వినోదమొక్కటే చాలదు!

వినోదమొక్కటే చాలదు!


టీవీక్షణం

 

బుల్లితెర ముందు కూర్చుని భలేగా ఎంజాయ్ చేస్తుంటారు బుజ్జిగాళ్లు. టీవీ చూడ్డానికి మించిన సంతోషం మరేమీ ఉండదు వారికి. అందుకే పిల్లల కోసం రకరకాల కార్యక్రమాలను రూపొందిస్తుంటారు చానెళ్ల యజమానులు. అసలు పిల్లల కోసమే ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ప్రత్యేక చానెళ్లు ఉన్నాయి. కార్టూన్ నెట్‌వర్క్, ఖుషీ టీవీ, నికొలొడియన్, నిక్ జూనియర్, డిస్నీ జూనియర్, జెటిక్స్, పోగో, మా జూనియర్స్, టూన్ డిస్నీ, చింటూ టీవీ, బూమెరాంగ్ అంటూ వందలాది చానెళ్లు చిన్నారులను అలరించడానికే పుట్టుకొచ్చాయి. వీటిలో చిన్నారుల మనుసుల్ని అత్యధికంగా దోచుకున్న చానెల్ నికొలొడియన్. ప్రపంచంలో ఇదే నంబర్‌వన్ కిడ్స్ చానెల్ అని సర్వేలో తేలింది. తర్వాతి స్థానంలో కార్టూన్ నెట్‌వర్క్ నిలిచింది.

 

ఇక ప్రోగ్రాముల విషయానికి వస్తే... పిల్లలకు మనుషులతో రూపొందించే కార్యక్రమాల కంటే, యానిమేషన్లే ఎక్కువ ఇష్టమని తేలింది. మనుషులతో రూపొందించిన వాటిలో శక్తిమాన్, మిస్టర్ బీన్ లాంటి ఏవో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. అందుకే పిల్లల కార్యక్రమాలను చాలావరకూ యానిమేషన్ రూపంలోనే తెరకెక్కిస్తున్నారు. టామ్ అండ్ జెర్రీ, బగ్స్ బన్నీ, డక్ టేల్స్, రిక్ అండ్ మార్టిన్, ద సింప్సన్స్, డ్రాగన్ బాల్, పవర్ రేంజర్స్, ద జంగిల్‌బుక్, శ్రీకృష్ణ, ఎక్స్‌మెన్, వాకింగ్ విత్ డైనోసార్స్, సూపర్‌మేన్, బ్యాట్‌మేన్, స్పైడర్‌మాన్ తదితర యానిమేషన్ సిరీస్‌లన్నీ సూపర్ హిట్ అయ్యాయి!

 

పిల్లల షోలే కదా అని లైట్‌గా తీసుకుంటే కుదరదు. బుజ్జిగాళ్లకీ ఓ టేస్ట్ ఉంటుంది. దాన్ని గమనించి, ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథనాలను వెలువరించాలి. లేదంటే ఫెయిలవడం ఖాయం. స్క్విరల్ బాయ్, వాట్ ఎ కార్టూన్ లాంటి కొన్నింటిని పిల్లలు తిప్పి కొట్టడానికి కారణం అదే. ఆ దెబ్బతో పిల్లలైనంత మాత్రాన ఏది పడితే అది చూడరని తెలిసొచ్చింది చానెళ్లవారికి. వెంటనే కొత్త కథల వేటలో పడ్డారు. సరికొత్త కథనాలకు తెర తీశారు. అయితే ఈ క్రమంలో షోలను కొన్నిసార్లు పక్కదారి పట్టిస్తున్నారు.

 

కొన్ని కిడ్స్ షోలను పరిశీలిస్తే హింస హద్దు దాటినట్టుగా అనిపిస్తోంది. తుపాకులతో కాల్చేయడం, బాంబులు వేయడం, కత్తులు దూయడం, వెంటాడి చంపడం, కుట్రలు పన్నడం, కుతంత్రాలు జరపడం వంటివి కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి పిల్లల మీద దుష్ర్పభావాన్ని చూపుతాయనడంలో సందేహం లేదు. టీవీ షోలను చూసి పిల్లలు తప్పుడు పనులకు పాల్పడిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఆమధ్య ఇద్దరు పిల్లలు ఓ టీవీ షోలో చూసి, తమ స్నేహితుడి పట్ల హింసకు పాల్పడ్డారు. మరో చిన్నారి తన ఫేవరేట్ షోలో హీరో వచ్చి కాపాడతాడని ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకున్నాడు. టీవీ ప్రోగ్రాముల ప్రభావం వారి మీద అంతగా ఉంటోందన్నమాట.

 

కాబట్టి పిల్లల కార్యక్రమాలను జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. హింసను వారి మనసుల్లో నాటకుండా, విలువలను తెలియజేసేందుకు ప్రయత్నించాలి. అలాగని నీతి పాఠాలు చెప్పమని కాదు. చెడును ప్రేరేపించవద్దని... వినోదంతో పాటు విజ్ఞానాన్నీ, విషయ పరిజ్ఞానాన్నీ కలిగించే కార్యక్రమాలను కూడా పెంచమని!

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top