గట్టున ఉంటే ఈత రాదు

గట్టున ఉంటే ఈత రాదు - Sakshi


మహిళా విజయం

రెండు తెలుగు రాష్ట్రాల్లోకి పెయింట్ తయారీ పరిశ్రమలో ఉన్న ఏకైక మహిళ  కవితా రాజేశ్. ‘‘పరిశ్రమల రంగం అంటే ప్రతిరోజూ ఓ సవాలే. లాభాల కోసం చూడాల్సింది మూడేళ్లు శ్రమించిన తర్వాతనే. ఇందులో మనగలిగేది టెక్నాలజీ ఒంటబట్టించుకున్నప్పుడే.  కొనసాగగలిగేది క్వాలిటీని  నిలుపుకున్నప్పుడే’’ అంటున్నారామె. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన కవిత పూర్వీకులది మెదక్.  బి.కామ్ చేశాక, న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు.



ఆమె చదువుకూ, ఆమె నిర్వహిస్తున్న ‘ఓం సాయి ఆంధ్రా పెయింట్స్’ పరిశ్రమకూ పొంతన కుదిరినట్లు అనిపించదు. తండ్రి స్థాపించిన పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోవడాన్ని చూస్తూ ఊరుకోలేక చెన్నైలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని ఈ రంగంలో అడుగుపెట్టిన కవిత అనుభవాలు... ‘‘మా నాన్న పరిశ్రమ నుంచి పాతయంత్రాలను కొనుగోలు చేసి 2002లో 800 చదరపు అడుగుల చిన్న షెడ్‌లో రంగుల తయారీ పరిశ్రమను బాలానగర్‌లో ప్రారంభించాను. ఏడు లక్షలకు పైగా ఖర్చయింది. బ్రేక్ ఈవెన్ రావడానికి మూడేళ్లు పట్టింది. దీనిని జస్టేషనల్ పీరియడ్ అంటారు. పారిశ్రామికవేత్తకు కుటుంబం నుంచి మద్దతు ఉండాల్సింది ఈ దశలోనే. అంత పెట్టుబడి పెట్టిన తర్వాత నెలవారీ నిర్వహణ ఖర్చులు భరిస్తూ, అమ్మకాలు ఊపందుకోక గందరగోళంగా ఉంటుంది.



చాలా మంది నిరుత్సాహపడి వెనుదిరిగేదిప్పుడే. మంచి ఉద్యోగాన్ని వదులుకుని నాకు మించిన భారాన్ని తలకెత్తుకున్నానేమో అనిపించిన సందర్భాలున్నాయి. పైగా అప్పట్లో నాకు కెమికల్ రంగం గురించి తెలియదు. పరిశ్రమ పెట్టిన తర్వాత కెమికల్స్ గురించి, వాటిని కలపాల్సిన పాళ్లు, మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరల గురించి తెలుసుకున్నాను.  టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు నా అవగాహనను పెంచుకున్నాను. శాఖాపరమైన అనుమతులు, రిజిస్ట్రేషన్ వంటి పనులన్నీ స్వయంగా చూసుకున్నాను. మా వారు రమేశ్ మెకానికల్ ఉత్పత్తుల మార్కెటింగ్ నిష్ణాతులు కాబట్టి ఆయన అనుభవం నాకు ఉపకరించింది.

 

మా సేవలే మాకు ప్రచారం!

డెకరేటివ్ ఎనామిల్స్‌తో మొదలు పెట్టిన పరిశ్రమను ఇప్పుడు వినియోగదారులు ఏ రకమైన పెయింట్‌ని అడిగినా సమకూర్చగలిగిన స్థితికి తీసుకొచ్చాను. పెయింట్స్ తయారీలో అగ్రగామి సంస్థలు అనేకం ఉన్నాయి. మాలాంటి చిన్న పరిశ్రమలు భారీ పరిశ్రమల దాటికి తట్టుకుని నిలబడడం పెద్ద చాలెంజ్. పైగా ప్రచారం కోసం పెద్ద సంస్థలు చేసినంత ఖర్చు మేము చేయలేం. దాంతో నేను ఓ మధ్యే మార్గాన్ని ఎంచుకున్నాను. ఫేస్‌బుక్‌తోపాటు మా కంపెనీ వెబ్‌సైట్లో అన్ని వివరాలను అందుబాటులో ఉంచాను. నాణ్యమైన సర్వీస్‌తో ఒకరి నుంచి ఒకరికి మౌఖిక ప్రచారం లభిస్తోంది.

 

వ్యక్తి నుంచి వ్యవస్థ దిశగా...

అద్దె గదిలో పాత యంత్రాలతో మొదలు పెట్టిన పరిశ్రమను కొత్త యంత్రాలతో, సొంత స్థలంలోకి మార్చగలిగాను. ఇప్పుడు మా దగ్గర గంటకు రెండు వందల లీటర్ల రంగును తయారు చేసే అధునాతన యంత్రాలున్నాయి. నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే... తయారీదారులకు, వినియోగదారులకు మధ్య డీలర్ పాత్ర కీలకమైంది. వినియోగదారు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో తయారీదారులకు అందే శాతాన్ని చూసుకుంటే... తయారీ ఖర్చు, ఎస్టాబ్లిష్‌మెంట్ ఖర్చు పోను మిగిలే లాభం చాలా తక్కువ.



డీలర్‌కి అందే కమిషనే ఎక్కువ.  అందుకే నేను నేరుగా వినియోగదారులను చేరుకోగలిగాను. అలాగే సంస్థను ఒక వ్యక్తి కేంద్రంగా నడిపించే పరిస్థితి నుంచి వ్యవస్థగా మార్చగలిగాను. ఉద్యోగులందరికీ శిక్షణనిచ్చి నిపుణులుగా తయారు చేసుకున్నాను. ఒకరు లేకపోయినా ఆ పనిని మరొకరు నిర్వహించగలుగుతున్నారు.ఇలాంటి మెళకువలన్నీ దిగి ఈదినప్పుడే తెలుస్తాయి. గట్టున ఉండి ఎంతగా అధ్యయనం చేసినా పట్టుబడవు.

రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి

ఫొటో: శివ మల్లాల

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top