లిగా నటించిన ప్రగతి తన అనుభవాలు, అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు...

 


నటన వైపు అడుగులెలా పడ్డాయి?

నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. పదో తరగతి చదువుతుండగా కొన్ని కుటుంబ సమస్యలు రావడంతో చెన్నై వెళ్లి సెటిలయ్యాం. మొదట్నుంచీ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఆసక్తి ఎక్కువ. మోడలింగ్ చేశాను. యాడ్స్‌లో నటించాను. డిగ్రీ చేస్తున్నప్పుడు నా ఫొటోలు భాగ్యరాజాగారి చేతిలో పడ్డాయి. దాంతో ఆయనతో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా తెలుగులోకి కూడా డబ్ చేశారు... ‘గౌరమ్మా... నీ మొగుడెవరమ్మా’ పేరుతో.



మొదటి సినిమాయే భాగ్యరాజాతో... ఫుల్ హ్యాపీ ఏమో కదా?

అంతే కదా మరి! ఆ తర్వాత ఒక్క సంవత్సరంలో ఏడు సినిమాల్లో హీరోయిన్‌గా చేశాను. కానీ ఎప్పుడూ నాకు నటన మీద ప్యాషన్ ఉండేది కాదు. ఒక నటిగా ఏదేదో సాధించేద్దాం అని తాపత్రయపడేదాన్ని కాదు. అందుకే 1994లో నటిని అయితే, మరుసటి సంవత్సరమే పెళ్లి చేసేసుకున్నాను. వెంటనే బాబు పుట్టడంతో సినిమాలకు దూరంగా ఉండిపోయాను.



మరి మళ్లీ ఎలా వచ్చారు?

ఎంత వద్దనుకున్నా ఎక్కడో ఓ మూల ఉండేది... రెడ్ కార్పెట్ వేసి పిలిస్తే కాదనుకున్నానే అని! అందుకే మళ్లీ నటించాలని అనుకున్నాను. అయితే అప్పటికి ఇద్దరు పిల్లలు పుట్టేశారు. ఇక హీరోయిన్‌గా చేసే చాన్‌‌స లేదు కాబట్టి సీరియల్స్‌వైపు వెళ్లాను. తమిళ, మలయాళ, తెలుగు భాషల సీరియళ్లతో బిజీ అయిపోయాను. అంతలో సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ‘నువ్వు లేక - నేను లేను’లో ఆఫర్ వచ్చింది.



సంతోషపడ్డారా?

లేదు. అప్పుడే తల్లి పాత్రలు చేయమంటారేమిటి అని ఫీలయ్యా. అప్పటికి ‘అక్కాచెల్లెళ్లు’ సీరియల్ చేస్తున్నాను. అందులో సీనియర్ నటి శ్రీవిద్య నా తల్లి. షూటింగ్ గ్యాప్‌లో ఆవిడతో బాధగా అన్నాను... తల్లిగా నటించమని అడుగుతున్నారు అని. దానికావిడ... ‘నువ్విక హీరోయిన్ పాత్రలు చేయలేవు. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కొనసాగాలి. అలాంటప్పుడు తల్లయితే ఏంటి, అత్తయితే ఏంటి? ఏదైనా నటనే కదా’ అని. అది నిజమే కదా! అందుకే ఓకే అన్నాను. ఈరోజు ఇలా ఉన్నానంటే శ్రీవిద్యమ్మ వల్లనే!



సీరియల్స్‌కి దూరమైపోయారెందుకు?

ఎంత లీడ్ రోల్సే చేసినా, సీరియళ్లలో నటిస్తున్నామంటే సినిమా అవకాశాలు తగ్గుతాయి. అందుకే దూరంగా ఉన్నాను.



చేసినవాటిలో తృప్తినిచ్చిన పాత్ర?

ఇప్పటి వరకూ నేను చేసింది కేవలం 25 శాతం. ఇంకా 75 శాతం ఉంది సాధించాల్సింది. అప్పుడే తృప్తి ఏమిటి!



తెలుగులో బిజీ. మిమ్మల్ని నటిని చేసిన తమిళసీమను గుర్తుంచుకున్నారా?

కచ్చితంగా. తెలుగు అమ్మాయిని కాబట్టి నా మొదటి ప్రాధాన్యత తెలుగుకే ఉంటుంది. కానీ అసలు నన్ను నటిగా నిలబెట్టిందే తమిళ పరిశ్రమ కదా! అందుకే ఇప్పటికీ తమిళంలో చేస్తున్నాను. కాకపోతే అక్కడ పాత్రల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తుంటాను. ఎందుకంటే... వాళ్లకి నేను హీరోయిన్‌గా తెలుసు. కాబట్టి నా మీద ఒక అంచనా ఉంటుంది. దాన్ని పాడు చేసుకోకూడదు కదా!



మీరు కాకుండా మీకు నచ్చే తల్లి పాత్రధారి ఎవరు?

నేను కాకుండా కాదు, తల్లి పాత్రల్లో నేనే నాకు చాలా నచ్చుతాను. చాలామంది అంటారు... మీరు నటిస్తున్నట్టు ఉండదు, నిజంగా అమ్మతనం ఉట్టిపడుతుంది అని. కొందరైతే మా అమ్మ మీలా ఉంటుంది, మీలానే మాట్లాడుతుంటుందని చెప్తారు. చాలా సంతోషమేస్తుంది. సినిమాలో ఏ పాత్ర గురించీ అందరికీ ఒకే అభిప్రాయం ఉండదు. కానీ తల్లి పాత్రలంటే అందరికీ గౌరవం ఉంటుంది. అందుకే తల్లిగా నటించడాన్ని ఎంజాయ్ చేస్తుంటాను.



నిజ జీవితంలో మీరెలాంటి తల్లి?

మంచి తల్లినే. నా పిల్లలతో తగినంత సమయం గడుపుతాను. వాళ్లకు సంబంధించిన విషయాలన్నీ పట్టించుకుంటాను. ఇంట్లో సినిమా వాతావరణం కనిపించనివ్వను. మేం చెన్నైలో ఉన్నంత వరకూ పిల్లలిద్దరికీ నా కెరీర్ గురించి పెద్ద తెలియదు. హైదరాబాద్ వచ్చేశాక నాకు వచ్చిన గుర్తింపును చూసి, ‘నువ్వింత ఫేమసా మమ్మీ’ అని ఆశ్చర్యపోయారు వాళ్లు!



మీవారి సపోర్ట్ గురించి...?

మావారు ఐటీ రంగంలో ఉన్నారు. ఆయనకు అసలు సినిమా ప్రపంచం గురించి అవగాహన లేదు. సినిమాలు కూడా పెద్దగా చూడరు. కాకపోతే నన్ను మాత్రం బాగానే ప్రోత్సహిస్తారు.



భవిష్యత్ ప్రణాళికలు...?

పెద్దగా ఏం లేవు. ఎందుకంటే నాకెప్పుడూ అది కావాలి, ఇది కావాలి అన్న ఆలోచన ఉండదు. వచ్చినదాన్ని వచ్చినట్టు స్వీకరిస్తాను. ఎప్పుడూ సంతోషంగా ఉండటానికే ప్రయత్నిస్తాను. దేవుడు మనకి సంతోషంగా జీవించమనే జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి సంతోషంగా ఉండాల్సిన బాధ్యత మనదే. అందుకే నేనెప్పుడూ నవ్వుతూనే ఉంటాను. భవిష్యత్తు గురించి ఎక్కువ బెంగపడను. దేనినీ అతిగా ఆశించను!                                 - సమీర నేలపూడి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top