గరిటెడైనను చాలు ఖరము పాలు...

గరిటెడైనను చాలు ఖరము పాలు...


కవర్ స్టోరీ

‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అంటూ వేమన గాడిద పాలను తృణీకరించాడు గానీ, గాడిద పాలకు గ్లోబల్ మార్కెట్‌లో గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. పాపం వేమన! గాడిద పాలను సరిగా విలువ కట్టలేకపోయాడు. ఇప్పటి పరిస్థితులను అంచనా వేసి ఉన్నట్లయితే, ‘గరిటెడైనను చాలు ఖరము పాలు’ అంటూ పద్యాన్ని తిరగ రాసేవాడేమో!




ఎందుకంటే, గరిటెడు గాడిద పాల ధర కడివెడు గంగిగోవు పాల ధర కంటే ఎక్కువే మరి. మన దేశంలో గాడిద పాల వినియోగం చాలాకాలం నుంచే ఉన్నా, పాల కోసం గాడిదల పెంపకం పారిశ్రామిక స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఉపఖండ ప్రాంతాలను విడిచిపెడితే, ప్రపంచంలో మిగిలిన చాలా దేశాల్లో గాడిద పాల వినియోగం పారిశ్రామిక స్థాయికి చేరుకుంది. వయసు మళ్లే ప్రక్రియను గాడిద పాలు ఆలస్యం చేస్తాయనే నమ్మకం క్రీస్తుపూర్వం నాటి నుంచే ఉండేది. గాడిద పాల ఔషధ  లక్షణాలపై తాజా వైద్య పరిశోధనల ఫలితాలు  ఆ నమ్మకాన్ని బలపరుస్తున్నాయి.

 

 

- పన్యాల జగన్నాథ దాసు


చిన్నప్పుడు తాను గాడిద పాలనే తాగి పెరిగానని పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల చెప్పడంతో కొద్ది రోజులుగా అంతర్జాతీయ మీడియాలో గార్ధభ క్షీర మహాత్మ్యం గురించి కథనాలు వెలువడుతున్నాయి. పోప్ ఫ్రాన్సిస్ లాటిన్ అమెరికన్ దేశమైన అర్జెంటీనాలో పుట్టిపెరిగారు. లాటిన్ అమెరికన్ దేశాలకు, భారత ఉపఖండానికి చాలా సారూప్యతలు ఉన్నాయి.



సంచారజాతుల వారు గాడిదలను తోలుకుంటూ వీధుల్లో తిరుగుతూ, వాటి పాలను అమ్మడం భారత్‌లోనే కాదు, అర్జెంటీనా, చిలీ వంటి లాటిన్ అమెరికా దేశాల్లోనూ మామూలే. ఉబ్బసంతో బాధపడే చిన్న పిల్లలకు గాడిద పాలు పట్టడం మన దేశంలో చాలాకాలంగా కొనసాగుతున్న పద్ధతి. గాడిద పాలు తాగే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే నమ్మకం కూడా ఉంది.గాడిద పాల ఔషధ విలువలపై జనంలో బాగా నమ్మకం ఉండటంతో వీటి ధర చాలా ఎక్కువ. లీటరు గాడిద పాల ధర దాదాపు రెండువేల రూపాయల వరకు ఉంటుంది.



ఔషధప్రాయమైన వినియోగం కోసం సుమారు 25-30 మిల్లీలీటర్ల మోతాదుల చొప్పున అమ్ముతుంటారు. ఒక్కో మోతాదు ధర రెండువందల రూపాయలకు పైమాటే. మన దేశంలో గాడిద పాలను ఔషధప్రాయంగా మాత్రమే వినియోగిస్తారు. లాటిన్ అమెరికన్ దేశాల్లోనైతే ఔషధంగా మాత్రమే కాదు, తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా కూడా పిల్లలకు పడతారు.



మనదేశంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారే గాడిద పాలను వినియోగిస్తారు. నగరాల్లోని సంపన్న వర్గాల వారు, చదువుకున్న మధ్యతరగతి వారు గాడిద పాలను పెద్దగా పట్టించుకోరు. గాడిద పాలతో వ్యాధులు నయమవుతాయనే వాదనను మూఢనమ్మకంగా కూడా కొట్టిపారేస్తారు. అందుకేనేమో! మన దేశంలో గాడిద పాల వినియోగం పారిశ్రామిక స్థాయికి ఇంకా ఎదగలేదు.

