పంచభూత స్థలాలు వాటి ప్రాముఖ్యత

పంచభూత స్థలాలు వాటి ప్రాముఖ్యత


భారతీయ దేవాలయాలు ప్రార్థన కోసం ఏర్పరచబడిన ప్రదేశాలు కావు. ఎప్పుడూ ఎవరూ అక్కడ ప్రార్థన చేయించరు. ఈ సంప్రదాయంలో మీకు ఎప్పుడూ చెప్పేదేమిటంటే మీరు ఒక దేవాలయానికి వెళ్తే అక్కడ మీరు కొంచెం సేపు కూర్చోవాలి. ఎందుకంటే ఈ దేవాలయాలు శక్తి కేంద్రాలు. ఇవి పబ్లిక్ చార్జింగ్ ప్రదేశాల లాంటివి. ప్రతీరోజూ ఉదయాన్నే స్నానం చేసి, దేవాలయానికి వెళ్లి కూర్చుని ఆ శక్తిని పొంది మిమ్మల్ని మీరు శక్తివంతులను చేసుకోవాలని, ఆ తరువాతే ఈ ప్రపంచంలోకి సరైన ప్రకంపనలతో వెళ్ళాలని చెప్పేవారు.

 

 లింగాన్ని సృష్టించే శాస్త్రాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవచ్చు. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతిలో ఉంది. కానీ గత 800-900 సంవత్సరాలుగా భక్తి ఉద్యమం దేశమంతా వ్యాపించిన తరువాత ఈ శాస్త్రం కనుమరుగైపోయింది. ఒక భక్తునికి అతని భావోద్వేగం తప్ప మరేదీ ముఖ్యం కాదు. అతని భావోద్వేగమే అతని మార్గం. ఒక భక్తుడు అతను కోరుకున్నది చేయవచ్చు. ఎందుకంటే అది తన భావోద్వేగపు బలము. అందువల్ల వారు శాస్త్రాన్ని పక్కన పెట్టి, వారికి నచ్చిన విధంగా దేవాలయాలను కట్టడం మొదలుపెట్టారు. అందువల్ల లింగాలను తయారుచేసే శాస్త్రం మరుగున పడిపోయింది.

 

 సాధారణంగా, శాస్త్రీయ ఆధారం కలిగిన లింగాలు ముక్తిని ఒక శాస్త్రీయ ప్రక్రియగా పరిగణించిన సిద్ధులు, యోగులచే సృష్టించబడినవే. అవి నిరంతర ప్రకంపనలు. సాధారణంగా అవి ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం, నిర్దిష్ట గుణాలతో మంత్రాలను ఉపయోగించి ప్రతిష్టించబడ్డాయి. దక్షిణ భారతదేశంలో పంచ భూతాల కోసమై అయిదు లింగాలు ఉన్నాయి. మీ భౌతిక శరీరం భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాలతో నిర్మించబడినదే. మీరు అనుభవించే ప్రతీదానిపై వాటికి గట్టి పట్టు ఉంటుంది. వీటిని దాటి పోవడానికి యోగాలో ఉన్న మౌలికమైన సాధనే భూతశుద్ధి.

 

 ప్రతీ ధాతువుకి, దాని నుండి విముక్తులవడానికి మీరు చేయగలిగే ఒక ప్రత్యేకమైన సాధన ఉంది. దీని కోసమే పంచభూత స్థలాలను సృష్టించారు. మీరు వెళ్లి సాధన చేసుకోవడానికి మహోన్నత దేవాలయాలు నిర్మించారు. భౌగోళికంగా అవన్నీ డెక్కన్ ప్రాంతంలోనే - నాలుగు తమిళనాడులో, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. నీటికి సంబంధించిన దేవాలయం తిరువనైకావల్‌లో, అగ్నికి సంబంధించిన దేవాలయం తిరువన్నామలైలో, వాయువుకి సంబంధించిన దేవాలయం కాళహస్తిలో, భూమికి సంబంధించిన దేవాలయం కాంచీపురంలో, ఆకాశానికి సంబంధించిన దేవాలయం చిదంబరంలో ఉన్నాయి.

 

 మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే ఈ అయిదు లింగాలు సాధన కోసం సృష్టించబడినవి, ప్రార్థన కోసం కాదు. జనాలు ఒక దేవాలయం నుంచి మరొక దేవాలయానికి ఈ పంచ భూతాల సాధన కోసం వెళ్ళేవారు. దురదృష్టవశాత్తూ, ఈ సంబంధం ఈనాడు లేదు. ఎందుకంటే ఈ సాధనకు కావలిసిన వాతావరణం తొలిగించేయబడింది. దీనికి కావలసిన అవగాహనా, నైపుణ్యం సాధారణంగా కనుమరుగైపోయాయి, కానీ దేవాలయా లు ఇంకా ఉన్నాయి. కొన్ని ఆలయాలు ఆ గుణాన్నీ, శక్తినీ నిలబెట్టుకున్నాయి, మిగతా ఆలయాలు బలహీనమైపోయాయి.

 ప్రేమాశీస్సులతో,

సద్గురు జగ్గీ వాసుదేవ్

 www.sadhguru.org

 - సద్గురు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top