నేను చేస్తోంది తప్పేమో?

నేను చేస్తోంది తప్పేమో?


జీవన గమనం

నేను బీటెక్ చేశాను. తర్వాత రెండేళ్లు కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్ చేశాను. ఎంటెక్ చేయడానికి ఆ జాబ్ మానేశాను. మరో మంచి ఉద్యోగం రావడంతో మధ్యలోనే ఎంటెక్ ఆపేశాను. ఆ జాబ్‌లో జాయిన్ అయిన నెల రోజులకు ఎక్కడో గ్రూప్స్ గురించి చూశాను. వెంటనే ఉద్యోగం మానేసి గ్రూప్స్ కోచింగ్‌లో చేరాను. కానీ నాకిప్పుడు అనిపిస్తోంది... నేను చేస్తోంది తప్పేమో అని. దేని మీదా దృష్టి పెట్టలేకపోతున్నాను. ఒకదాని నుంచి ఒకదానికి మారుతూనే ఉన్నాను. ఇలా అయితే నేను ఏం సాధించగలను? ఇలా మాటిమాటికీ    మనసు మారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?              

- కె.రమణ, ఊరు రాయలేదు


 

‘రోలింగ్ స్టోన్స్‌కు ద్రవ్యరాశి (మాస్) సమకూరదు’ అని ఒక సామెతుంది. అదెంత నిజమో, మరోవైపు దానికి వ్యతిరేకంగా.. ‘మురికి నీటికి సుగంధం ఉండదు’ అన్నది కూడా అంతే నిజం. ఎవరి పరిస్థితిని బట్టి వారు మెలగాలి. మనస్తత్వాన్ని బట్టి కెరీర్‌ని నిర్ణయించుకోవాలి. నేను పదిహేను సంవత్సరాలు ఒకే సంస్థలో మారకుండా పని చేశాను. మా అబ్బాయి పదేళ్లలో పదిహేను సంస్థలు మారి ఒక స్థాయికి వచ్చాడు. కాబట్టి ఏది కరెక్ట్ అనేది ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది.

 

ఇక మీ విషయానికి వస్తే... మంచి ఉద్యోగం రావడంతో మీరు ఎంటెక్ ఆపేశారు. తర్వాత మళ్లీ గ్రూప్స్ కోసం ఎంటెక్ మానేశారు. ఇందులో తప్పేముంది? అయితే మీరు చేస్తున్న ఉద్యోగం, గ్రూప్స్ పాస్ అవ్వడం వల్ల వచ్చే ఉద్యోగం కన్నా మంచిదా కాదా అన్న విషయం మీరు నిర్ణయించుకోవాలి. కొన్ని లక్షలమంది గ్రూప్స్‌కి చదువుతున్నారు. పాసయ్యేది చాలా తక్కువ శాతం. మీకా సామర్థ్యం ఉన్నదా అన్న విషయం ముందు నిర్ణయించుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ వయసెంత, మీ కుటుంబ ఆర్థిక స్తోమత ఎంత, మీ మీద ఎవరైనా ఆధారపడి ఉన్నారా, మీకు వయసు మీరిపోతుందా... ఇవన్నీ ఆలోచించి, ఉద్యోగం (జీవితం)లో స్థిరపడాలా, రిస్క్ తీసుకోవాలా అనే నిర్ణయం తీసుకోండి.

 

నేను ఎమ్మెస్సీ చేశాను. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ముప్ఫై వేల పైనే వస్తోంది. నా ఎమ్మెస్సీ క్లాస్‌మేట్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మొదట్లో చాలా సంతోషంగా ఉండేవాళ్లం. కానీ తనకి నాకు వచ్చినట్టుగా వెంటనే ఉద్యోగం రాలేదు. దాంతో ఏదో ఒక చిన్న కంపెనీలో చేరాడు. జీతం కూడా నా కంటే తక్కువే. దానికి నేనేం బాధపడటం లేదు. కానీ తను మాత్రం కుమిలిపోతున్నాడని అనిపిస్తోంది. తనకంటే నాది మంచి ఉద్యోగం అని, ఎక్కువ జీతం అని చాలాసార్లు అనేస్తుంటాడు. అది మామూలుగా అనడం లేదేమో అని నాకు అనిపిస్తోంది. ఇది మా ఇద్దరి మధ్య గ్యాప్‌ను పెంచుతుందేమో అని కూడా భయంగా ఉంది. తన మనసులో నుంచి ఆ ఫీలింగ్‌ను ఎలా తీసేయాలి?                         

 - సౌజన్య, హైదరాబాద్


 

మీ భర్త మనస్తత్వం ఎటువంటిది? సెన్సిటివా? లేక ప్రాక్టికలా? అతడు ఎలాంటి వాడైనా, ముందు అతని కాంప్లెక్స్‌ను పోగొట్టాలి. అంతకన్నా ముఖ్యంగా ముందు మీరు మీ బాధనీ, భయాన్నీ తనకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అతడు ప్రాక్టికల్ అయితే, ‘‘నాకన్నా నీకు జీతం తక్కువని నువ్వు బాధపడుతున్నావ్! నేనేం చేయాలో నువ్వే చెప్పు. ఉద్యోగం మానేయనా?’’ అనండి. కంగారుపడి వద్దు వద్దంటాడు. అతడు బాగా సెన్సిటివ్ అయితే, ఒక వారం రోజుల పాటు ఇద్దరూ ఎక్కడికైనా వెళ్లండి.



నెమ్మది నెమ్మదిగా మీ భావాల్ని ఎక్స్‌ప్రెస్ చేయండి. ‘తన కన్నా మీ జీతం ఎక్కువన్న కారణం వల్ల మీరు కూడా బాధపడుతున్నారు’ అన్న సంగతిని అతనికి తెలిసేలా చేయండి. పనిలో పనిగా... (ప్రేమ వివాహం అంటున్నారు కాబట్టి) డబ్బు లేకపోవటం వల్ల వచ్చే కష్టనష్టాల గురించి కూడా అతడికి తెలియచెప్పండి. అతడు మీ బాధను, మీలో జరిగే సంఘర్ణణనీ తప్పకుండా అర్థం చేసుకుంటాడు.

 

ఖాళీగా ఉండి అనవసరపు ఆలోచనలతో సతమతమవ్వకుండా, తీరిక వేళల్లో ఏదైనా హాబీ పెంపొందించుకునేలా ప్రోత్సహించండి. చిత్రలేఖనం నుంచి పత్రికలకు వ్యాసాలు రాయటం వరకు ఏదైనా కావొచ్చు. ఏ మంచి హాబీ లేనివాళ్లకు నిరాశాపూరితమైన ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఏమో ఎవరు చెప్పొచ్చారు... అతడి హాబీనే అతన్ని ఆర్థికంగా ఉన్నత శిఖరాల మీద నిలబెట్టవచ్చేమో!

- యండమూరి వీరేంద్రనాథ్

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top