వెంకన్న సాక్షిగా మహిళల కత్తి మీద సాము

వెంకన్న సాక్షిగా మహిళల కత్తి మీద సాము


ఎంతో ఘన చరిత్ర కలిగిన క్షౌర వృత్తిలోకి ఏడేళ్ల క్రితం మహిళలూ ప్రవేశించారు. ఎన్నో అవమానాలను భరించారు. చివరికి అందరి చేతా శభాష్ అనిపించుకుని విమర్శకుల నోళ్లు మూయించారు. ప్రస్తుతం తిరుమలలో 239 మంది పురుష క్షురకులు ఉండగా, 59 మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. వీరు పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం.

 

 సున్నం పూసిన మట్టికుండతో శిక్షణ

 క్షురకవృత్తిలో ముందుగా తల తడిపే విధానాన్ని నేర్చుకుంటారు. రెండవ దశలో గుండు కొట్టే విధానాన్ని మట్టికుండపై నేర్చుకుంటారు. మెత్తని సున్నాన్ని కుండపై మందంగా లేపనం చేస్తారు. కత్తికి బ్లేడు వేసి సున్నాన్ని గీకుతూ, కత్తి ఏ విధంగా పట్టుకోవాలి, ఏ దిశలో ఎలా మార్చుకోవాలి... వంటి మెళకువలను నేర్చుకుంటారు. చివరి దశలో గుర్తు తెలియని వారిని సైతం పిలిచి, ఎదురు డబ్బులిచ్చి మరీ గుండ్లు కొట్టి తమ ప్రతిభను పరీక్షించుకున్న సందర్భాలూ ఉన్నాయి.

 

 వెంకన్న కొలువులోకి ఇలా...

 కల్యాణకట్టలో పీస్‌రేట్ కార్మికుల కింద టీటీడీ 2006లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం నాయీ బ్రాహ్మణ కులంతోపాటు 8వ తరగతి పాసై 9వ తరగతిలో చేరి ఉండాలి. ఈమేరకు తొలి విడతగా 96 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇంటర్య్వూకి హాజరైన మహిళకు టీటీడీ ఇచ్చే మార్కులు ఐదు. కల్యాణకట్టలో ఏర్పాటు చేసిన క్లోజ్డ్ సర్క్యూట్ (సీసీ) టీవీని చూడకపోతే 5 మార్కులు, గుండు కొట్టించుకునే భక్తురాలితో మాట్లాడకపోతే 5 మార్కులు, కత్తి గాటు వేయకపోతే మరో 5 మార్కులు, చివరగా గుండు కొట్టించుకున్న భక్తురాలి అభిప్రాయానికి ఇంకో ఐదు మార్కులు కేటాయించారు. అలా ఉత్తమ అభ్యర్థుల్లో కేవలం 24 మందిని నియమించారు. మలివిడత ఇంటర్వ్యూలతో కలిపి ప్రస్తుతం 59 మంది పనిచేస్తున్నారు. ఇందులో ఇంటర్, డిగ్రీ చదివిన వారు కూడా ఉన్నారు.

 

 గంటకు పది గుండ్లు

 టీటీడీ నిబంధనల ప్రకారం రోజుకు ఆరు గంటలు విధులు నిర్వహించాలి. మహిళా క్షురకులు గంటకు పది చొప్పున రోజుకు 60, నెలకు సుమారు 1800 మందికి గుండ్లు కొట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం గుండుకు రూ.7, మూడు కత్తెర్లకు రూ.3 చొప్పున వేతనాన్ని చెల్లిస్తోంది. భక్తుల రద్దీ తక్కువగా ఉంటే ఓ మహిళాక్షురకురాలు రోజుకు 20, రద్దీ ఎక్కువగా ఉంటే 60 నుండి 80 మందికి తలనీలాలు తీసే అవకాశం ఉంది. ఇలా రూ.8 వేల నుంచి 15 వేల వరకు నెల వేతనాన్ని అందుకుంటున్నారు. వీరి సేవలకు గుర్తింపుగా పీస్ రేటు కార్మికుల స్థానం నుంచి టీటీడీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేందుకు రంగం సిద్ధం చేసింది. పూర్తి స్థాయి ఉత్తర్వులు వెలువడితే వీరి జీవనానికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది.

 

 ఏడాది నుంచి కొత్తగా ఆరంభించిన శ్రీవారి సేవ (ఉచిత సేవ) కింద మరో 263 మంది మహిళా నాయీ బ్రాహ్మణులు ఎలాంటి నగదు తీసుకోకుండానే (భవిష్యత్‌లో టీటీడీ ఉద్యోగ అవకాశాలు ఇస్తుందనే ఆశతో) ఉచిత సేవలు చేస్తున్నారు.  ఇదే సందర్భాల్లో ఎదురవుతున్న వృత్తి కష్టాలను కూడా వారు నిబ్బరంగా భరిస్తున్నారు. తరచూ వారి చేతివేళ్లు తెగుతుంటాయి. చంటి బిడ్డలకు తలవెంట్రుకలు తీయాలంటే ఆ దేవ దేవుడే కనిపిస్తాడు. అలాంటి సందర్భాల్లో  పనిలో మనసు కేంద్రీకరించి పిల్లలకు అతి జాగ్రత్తగా గుండు కొట్టాల్సి ఉంటుంది. ఏకధాటిగా ఆరుగంటల సమయం పాటు కూర్చునే గుండ్లు కొట్టాల్సి ఉంటుండటంతోపాటు వెన్నెముక సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. కల్యాణకట్టల్లో మహిళలేంటని పురుషాధిక్య సమాజంతోపాటు సంప్రదాయ వాదులు వ్యతిరేకిస్తున్నా, విమర్శలు ఎదుర్కొని ... అనేక అవమానాలు తట్టుకుని పోరాటం చేసి మరీ వృత్తిని కొనసాగిస్తున్న మహిళా క్షురకులు నేడు గర్వంగా తల ఎత్తుకుని ఉపాధి పొందుతున్నారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top