 

పోప్ ఫ్రాన్సిస్‌కు కానుకగా గార్ధభాలు

గత క్రిస్మస్‌కు కొద్దిరోజుల ముందు ఇటలీలోని ‘యూరోలాక్టిస్’ కంపెనీ పోప్ ఫ్రాన్సిస్‌కు నోవా, థెయా అనే రెండు గాడిదలను కానుకగా ఇచ్చింది. గాడిద పాలతో తయారు చేసిన రెండు బాస్కెట్ల మిల్క్ పౌడర్‌ను కూడా ఇచ్చింది. రోమ్‌లోని బాంబి జేసు (బాల ఏసు) చిన్నారుల ఆస్పత్రికి కూడా కొన్ని గ్యాలన్ల గాడిద పాలను విరాళంగా అందజేసింది. యూరోలాక్టిస్ వ్యవస్థాపకుడు పీర్‌లుగి ఒరునేసు నుంచి వీటిని స్వీకరించే సమయంలోనే పోప్ ఫ్రాన్సిస్ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.



చిన్నప్పుడు తనకు తల్లిపాలు చాలకపోతే, తన తల్లి తనకు గాడిద పాలు పట్టేదని, బాల్యంలో చాలాకాలం గాడిదపాలు తాగి పెరిగానని చెప్పారు. గాడిదపాలతో పలు ఉత్పత్తులను తయారుచేసే ‘యూరోలాక్టిస్’ కంపెనీకి పోప్ మాటలతో ఒక్కసారిగా విస్తృత ప్రచారం లభించింది. ‘యూరోలాక్టిస్’ మాత్రమే కాదు, ‘డాంకీ మిల్క్ బ్యూటీ’, ‘డాంకీస్ అండ్ కో’ వంటి కంపెనీలు గాడిదపాలతో సౌందర్య సాధనాలు మొదలుకొని, నవయవ్వన ఔషధాల వరకు నానా ఉత్పత్తులను తయారు చేస్తూ మార్కెట్‌ను విస్తృతం చేసుకుంటున్నాయి.



మిల్క్‌పౌడర్, సబ్బులు, ఫేస్‌క్రీములు, కాన్సంట్రేటెడ్ యాంటీ ఆక్సిడెంట్ క్యాప్సూల్స్, ‘నేచురల్ వయాగ్రా’ వంటి ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. యూరోపియన్ దేశాలతో పాటు చైనా, జపాన్, కొరియా వంటి ప్రాచ్య దేశాలు కూడా గాడిద పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి.

 

చరిత్రలో గార్ధభ క్షీర వైభవం

ఈజిప్టును ఏలిన క్లియోపాత్రా దీర్ఘయవ్వనం కోసం, మిలమిలలాడే చర్మసౌందర్యం కోసం గాడిద పాలతో స్నానం చేసేది. ఆమె స్నానక్రతువు కోసం రోజూ కనీసం ఏడువందల గాడిదల నుంచి సేకరించిన పాలు సరఫరా అయ్యేవి. రోమ్ చక్రవర్తి నీరో రెండో భార్య పాపీ సబీనా కూడా క్లియోపాత్రా ఒరవడిలోనే గాడిద పాలలో జలకాలాడేది. ఆమె ఎక్కడికైనా ప్రయాణాలకు బయలుదేరిందంటే, ఆమె వెనుక గాడిదల మంద అనుసరించాల్సిందే.



ఫ్రెంచి సైనిక పాలకుడు నెపోలియన్ చెల్లెలు పాలిన్ కూడా చర్మ సౌందర్యం కోసం గాడిద పాలు వాడేది. వారి కంటే ముందే వైద్య పితామహుడు హిప్పోక్రాట్స్ గాడిదపాల ప్రాశస్త్యాన్ని గుర్తించాడు. హిప్పోక్రాట్స్ క్రీస్తుపూర్వం 460లోనే వివిధ రోగాలకు, పాముకాటు వంటి సమస్యలకు గాడిదపాలతో చికిత్స చేసేవాడు. ప్రాచీన ఈజిప్టు, రోమన్, గ్రీకు రాజ్యాలలో 5500 ఏళ్ల కిందటే గాడిద పాలను వివిధ ప్రయోజనాల కోసం వాడేవారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో కూడా గాడిదపాల ప్రస్తావన ఉంది.



