చితికిన బతుకుల జీవన చిత్రం

చితికిన బతుకుల జీవన చిత్రం

 ఒక వీడియో షాప్ డెలివరీ బాయ్... ముంబైలో వీడియో షాపులో ఒక సినిమా క్యాసెట్ తీసుకుని, సైకిలెక్కి, కస్టమర్ ఇంటికి వెళ్తూ, వస్తూ... దారిలో అతనాగిన ట్రాఫిక్ సిగ్నల్స్, వాటిలో ఎర్రలైటు మీదే ఆధారపడి బతికే బిచ్చగాళ్లు, పసిపిల్లలు, అవిటివాళ్లు, మతిస్థిమితం లేనివాళ్లు, పేపర్లమ్ముకునేవాళ్లు, బొమ్మలు అమ్ముకునేవాళ్లు - వీళ్లందరి బాధ, జీవితం దగ్గరగా చూశాడు. అలా సిగ్నల్ దాటి సైకిల్ తొక్కుకుంటూ కస్టమర్ ఇంటికి వెళ్లే దారిలో కార్పొరేట్ ఆఫీసులూ చూశాడు. 

 

 అవి దాటి ముందుకెళ్తూ చాందినీబార్‌లూ చూశాడు. పరమ రిచ్ కస్టమర్ల ఇంట్లో పేజ్-3 కల్చర్‌నీ చూశాడు. అతను మామూలుగా సినిమా క్యాసెట్లు ఇచ్చేసే ఉద్యోగమే చేసుంటే కస్టమర్ల ఇంటి గేట్లు తప్ప ఇవేవీ చూసేవాడు కాదు. ఒక్కో సినిమానూ డెలివరీ చేస్తున్నప్పుడు అతని రక్తం ఒక్కోలా ఉడికేదనుకుంటా... ఇలా నా సినిమాని జనాలెప్పుడు చూస్తారని. అందుకే ఆ రోజు వచ్చేవరకూ కష్టపడ్డాడు. తన సినిమాలను జనాలు ఎగబడేలా చేశాడు. 

 

 అయితే ఆ జనాల జీవితాలనే అతను తన సినిమాల్లో ప్రతిబింబించాడు. తను డెలివరీ చేసిన సినిమా క్యాసెట్ల కన్నా గొప్పగా, తను డెలివరీ చేసిన దారిలో వచ్చే ప్రతి మజిలీలోను జనాల్ని, వాళ్ల జీవితాల్ని అతను సినిమాలుగా మలిచాడు. బాలీవుడ్‌లో అత్యంత ప్రముఖమైన దర్శకుడయ్యాడు. సినిమా తీస్తే చాలు జాతీయ అవార్డుతో సహా పలు ప్రైవేటు అవార్డులు వాటంతట అవే వచ్చి అతనికి అంకితమైపోయే స్థాయికి అతను ఎదిగిపోయాడు. అతను చూసిన దారిలోంచి అతను తీసుకొన్న సినిమాలు ట్రాఫిక్ సిగ్నల్, చాందినీ బార్, పేజ్-3, ఫ్యాషన్, కార్పొరేట్, హీరోయిన్... వగైరా. నాటి ఆ కుర్రాడు నేటి దర్శకుడు మధుర్ భండార్కర్.

 మధుర్ భండార్కర్ సినిమాల్లో కథని మనం క్లుప్తంగా రాయలేం. ఎందుకంటే అవి జిందగీ కాబట్టి. 

