క్రీస్తు పాద స్పర్శతో పులకించిన పుడమి

క్రీస్తు పాద స్పర్శతో పులకించిన పుడమి


కవర్‌స్టోరీ



1969 జూలై 20న మానవుడు తొలిసారిగా చంద్రునిపై కాలు మోపాడు. నాసా శాస్త్రజ్ఞులు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్‌ ఆల్డ్రిన్, మైఖేల్‌ కొలిన్స్‌ అపొలో 11 అనే రాకెట్‌లో రెండు లక్షల ఇరవై వేల మైళ్ల దూరం ప్రయాణించి ఖగోళ శాస్త్రంలో ఓ నూతన అధ్యాయానికి తెరతీశారు. ఎన్నో ఏళ్లుగా మనిషి మస్తిష్కంలో మెదులుతున్న కోరిక నెరవేర్చబడింది. మానవ చరిత్రలో ఓ అపురూప ఘట్టంగా సుస్థిరంగా నిలిచిపోయిన ఆ రోజు మనిషి జ్ఞానానికి ప్రబల తార్కాణంగా ఆవిష్కరించబడింది. నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రునిపై కాలుమోపిన తొలిమానవుడుగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించాడు. ఉద్విగ్నభరితంగా కొన్ని గంటలు చంద్రునిపై గడిపి క్షేమంగా భూమ్మీదకు తిరిగొచ్చారు. ఘనచరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలచిన వారికి లభించిన స్వాగతం అంతా ఇంతా కాదు.



దేవుని అద్భుత సృష్టిని కన్నులారా వీక్షించిన ఆ శాస్త్రవేత్త దేవుని నామస్మరణలో మమేకమైపోయాడు. ఆ తర్వాత కొంత కాలానికి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఇశ్రాయేలు దేశాన్ని దర్శించాడు. సృష్టికర్త సంచరించిన ప్రాంతాలను, ఆయన దివ్యపాదాలు తాకడం ద్వారా పావనమైన పుడమిని కన్నులారా చూచి పరవశించిపోయాడు. అతనిలో ఉన్న ఆత్మగుణాలు మేల్కొల్పబడ్డాయి. గుండె గుడిలో దైవిక చైతన్యం ప్రతిధ్వనించింది.



ఇశ్రాయేలు దేశాన్ని సందర్శించి అడుగడుగునా దైవిక ప్రసన్నతను అనుభవించిన ఆ వ్యక్తి తన మనస్సులోని ఆనందాన్ని ఇలా వర్ణించాడు. ‘‘క్రీస్తు నడచిన ప్రాంతాల్లో అడుగు పెట్టినప్పుడు నేను పొందిన అమితమైన ఆనందం, పారవశ్యాన్ని సుదూర ప్రయాణం చేసి చంద్రునిపై కాలు మోపినప్పుడు కూడా పొందుకోలేదు.’’ హృదయంలో నుండి వచ్చిన ఆ గొప్ప అనుభూతితో ప్రతి ఒక్కరూ ఏకీభవించక తప్పదు.



యేసుక్రీస్తు ఈ భూమ్మీద సంచరించాడు అనేది ఓ గొప్ప చరిత్ర. శాశ్వతుడైన దేవుడు ప్రతీ మనిషిని రక్షించడానికి నరావతారిగా ఏతెంచాడు. అది నిరాపేక్షమైన దైవకార్యము. విశాలమైన సృష్టిని తన మహత్తయిన మాట చేత కలుగచేసిన సర్వశక్తుడు ఈ లోకానికి రక్తమాంసములు ధరించుకొని రావడం ద్వారా తన పోలికలో, రూపములో చేయబడిన ప్రతీ మానవుని హృదయ ప్రాంగణములోనికి రావాలన్నది ఆయన దివ్య ప్రణాళిక.



