వీల్ పవర్!

వీల్ పవర్!


ఆదర్శం      

ఇంటి నాలుగు గోడలే ఇక ఆమె ప్రపంచం అనుకున్నారు. వీల్‌ఛైర్ మీదే ఆమె జీవితం కాస్తా గడిచిపోతుందని అపోహపడ్డారు. విల్‌పవర్ గట్టిదైతే విజయాలు ఎలా క్యూ కడతాయో నిరూపించారు దీపామాలిక్!

 

సుప్రసిద్ధ ‘జిందగీ ఏక్ సఫర్ హై’ పాట ఆమె నోట తరచుగా కవిత్వంగా వినిపిస్తుంటుంది. ఆ పాటలోని వెలుగు ఆమె కళ్లలో శక్తిగా స్థిరపడినట్లు  అనిపిస్తుంది!  ‘జిందగీ ఏక్ సఫర్ హై!’

 నిజమే...

 ‘జీవితం అనేది ఒక అద్భుత ప్రయాణం’

 రేపు ఏం జరగనుందో ఎవరికి మాత్రం తెలుసు?’

 ఆర్మీ ఆఫీసర్ ముద్దుల కూతురిగా  పెరిగిన దీపామాలిక్ (ఢిల్లీ)కి నాలుగు గోడల మధ్య ఉండడం కంటే వీలైనంత ఎక్కువ సమయం ఆరుబయట గడపడం అంటేనే ఇష్టం. ఎందుకంటే  అక్కడ చెట్టు మాట్లాడుతుంది.



పుట్ట మాట్లాడుతుంది. సమస్త ప్రకృతి తీయగా మాట్లాడుతుంది. రెండో అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు దీపకు అప్పుడప్పుడూ వెన్నునొప్పి వచ్చేది. వైద్యులను సంప్రదిస్తే పెరిగిన బరువే దీనికి  కారణం అని చెప్పారు. రెండో అమ్మాయి పుట్టిన తరువాత కొంతకాలానికి పనిగట్టుకొని బరువు తగ్గారు. అయినప్పటికీ  ఫలితం కనిపించలేదు. ఈసారి  ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే వెన్నెముకలో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.



మూడుసార్లు జరిగిన సర్జరీల ప్రభావంతో ఆమె పక్షవాతానికి గురయ్యారు.  చక్రాల కుర్చీలో ఇంటికే పరిమితం అయ్యారు. ‘‘విధిరాతను ఎవరు ఊహించగలరు? నిన్న మొన్నటి వరకు మన కళ్లముందే చలాకీగా తిరిగిన అమ్మాయికి  ఈ నాలుగు గోడల గదే ప్రపంచం అయింది’’... ఇలాంటి చేదు సానుభూతి మాటలు తరచుగా వినిపించేవి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు  చిన్న విషయాలుగా తోచినవే ఇప్పుడు చాలా పెద్ద సమస్యలై భయపెట్టసాగాయి.



ఈ నిరాశ చీకట్లోనే  ఒకవైపు నుంచి వెలుగు రేఖ ఒకటి దూసుకొచ్చింది. ‘నా జీవితం ఈ నాలుగు గోడల మధ్య ముగియడానికి ఎంత మాత్రం వీలులేదు’ అనుకున్నారు బలంగా. ముందు ఇంటి నుంచి అడుగు  బయటపెట్టాలి. ప్రధానస్రవంతిలో తాను కూడా భాగం కావాలి. ఈ ఆలోచనతోనే ఒక చిన్న రెస్టారెంట్ మొదలు పెట్టారు. ఆ తరువాత  కేటరింగ్ బిజినెస్  మొదలు పెట్టారు.



రెండూ సూపర్ హిట్. దీప సాధించిన విజయం మీద ఒక టీవీ చానెల్ ప్రత్యేక షో చేసింది. ఆ షోలో  దీప ఈత కొడుతున్న దృశ్యాన్ని చూసిన  ఒక వ్యక్తి ‘పారా-స్పోర్ట్స్‌లో పాల్గొనడానికి  ఆసక్తి ఉందా?’ అని అడిగాడు. అలా దీపా మాలిక్ ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టారు.



ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దశలో ‘జీవితాన్ని మలుపు తిప్పే సందర్భం’ వస్తుంది. ముప్ఫైఆరు సంవత్సరాల వయసులో దీపకు అలాంటి అవకాశమే వచ్చింది. రాష్ట్ర స్థాయిలో జరిగిన పారా-స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలను గెలుచుకున్నారు.

 

ఇది మాత్రమే కాదు... స్విమ్మింగ్, జావెలిన్ త్రో, షాట్‌పుట్ మొదలైన ఆటల్లో జాతీయస్థాయిలో 54, అంతర్జాతీయ స్థాయిలో 13 బంగారు పతకాలను అందుకున్నారు. వాతావరణ ప్రతికూలతలను తట్టుకొని బైక్‌పై 1,700 కిలోమీటర్లు ప్రయాణించిన దీప అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో నాలుగుసార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

 

‘‘వీల్ చెయిర్ మీద ఆధారపడేవారు ఏమీ సాధించలేరనే మూస అభిప్రాయాన్ని చెరిపేయాలనుకున్నాను. నాలాంటి వాళ్లకు జీవనోత్సాహాన్ని ఇవ్వాలనుకున్నాను. జీవితం ఇంతే అనుకుంటే ఏమీ లేదు. జీవితం ఎంతో అనుకుంటే సాధించడానికి చాలా ఉంది’’ అంటారు దీప. కేవలం ఆటలకు మాత్రమే పరిమితం కాకుండా మోటివేషనల్ స్పీకర్‌గా ఎంతోమందిని ప్రభావితం చేస్తున్నారు దీపా మాలిక్.



‘మనలోకి మనం తొంగి చూసుకోవడం, భయాల స్థానంలో బలమైన సంకల్పాలను పాదుకొల్పడం, ఇతరుల నుంచి స్ఫూర్తి పొందడం, మనల్ని మనం ప్రేరేపించుకోవడం మొదలైనవి విజయం దిశగా మనల్ని తీసుకెళతాయి’ అంటారు దీప. ఒకప్పుడు ఉదయాన్ని చూస్తేనే చీకటి నరకంగా భయపడిన దీపా మాలిక్ ఇప్పుడు  ‘జీవితం అంటే ఏమిటో కాదు... రోజూ జరుపుకునే ఏకైక పండగ’ అంటున్నారు!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top