 

 జీవితమంతా చూసినట్టు, అనుభవించినట్టు 360 డిగ్రీలలోనూ ప్రతి పాత్రనీ తాను జీవించేసి, అందులోంచి బైటకొచ్చి, ఆ పాత్రల్లోని సంఘర్షణల్లో, వాటికి కారణమైన సంఘటనల్లో పనికొచ్చే వాటిని ప్రేక్షకుడిగా చూసేసుకుని, కాయితం మీద రాసేసుకుని తెరమీద ఆవిష్కరించేస్తారు మధుర్ భండార్కర్. అందుకే ఎవరి జీవితాల వ్యధలనైనా, కథలనైనా హృద్యంగా తెరకెక్కించగల రాయన. ఆ నేపథ్యంలో జరిగే కథల్లోని సమస్యల్ని ప్రేక్షకుల తలకెక్కించగల రాయన. అలా తీసిందే... ట్రాఫిక్ సిగ్నల్.ఒక సమస్యని యథాతథంగా చూపించే దర్శకుడు అద్దం లాంటివాడు. అదే, ఆ సమస్యలో చిక్కుకుని ఉన్న పాత్రల్ని ఉన్నతి వైపు నడిపించే పరిష్కార మార్గం చూపెట్టే దర్శకుడు మార్గ దర్శకుడు. అటువంటి దర్శకుడే మధుర్ భండార్కర్. 

 

 కవిత రాసేవాడు తన ఆలోచనల ప్రకంపనలని రాయాలి తప్ప చదివేవాడి మనోభావాలతో సంబంధం లేదు. కానీ, సినిమా కథల్ని కేవలం చూసే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే కాక, తన భావ ప్రకంపనల అలల్ని తెరమీద అక్షరాలుగా మార్చి కవితాత్మకంగా కథలల్లడం కొద్దిమందికే సాధ్యమైన విద్య. ఆ విద్య తెలిసిన కొద్దిమందిలో మధుర్ భండార్కర్ ఒకరు.

 

 ట్రాఫిక్ సిగ్నల్ చాలా చిన్న సినిమా. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌లో తీస్తే, ఎనిమిది కోట్లు వసూలు చేసింది. రూపాయికి రూపాయి లాభం రావడం... మిలీనియమ్‌లో ఎనీ డే పెద్ద అచీవ్‌మెంట్.కునాల్ ఖేము ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి. అతని పాత్ర పేరు ‘సిల్‌సిలా’. ముంబైలోని ప్రధాన రహదారి దగ్గర ట్రాఫిక్ సిగ్నల్‌ని అడ్డాగా నడుపుతున్న యువకుడు. హజీ భాయ్ అనే లోకల్ గూండా నడిపే దందాలో ఈ ట్రాఫిక్ సిగ్నల్‌కి ఇన్‌చార్జి శిల్‌శిలా. అమితాబ్ అభిమాని అయిన అతని తల్లి ‘సిల్‌సిలా’ సినిమా చూస్తుండగా పుట్టాడని ఆ పేరుతో పాపులర్ అయిపోయాడు.

 

 వృత్తి రౌడీ అయినా, ప్రవృత్తిలో ఆ సిగ్నల్‌లో ఉన్న చిన్నా చితకా జనాలందరికీ ఆప్తుడౌతాడు సిల్‌సిలా. అందరికీ తలలో నాలుకలా మెలుగుతుంటాడు. అందరికీ అతను కావాలి. అందరూ అతనికి కావాలి. అక్కడే రోడ్డు పక్కన అద్దకం బట్టలమ్మే ఒక అమ్మాయితో (నీతూ చంద్ర) అతనికో ప్రేమకథ.హాజీభాయ్ ఒక ఎమ్మెల్యేకి అమ్ముడుపోయి ఈ ట్రాఫిక్ సిగ్నల్‌ని అమ్మేస్తాడు. ప్రభుత్వం ఆ రోడ్డును ఎక్స్‌టెండ్ చేసి ఫ్లై ఓవర్ కట్టే పని చేపడితే ఆ కాంట్రాక్టు సదరు ఎమ్మెల్యేకి వస్తుంది. అప్పటిదాకా ఆ సిగ్నల్‌నే నమ్ముకుని, దాని చుట్టూరా జీవితాలు పెనవేసుకున్న ప్రతి ఒక్కరూ, తీవ్రంగా బాధపడతారు... సిల్‌సిలాతో సహా. ఆ సిగ్నల్‌ని పడేయకుండా, దాన్ని నమ్ముకున్నవాళ్ల జీవితాలు చెక్కుచెదరకుండా కాపాడుకునే ప్రయత్నమే ట్రాఫిక్ సిగ్నల్ సినిమా.