భౌతికంగా ఈ పుడమిపై 33 1/2 సంవత్సరాలు జీవించిన క్రీస్తు సమసమాజ నిర్మాణానికి బాటలు వేశాడు. మనుష్యుల మధ్య వేళ్లూనుకుపోయిన సామాజిక సంఘర్షణను నివారించడానికి ప్రేమ పునాదులు వేశాడు. మహోన్నతమైన తన బోధల ద్వారా మనిషిలోని అంతర చైతన్యాన్ని రగిలించాడు. అమోఘమైన పరిచర్య చేసిన పిదప లోకరక్షణార్థమై నిష్కళంకమైన తన రక్తాన్ని చిందించి మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచాడు.



క్రీస్తు పాదాలు ఇశ్రాయేలు దేశంలోని అనేక ప్రాంతాలను పావనపరిచాయి. ప్రజల్లో ఉన్న మానసిక సంఘర్షణను అణిచివేశాయి. దేవుని ఆశీర్వాదాలను అశేష ప్రజావాహినికి పంచిపెట్టాయి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి పాదాలు స్వర్గ వీధుల్లో విహరించాలనే ఆశతో క్రీస్తు ప్రభువు పాదాలు కఠిన నేలను తాకాయి.



ఇశ్రాయేలు దేశాన్ని యూదయ, గలిలయ, సమరయ అను మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. క్రీస్తు పుట్టుక నుండి దివ్యలోకానికి వెళ్లిపోయే వరకు ఇశ్రాయేలులోని వివిధ ప్రాంతాల్లో సంచరించి మహోన్నతమైన ప్రేమతత్వాన్ని చాటి చెప్పాడు. ఒక్కొక్క ప్రాంతాన్ని దర్శించినపుడల్లా ప్రజోపకరమైన కార్యాలు ఎన్నింటినో చేపట్టుట ద్వారా చీకటి  బతుకులు వెలుగుమయం చేయబడ్డాయి. బరువెక్కిన ఎన్నో గుండెలు తేలికయ్యాయి.



యేసుక్రీస్తు సంచరించిన ప్రాంతాలు, వాటిలో జరిగిన అద్భుతకార్యాలు, వాటి చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక సత్యాలు మనిషి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదపడతాయన్నది నిస్సందేహం.



బేత్లెహేము

ఇది యూదయ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామము. పూర్వము దీనిని ఎఫ్రతా అని పిలిచేవారు. ఇశ్రాయేలు యొక్క మూలపురుషులలో ఒకడైన యాకోబు భార్య రాహేలు ఇక్కడే పాతిపెట్టబడింది. మోయాబుకు చెందిన రూతు తన అత్తతో ఈ ప్రాంతానికి చేరుకొని బోయజు అనే సంపన్నునికి భార్యగా చేయబడింది. రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. పాతనిబంధన చరిత్రలో ఓ గొప్ప స్థానాన్ని అలంకరించిన దావీదు మహారాజు ఈ ప్రాంతానికి చెందినవాడే. దేవుని హృదయానుసారుడు అని పిలువబడిన దావీదు బేత్లెహేము పొలాల్లో గొర్రెలు కాచుకొనేవాడు. ఆ అనుభవమే ఇశ్రాయేలు ప్రజలను నలభై వసంతాలు పాలించడానికి సహాయపడింది.



లోకరక్షకుడైన క్రీస్తు అద్భుత చరిత్ర కలిగిన బేత్లెహేములో జన్మించాడు. క్రీస్తు ఇక్కడ జన్మిస్తాడని ఏడువందల సంవత్సరాలకు పూర్వమే మీకా అనే ప్రవక్త ప్రవచించాడు. ‘‘బేత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును (మీకా 5:2). ప్రపంచ చరిత్రను రెండు భాగాలుగా చేసిన క్రీస్తు యొక్క పాదాలు పుడమిని తాకిన ప్రాంతం ఇదే. బేత్లెహేము అనగా రొట్టెల గృహము. సస్యశ్యామలమైన ప్రాంతం. మనిషి ఆకలిని తీర్చే స్థలము. సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతము చుట్టూ ద్రాక్షవనములు, ఒలీవ తోటలు, అంజూరపు చెట్లు అధికంగా కనిపిస్తాయి. జీవాహారము నేను అని తన్ను తాను ప్రకటించుకొనిన యేసు ఈ ప్రాంతంలో పుట్టడం అర్థరహితం కాదు కదా!



ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని ఆకర్షిస్తున్న ‘చర్చ్‌ ఆఫ్‌ నేటివిటి’ బేత్లెహేములో ఉంది. యేసు పుట్టిన స్థలాన్ని దర్శించి తమ జీవితాలను పావన పరచుకుంటున్న వారు కోకొల్లలు. ఆ స్థలములో ఒక నక్షత్రం ఉంచబడింది. దానిని ‘స్టార్‌ ఆఫ్‌ బేత్లెహేమ్‌’ అంటారు.

క్రీస్తు శకము 135వ సంవత్సరంలో రోమా చక్రవర్తిౖయెన ఆడ్రియన్‌ క్రీస్తుకు సంబంధించిన గుర్తులన్నింటిని తుడిచివేయబడానికి విశ్వప్రయత్నం చేశాడు. ఆ తర్వాతి కాలంలో కాన్‌స్టాంటైన్‌ చక్రవర్తి యొక్క తల్లి సెయింట్‌ హెలెనా కోరిక మేరకు క్రీస్తు పవళించిన పశువులశాల మీద ఓ గొప్ప దేవాలయం కట్టబడింది. 614వ సంవత్సరంలో పర్షియా వారు ఆ దేవాలయాన్ని పడగొట్టే ప్రయత్నాన్ని ఓ సుందర దృశ్యం అడ్డుకుంది. యేసు జన్మించినప్పుడు ఆయన యెదుట సాగిలపడి, ఆరాధించి, కానుకలు సమర్పించిన ముగ్గురు జ్ఞానుల్లో ఒకడు వారి దేశానికి సంబంధించినవాడుగా ఆ దృశ్యంలో ఉండుటయే దానికి కారణం.



ఆ చర్చిలోనికి ప్రవేశించడానికి ఒక చిన్న ద్వారం ఉంటుంది. దానిని ‘డోర్‌ ఆఫ్‌ హ్యుమిలిటి’ అంటారు. ఎంత గొప్పవాడైనా తలవంచి లోపలికి వెళ్లాల్సిందే. దేవుణ్ణి దర్శించడానికి మనకు కావాల్సింది దీనమనస్సు, తగ్గింపు స్వభావము. దైవదర్శనానికి హృదయశుద్ధి, ఆత్మలో దీనత్వం అత్యవసరం. యేసుక్రీస్తు బేత్లెహేములో పుట్టాడన్నది చరిత్ర. ఆయన మానవ హృదయంలో పుడితే ఆ జీవితానికి మహోదయం. బేత్లెహేము స్వల్పగ్రామమైననూ క్రీస్తు దానిలో జనియించుట ద్వారా అది ప్రపంచ దృష్టిని నేటికీ ఆకర్షిస్తుంది.



నజరేతు

యేసుక్రీస్తు తన జీవితంలో ఎక్కువ కాలం నివశించింది ఇక్కడే. బాల్యము నుండి పరిచర్య ప్రారంభించేంత వరకు నజరేతులోనే పెరిగాడు. ఇది గలిలయలోని ఓ కుగ్రామం. మరియ, యోసేపులు నివసించిన ప్రాంతం. ఇక్కడి నుండి కర్మెలు పర్వతాన్ని స్పష్టంగా చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ సుమారుగా లక్షమంది నివసిస్తున్నారు. వారిలో కొందరు అరబ్బులు, మరికొందరు క్రైస్తవులు. విశ్వవ్యాప్తంగా అసంఖ్యాక యాత్రికులు ఈ పట్టణాన్ని కూడా దర్శిస్తుంటారు.



యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఇక్కడ ఒక సమాజ మందిరం ఉండేది. దానికి 80 మెట్లు ఉండేవి. క్రీస్తు తన రాక యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ బహిర్గతపరిచాడు. ‘‘ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించుటకు, నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు’’ అని ప్రవక్త ౖయెన యెషయా ద్వారా పలుకబడిన వచనాలను చదివి నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని చెప్పెను (లూకా 4:18–21).