గాడిదపాలు చలవ చేస్తాయని, శరీరంలోని వేడిని తగ్గిస్తాయని, చర్మవ్యాధులను, శ్వాసకోశ వ్యాధులను నియంత్రిస్తాయని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. మధ్యయుగంలో ఉన్నత వర్గాల వారి పానీయంగా గాడిద పాలు గౌరవం పొందేవి. నిజానికి ఇరవయ్యో శతాబ్ది ప్రారంభం వరకు దాదాపు ప్రపంచవ్యాప్తంగా గాడిదపాల వినియోగం విరివిగానే ఉండేది.



ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల్లో కూడా సంచార జాతుల వారు వీధుల్లో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి గాడిదపాలు అమ్మేవారు. విక్టోరియన్ కాలంలో బ్రిటన్‌లోనూ గాడిద పాల వినియోగం విరివిగానే ఉండేది. ఆధునిక వైద్యం వేళ్లూనుకుంటున్న కాలంలో గాడిదపాలలోని పోషక, రోగ నిరోధక విలువలపై పరిశోధనలు కూడా జరిగాయి. ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్లలో విలియమ్ బుచన్ తన ‘డొమెస్టిక్ మెడిసిన్’ పుస్తకంలో గాడిద పాలలోని పోషక విలువలను విపులీకరించాడు.



పారిస్‌లోని చిన్నారుల ఆస్పత్రికి చెందిన వైద్య బృందం గాడిద పాలపై సాగించిన పరిశోధన సారాంశాన్ని ‘లండన్ గ్లోబ్ అండ్ ద న్యూయార్క్ టైమ్స్’ 1882 అక్టోబర్ సంచికలో ప్రచురించింది. ఆవు పాలు, మేక పాలు, బర్రె పాలు, గొర్రె పాల కన్నా గాడిద పాలే మేలైనవని ఆ పరిశోధన తేల్చింది. పారిశ్రామిక విప్లవానికి ముందు వరకు చాలా దేశాల్లో గాడిదలను దాదాపు ఇంటింటా పెంచేవారు.



రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత గాడిద పాల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. నాగరికత వేగవంతం కావడంతో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో గాడిద పాల వినియోగం దాదాపు కనుమరుగైంది. అయితే, కొద్ది సంవత్సరాలుగా సాగుతున్న వైద్య పరిశోధనల్లో గాడిద పాలలోని పోషక విలువలపై సానుకూల ఫలితాలు వెలువడుతుండటంతో వినియోగం క్రమంగా పుంజుకుంటోంది.



తాజా పరిశోధనల్లో తేలిన విశేషాలు

పోషక విలువల ప్రకారం తల్లిపాలకు దగ్గరగా ఉండేవి గాడిద పాలేనని ఆధునిక పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా గాడిద పాలలో లాక్టోజ్ దాదాపు తల్లిపాలకు సమానంగా ఉంటుందని, కొవ్వుశాతం చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. స్థూలకాయం నుంచి బయటపడేందుకు కూడా గాడిదపాల వినియోగం శ్రేయస్కరమని వారు సూచిస్తున్నారు.



జనాభాలో దాదాపు 2-6 శాతం ప్రజలకు ఆవుపాలు సరిపడవని, ఆవు పాల వల్ల వారు అలెర్జీలతో బాధపడుతున్నారని, అలాంటి వారికి గాడిద పాలు మేలు చేస్తాయని ఐక్యరాజ్య సమితి అధ్యయనం తేల్చింది. గాడిద పాలలో విటమిన్-సి, బి, డి-12, ఇ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆవుపాలతో పోలిస్తే, గాడిద పాలలో విటమిన్-సి అరవై రెట్లు ఎక్కువగా ఉంటుంది.



