తపాలా: ‘దేవుడు చనిపోయాడా నాన్నా?’

తపాలా: ‘దేవుడు చనిపోయాడా నాన్నా?’


నా పేరు శ్యామ్ సుందరరావు. ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయుణ్ని. భార్య పుష్ప. ఆమె కూడా విశ్రాంత ఉద్యోగిని. మాకు ఒక అబ్బాయి. పేరు బాలరాజు. మేమంతా వాణ్ని బాలు అని పిలుస్తాం. ప్రస్తుతం భాగ్యనగరంలోనే ఐసీఐసీఐ బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు.

 బాలుకు అప్పుడు అయిదేళ్ల ప్రాయం అనుకుంటాను. నా కొలీగ్ అయిన ఒక మాస్టారుగారింటికి వెళ్లాల్సిన పని ఉంది. ఆ సాయంత్రం మాస్టారుగారింటికి బయలుదేరుతుండగా బాలు, ‘‘నేనూ వస్తా నాన్నా’’ అని అన్నాడు. సరే రమ్మన్నాను.

 ఇద్దరం మాస్టారుగారింటికి చేరాం. ఇంటి తలుపు మూసి ఉంటే, డోర్ బెల్ కొట్టాను. కొంచెంసేపటికి మాస్టారు భార్య తలుపు తీసింది.

 ‘‘నమస్తే టీచరుగారండీ’’ అన్నాను. ‘‘నమస్తే మాస్టారుగారండీ’’ - మాస్టారు భార్య ప్రతి నమస్కారం చేసింది.

 ‘‘ఏం బాలూ! టీచర్‌గారికి నమస్తే పెట్టవా?’’ అని అడిగితే, ‘‘గుడ్ ఈవినింగ్ మిస్’’ అన్నాడు రెండు చేతులూ జోడించి. టీచరు, ‘‘గుడ్ ఈవినింగ్ బాబూ’’ అని, ‘‘నేనింకా మిస్‌ను కాదు బాలూ’’ అని అంటే, ఇద్దరం నవ్వుకున్నాం.

 ‘‘రండి మాస్టారూ రండి. మా మాస్టారుగారు స్నానం చేస్తున్నారు. రండి కూర్చోండి’’ అన్నారు టీచరు.

 నేను, బాలు హాలులో కూర్చున్నాం.

 టీచరు వంటింట్లోకెళ్లారు.

 నేను టీపాయ్ మీద ఉన్న పేపర్ తీసి, చదవనారంభించాను. బాలు హాల్లోని గోడలకున్న ఫొటోలు చూస్తూ ఉన్నాడు. అవి మాస్టారు పూర్వీకుల ఫొటోలు. వారిప్పుడు లేరు, చనిపోయారు.

 ‘‘ఫొటోలకు దండలెందుకు వేశారు నాన్నా?’’ అని బాలు నన్నడిగాడు.

 ‘‘వాళ్లు చనిపోయారమ్మా. చనిపోతే అలా దండలేస్తారు’’ అని చెప్పాను.

 హాల్లో మరోవైపు గోడకు దేవుళ్లు, దేవతల ఫొటోలున్నాయి. ఆ ఫొటోలకు కూడా దండలు వేసి ఉండటం చూసి,

 ‘‘దేవుడు చనిపోయాడా నాన్నా?’’ అని అడిగాడు బాలు.

 ఒక్క క్షణం స్తంభించిపోయాను. వెంటనే... ఏం చెప్పాలో తోచలేదు.

 ‘‘లేదమ్మా. దేవుడు చనిపోలేదు’’ అని మాత్రం అనగలిగాను గానీ, బాలు అడిగిన ఆ ప్రశ్న దండలు వేసి ఉన్న ఫొటోలు చూసినప్పుడల్లా నా మదిలో మెదులుతూనే ఉంటుంది.

 - బేతంచర్ల శ్యామ్ సుందర్

  వినుకొండ

 ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు,

 మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి.

 మా చిరునామా: తపాలా, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1,

 రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34.  funday.sakshi@gmail.com

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top