క్రీస్తు చరిత్రకు సంబంధించిన అనేక ఆధారాలు ఈ ప్రాంతంలో లభించాయి. క్రీస్తు రహస్య సంవత్సరములు అని పిలువబడిన పన్నెండు నుండి ముప్ఫై సంవత్సరాల వరకు ఇక్కడే పెరిగాడు. వడ్లవాడైన యోసేపుకు అన్ని విషయాల్లో సహాయపడెనని చరిత్ర చెబుతుంది.

ప్రస్తుతము ఈ పట్టణాన్ని ఎన్‌–నసీరా అని పిలుస్తారు. మరియ దూత ద్వారా రక్షకుని ఆగమనము గూర్చి తొలిసారిగా వినిన ఇంటిపై ఓ గొప్ప దేవాలయాన్ని నిర్మించారు. దానిని ‘చర్చ్‌ ఆఫ్‌ అనౌన్సియేషన్‌’ అంటారు. యేసుక్రీస్తు నజరేతులో నివసించిన కారణాన ఆయనకు ‘నజరేయుడు’ అనే పేరు ఉంది. ‘నెచెర్‌’ అనే మూలభాషా పదం నుండి ఆ పేరు వచ్చింది. నెచెర్‌ అనగా చిగురు అని అర్థం. బైబిల్‌లో అనేకులు క్రీస్తును నజరేయుడు అని పిలవడం ద్వారా ఆయన మీద ఉన్న భక్తి భావాన్ని చాటుకొని పునీతులయ్యారు.



ఎండిపోయిన జీవితాలను వికసింప చేయగలడు క్రీస్తు. మోడుబారిన బ్రతుకులను చిగురింప చేయగల శక్తి దేవునికి పుష్కలంగా ఉంది. బీటలు తీసిన నేలపై ఆశీర్వాదపు వర్షాన్ని కురిపించగల కరుణామయుడు క్రీస్తు. ఎండిన ఎడారుల్లో నీటిని ప్రవహింపచేసి, బండ నుండి నీటి ఊటలు పుట్టించి, ఎందరినో చిగురింప చేసిన ఘనత యేసుకు దక్కింది.



కపెర్నహూము

ఇది గలిలయలోని మరో చారిత్రక ప్రదేశము. ప్రపంచంలో సుమారుగా నాలుగు వేల నాలుగొందల పట్టణాలున్నాయని అంచనా. కపెర్నహూముకు ‘యేసు పట్టణము’ అని విశిష్ట నామం కలదు. పురాతన పట్టణ ప్రవేశ ద్వారం నుంచి దానిని చూడవచ్చు. ప్రవక్త తన స్వంత ప్రాంతంలో ఘనుడు కాదు అన్నట్లుగా నజరేతు ప్రజలు యేసును తిరస్కరించుట ద్వారా ఆయన ఇక్కడ నివసించాడు. పాతనిబంధన కాలంలో నహూము అనే ప్రవక్త పేరు ఈ పట్టణానికి పెట్టబడింది.



సువార్తికులు ప్రస్తావించిన చారిత్రక ఆధారాలనుబట్టి క్రీస్తు అనేక అద్భుతాలను ఈ పట్టణంలో జరిగించాడు. ఆశ్చర్యకరుడు అనే నామం సార్థకమయ్యింది. ప్రకృతి రమణీయమైన ఈ ప్రాంతం గలిలయ సముద్ర తీర ప్రాంతంలో ఉంది. యేసు తన శిష్యుడైన పేతురు అత్తను తీవ్ర జ్వరం నుండి విడిపించాడు. రోమన్‌ శతాధిపతి దాసుడు మరణశయ్యపై ఉండగా క్రీస్తు తన శక్తి ద్వారా లేవనెత్తాడు. ఈ సంగతులను బైబిల్‌లో చదువుచున్నప్పుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది.