కీలకమైన ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలింది. గాడిద పాల వినియోగం ఫలితంగా ఉబ్బసం, సొరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులు నయమైనట్లు ఇటీవల సైప్రస్ వర్సిటీ శాస్త్రవేత్త, డెయిరీ సైన్స్ లెక్చరర్ డాక్టర్ ఫోటిస్ పాపడెమాస్ నిర్వహించిన పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. సైప్రస్‌తో పాటు ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, స్పెయిన్, హాలండ్, సెర్బియా, బోస్నియా వంటి దేశాల్లో పాల కోసం గాడిదల పెంపకం పరిశ్రమ స్థాయిలో కొనసాగుతోంది.

యూరోప్‌లో సేకరించిన గాడిద పాలలో దాదాపు సగానికి సగం సౌందర్య పోషణకు ఉపయోగపడే ఉత్పత్తుల తయారీకే తరలిపోతోంది. ఈ దేశాల్లో గాడిద పాలను నేరుగా తాగడంతో పాటు వివిధ ఆహార ఉత్పత్తులనూ తయారు చేస్తున్నారు. సైప్రస్‌లోనైతే గాడిద పాలతో మధువును కూడా తయారు చేస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో గాడిద పాలతో తయారయ్యే చీజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. దీని కిలో ధర 1350 డాలర్ల వరకు ఉంటుంది. అంటే, రూ.85 వేల పైమాటే. గాడిద పాలతో చీజ్ తయారు చేయాలంటే, ఒక కిలో చీజ్‌కు దాదాపు వంద కిలోల పాలు అవసరమవుతాయని స్విస్ షెఫ్ జీన్ మైకేల్ ఎవెక్వోజ్ చెబుతున్నారు.



వయసు మళ్లిన వారికి గాడిద పాలు బలవర్ధకమైన ఆహారంగా ఉపయోగపడతాయని ఒక పరిశోధనలో తేలిన విషయాన్ని ‘ఇంటర్నేషనల్ డెయిరీ జర్నల్’ వెల్లడించింది. అంత విస్తృతంగా కాకపోయినా, మన దేశంలోనూ గాడిద పాల గుణగణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. గాడిద పాలలో యాంటీ-కేన్సర్ లక్షణాలు, లైంగిక సామర్థ్యాన్ని పెంచే లక్షణాలు ఉన్నాయని లక్నో యూనివర్సిటీ పరిశోధకులు కొద్ది సంవత్సరాల కిందటే వెల్లడించినా, పెద్దగా ప్రచారం లభించలేదు.



కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహకారంతో డాక్టర్ అయినాక్షి ఖరే నేతృత్వంలో లక్నో వర్సిటీ బృందం గాడిద పాలపై పరిశోధనలు సాగిస్తోంది. గాడిద పాలు ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేయలేకపోయినా, రోగుల జీవితకాలాన్ని పొడిగించేందుకు గణనీయంగా దోహదపడగలవని లక్నో వర్సిటీ పరిశోధకుడు దేశ్ దీపక్ చెబుతున్నారు.

 

నవయవ్వన సాధనం!

గాడిదపాలు నవయవ్వన సాధనం కాగలదా? అంటే, ఇప్పటి వరకు వెలువడిన తాజా పరిశోధనలు ఔననే అంటున్నాయి. అంతేకాదు, గాడిదపాలతో దీర్ఘాయువు కూడా సాధ్యమేనంటున్నారు. ఈక్వెడార్‌లో దాదాపు ఏడేళ్ల కిందట మారియా ఎస్తర్ డి కాపోవిల్లా అనే మహిళ తన 116 ఏళ్ల వయసులో మరణించింది. బాల్యం నుంచి ఆమె రోజూ గాడిద పాలే తాగేది. కాపోవిల్లా మృతి దరిమిలా శాస్త్రవేత్తలు గాడిద పాలలో దీర్ఘాయువు కలిగించే లక్షణాలపై సాగించిన పరిశోధనల్లోనూ ఆశాజనకమైన ఫలితాలే వచ్చాయి. గాడిద పాలలో ఇన్ని విశేషాలు ఉన్నా, మన దేశంలో గాడిద పాల ఉత్పత్తి పారిశ్రామిక స్థాయికి చేరుకోకపోవడం గమనార్హం.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top