క్రీస్తు ఈ ప్రాంతంలో అసంఖ్యాకమైన అద్భుతాలు చేసి ప్రజలను దీవించాడు. దేవునికి అద్భుతాలు చేయడం చాలా తేలికైన పని. కపెర్నహూములో ఓ అరుదైన సంఘటన జరిగింది. పక్షవాయువుగల ఒక మనుష్యుని తన స్నేహితులు మోసికొని వచ్చినప్పుడు యేసు బోధిస్తున్న ఇల్లు ప్రజలతో కిక్కిరిసి యుండగా ఇంటి పెంకులు విప్పి మంచముతోనే ఆయన యెదుట దింపగా క్రీస్తు వారి విశ్వాసమునకు ముగ్ధుడై ఆ వ్యక్తిని క్షమించి, స్వస్థపరిచాడు.



క్రీస్తు చేసిన అసాధారణ కార్యాలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ పట్టణం నిలిచింది. ప్రస్తుతం ఇక్కడ సమాజమందిర శిధిలాలు, మొదటి శతాబ్దపు ప్రజలు నివసించిన గృహాల సముదాయం కలవు.గలిలయలోని మరికొన్ని ప్రాంతాలు క్రీస్తు ఔన్నత్యాన్ని చాటి చెప్తున్నాయి. ధన్యతల కొండపై క్రీస్తు చేసిన ప్రసంగం ప్రపంచంలోని అనేకులను నేటికీ ప్రభావితం చేస్తుంది. కానా ఊరిలో నీటిని ద్రాక్షరసంగా మార్చడంలాంటి అద్భుతాలు గలిలయలో చోటు చేసుకున్నాయి.



సమరయ

క్రీస్తు పాదాలు తాకడం ద్వారా పునీతమైన మరొక ప్రాంతం సమరయ. దీని అసలు పేరు షోమ్రోను. పాతనిబంధనలో చరిత్ర కలిగిన పట్టణము. ఇది ఒక కొండమీద కట్టబడినది. అష్షూరు వారు ఇశ్రాయేలును చెరపట్టే సమయం వరకు ఇది ఇశ్రాయేలు రాజ్యానికి రాజధానిగా ఉంది. క్రీ.పూ. 3వ శతాబ్దంలో అలెగ్జాండరు ద్వారా ఈ పట్టణం నాశనం చేయబడింది. ఆ తదుపరి రోమన్లు దీనిని స్వాధీనపరచుకొని హేరోదు చేతిలో పెట్టారు. అతడు సీజర్‌ అగస్టస్‌కు కానుకగా ‘సెబాస్టే’ అను ప్రాంతాన్ని నిర్మించాడు.

అష్షూరు పాలనలో వీరు దేవుని నుండి వేరైపోయారు. ఆ కారణాన యూదులచే తీవ్రంగా ద్వేషించబడ్డారు. ‘గెరీజీము’ అను కొండపై దేవాలయాన్ని నిర్మించుకొని దైవారాధన చేయడం ప్రారంభించారు. యూదయ నుండి గలిలయ వెళ్లడానికి సమరయ ద్వారా త్వరితగతిగా వెళ్లగలిగినప్పటికి యూదులు చుట్టు తిరిగి వెళ్లేవారు. వారిలో ఉన్న ఏహ్యభావానికి ఇది అద్దం పడుతుంది.



సమరయులు యూదుల ద్వారా అతి తీవ్రంగా ద్వేషించబడుతున్న సమయంలో క్రీస్తు ఆ ప్రాంతంలో అడుగుపెట్టి వారి మధ్యనున్న శత్రుత్వాన్ని రూపుమాపాడు. తనకు మనుష్యులంతా ఒక్కటే అని నిరూపించాడు. ఎన్నో ఏళ్లుగా కట్టబడిన ఎడబాటు గోడలను నిట్టనిలువుగా కూల్చివేశాడు. అశేష ప్రజావాహినికి ప్రయోజనాత్మకమైన ఆనంద కల్పనయే తన లక్ష్యమని నిరూపించాడు.



సమరయలోని సుఖారను ప్రాంతంలో ఓ స్త్రీతో క్రీస్తు సాగించిన సంభాషణ జనాదరణీయమైనది. ఆమె మొదట క్రీస్తును యూదునిగా, ఆపై ప్రవక్తగా, చివరకు మెస్సీయాగా గుర్తించింది. మెస్సీయా అనగా ప్రజలను రక్షించే అభిషిక్తుడు అని అర్థం. క్రీస్తు యొక్క సార్వభౌమాధికారాన్ని, అసామాన్య జ్ఞాన సంపదను గుర్తించి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా’’ అని చెప్పి గ్రామస్థులకు క్రీస్తును పరిచయం చేసింది. వారితో క్రీస్తు బస చేసిన కొన్ని గంటల్లోనే వారి మనోనేత్రాలు తెరువబడి క్రీస్తును లోకరక్షకుడని గుర్తించారు.



బేతనియ

నిర్దిష్ట చారిత్రక వాస్తవికతలో జీవించిన క్రీస్తు అడుగుపెట్టిన ప్రాంతాల్లో మరో అద్భుత ప్రాంతం బేతనియ. ఆ పేరుకు ‘ఖర్జూర పండ్ల గృహము’ అని అర్థం. ఒలీవ కొండ అంచున ఉన్న ఆహ్లాదకరమైన ప్రాంతం ఇది. యెరూషలేము నుండి యెరికోకు వెళ్లే మార్గంలో ఈ గ్రామం కనబడుతుంది. క్రీస్తు కొన్నిసార్లు ఈ ప్రాంతంలో బసచేశాడు. ఇక్కడ నివసించే ఒక కుటుంబం యేసుకు చాలా ఇష్టం. మార్త, మరియ, లాజరు అను ముగ్గురు యేసుకు చాలా ప్రియమైన వారు. ప్రాపంచిక అనైతికత్వము నుండి ఆధ్యాత్మిక దిశగా మనిషిని నడిపించిన క్రీస్తు దివ్యబోధలు మారుమోగిన ప్రాంతం ఇది.



సీమోను అను కుష్టువ్యాధిగ్రస్తుడు ఇక్కడ ఉండేవాడు. ఆ కాలంలో ప్రతివిధమైన చర్మవ్యాధిని కుష్టువ్యాధిగా పరిగణించేవారు. కనీసం కుటుంబ సభ్యులు కూడా వారిని సమీపించేవారు కాదు. ప్రజల చేత, సమాజం చేత చీదరించబడిన వ్యక్తిని యేసు చేరదీశాడు. తన దివ్యహస్తాలతో ముట్టి నూతన జీవితాన్ని ప్రసాదించాడు.



మరణబంధకాల్లో చిక్కుకుపోయిన లాజరును క్రీస్తు తన మానవాతీత శక్తితో బతికించాడు. శరీరంలో జీవక్రియలు ఆగిపోయిన నాలుగు రోజుల తర్వాత కూడా క్రీస్తు పలికిన శక్తిగల మాట ద్వారా లాజరు మరణ బంధకముల నుండి విడిపించబడి సజీవుడుగా బయటకొచ్చాడు. పునరుత్థానమును, జీవమును నేను అని సగర్వంగా ప్రకటించిన క్రీస్తు దివ్య శక్తి బేతనియలో రుజువు చేయబడింది. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం ‘ఎల్‌–అజరియా’ అని పిలుస్తారు. ‘లాజరు ఊరు’ అని దాని అర్థం.



‘లాజరు’ మృతమైపోయిన మనిషి కలలకు సాదృశ్యం. ఒక వ్యక్తి యొక్క కలలను కొన్నిసార్లు మనుష్యులందరూ అదిమిపెట్టి సమాధిలో పెట్టేస్తారు. దేవుడొక్కడే వాటిని తిరిగి బతికించగలడు. ‘నీ కలలు తిరిగి జీవిస్తాయి’ అన్న నిరీక్షణ క్రీస్తు దగ్గర ఉంది. చనిపోయిన లాజరును బతికించిన క్రీస్తు మృతమైపోయిన నీ కలలను తిరిగి బతికించగలడు.



యెరూషలేము

యెరూషలేము పట్టణము ఇశ్రాయేలు దేశానికి ‘గుండు’లాంటిది. విశాలమైన చరిత్ర దీనికుంది. ‘యెరూషలేము’ అనగా ‘సమాధానమును దేవుడే చూచుకొనును’ అని అర్థం. యెరూషలేము పట్టణము కొండలమీద కట్టబడినది. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును ఇక్కడే బలివ్వడానికి సిద్ధపడ్డాడు. దావీదు మహారాజు ఇశ్రాయేలు దేశాన్ని ఇక్కడ నుండే దిగ్విజయంగా పాలించాడు.

ఎన్నో విశిష్టతలు కలిగిన పట్టణము గనుకనే అనేకసార్లు శత్రువుల చేతికి చిక్కింది. ప్రపంచ చరిత్రలో 17 సార్లు పూర్తిగా, 13 సార్లు పాక్షికంగా ఈ పట్టణం నాశనం చేయబడింది. సర్వలోకనాథుడైన క్రీస్తు ఈ పట్టణంలో అనేక అద్భుతాలు చేయడంతో పాటు తన అద్వితీయశక్తిని కనుపరిచాడు.



మట్టల ఆదివారం రోజున యేసుగాడిదపై ప్రయాణం చేసుకుంటూ ఈ పట్టణంలో ప్రవేశించాడు. ‘హోసన్నా జయం’ అనే కేకలు మారుమోగాయి. చరిత్రలో ఎందరో ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి ప్రవేశించారు గాని క్రీస్తు ఆ పట్టణంలో లోకరక్షణార్థం తన రక్తాన్ని కార్చడానికి, సిలువలో మరణించడానికి వెళ్లాడు.క్రీ.పూ. 955లో సొలొమోను ద్వారా ఓ అద్భుత దేవాలయం కట్టబడింది. అయితే మొదటి శతాబ్దంలో క్రీస్తు ద్వారా హృదయం అనే దేవాలయం కట్టబడింది. ఇకపై దేవుడు గుడి గోడల్లో కాదు నివసించేది గుండె గుడిలో అని క్రీస్తు ఉద్బోధించాడు.



యెరూషలేము చారిత్రకంగా చాలా ప్రసిద్ది చెందింది. ఇది మూడు రకాల ప్రజలకు పవిత్ర స్థలం. క్రైస్తవులు, మహ్మదీయులు, యూదులు పవిత్రస్థలంగా భావిస్తారు. క్రీస్తు చేసిన గొప్ప గొప్ప కార్యాలు ప్రజల సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చాయి. పన్నెండు గుమ్మములుగల యెరూషలేము ప్రాకారము, సీయోను కొండమీద ఉన్న మేడగది, క్రీస్తు ప్రార్థించిన గెత్సేమనె తోట, వయా డొలొరొసా అని పిలువబడిన సిలువ మార్గము. సిలువ వేయబడిన కల్వరి కొండ, మరణాన్ని జయించి తిరిగిలేచిన ఖాళీ సమాధి ఇవన్నీ యెరూషలేములో సందర్శించదగ్గ ప్రాంతాలు.



రక్షకునిగా ఏతెంచి, ఉన్నత వ్యక్తిత్వాన్ని మాదిరిగా చూపి, సర్వజనుల పాపపరిహారార్థం కలువరి సిలువపై మరణించి, మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితం ప్రపంచ ప్రజలకు ఆదర్శం. నిత్యరక్షకుడైన ఆ ప్రభువును హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు శాంతి, సమాధానం, ఆత్మరక్షణ మన సొంతమవుతాయి.



డా. జాన్‌ వెస్లీ

ఆధ్యాత్మిక రచయిత, వక్త

క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్, రాజమండ్రి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top