 

 మామూలుగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిశ్చలమైన జీవితం మనకి తెలిసి ఎర్రలైటు నుంచి గ్రీన్ లైట్ పడే మధ్య కాసేపే. మిగిలిన టైమంతా ఫ్లోటింగ్ జీవితమే. ఆ కాసేపు కోసం కొన్ని వందల మంది జీవితాలు దాని చుట్టూ పెనవేసుకుని ఉంటాయని గ్రహించడం, వాటిని సినిమా కథకి వస్తువుగా పరిగణించడం, ప్రేక్షకులకి, అవార్డుల జ్యూరీలకి, విమర్శకులకి అందరికీ నచ్చేలా దాన్ని తీయడం... ఇవన్నీ చాలా కష్టతరమైన పనులు.

 రాత్రయితే ఆ సిగ్నల్ దగ్గర కాపుగాసే వేశ్యలు, వాళ్ల జీవితాలు. పగలైతే బిచ్చగాళ్లు, చిల్లర వస్తువులమ్ముకునే దుకాణదారులు, అడుక్కునేవాళ్ల దగ్గర దందా వసూలు చేసే రౌడీలు, కాస్త డిగ్నిఫైడ్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌నని, పర్సు పోయిందని అడుక్కునే ఆత్మాభిమానులు, సిగ్నల్‌లో ఆగిన కాసేపే కారులో కనిపించే ధనిక జీవితాలు, డ్రైవర్ల నిర్వాకాలు... ఒక్కో సీనూ ఒక్కో మానవ జీవన దృక్కోణం.

 

  ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ మరో పాత్ర కొంకణాసేన్ శర్మది. ఆమె ఇందులో సెక్స్ వర్కర్‌గా నటించింది. ఆ పాత్రలో ఆమె ఎంతో ఒదిగిపోయింది. కొంకణాలోని గొప్ప నటి ఎప్పుడు ఏ పాత్ర చేసినా బయట పడుతూనే ఉంటుంది. అందుకేనేమో... మధుర్ తీసే సినిమాల్లో చాలావరకూ ఆమె ఉంటుంది. ఆయన సృష్టించిన పాత్రలకు ప్రాణం పోస్తుంది. తన టాలెంట్‌తో ప్రేక్షకుడి గుండెను మెలిపెడుతూనే ఉంటుంది. 

 

 యే హై జిందగీతో క్యాహై జిందగీ... అనే అద్భుతమైన నేపథ్య గీతం వింటే మనసు ఎక్కడికో వెళ్లిపోతుంది. ‘‘ఇదే జీవితమైతే, జీవితమంటే ఏది?’’ అనే అర్థం వచ్చే ఆ పాట మన ఆలోచనల్ని ఎక్కడెక్కడికో పరుగు తీయిస్తుంది. కార్పొరేట్ తర్వాత మధుర్ ఈ చిత్రాన్ని తీయడం చాలా గొప్ప విషయం. ఇది తెలుగులో పరుచూరి వెంకటేశ్వరరావుగారి అబ్బాయి రవీంద్రనాథ్ హీరోగా, అనిల్‌కృష్ణ దర్శకత్వంలో ‘జంక్షన్’గా రూపుదిద్దుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ సినిమాని తీశారు గానీ, దాంట్లో ఉన్న ఆత్మని (సోల్‌ని) మిస్ అయ్యారని పించింది. నాకు బాగా గుర్తున్న విషయం ఒకటుంది.

 

 ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇదే సాక్షి ఫన్‌డే పత్రిక కోసం ఒక కవిత రాశారు. ఎర్రలైటు నుంచి పచ్చలైటు పడేలోపు డిజిటల్‌లో అంకెలు 40... 39.. 38... 37... 10... 5... 3... 2... 1... 0కి వచ్చేస్తుంటే, వాటిని చూస్తూ పది రూపాయలు సంపాదించాలని కష్టపడే బిచ్చగాడి టెన్షన్‌ను అద్భుతంగా అక్షరీకరించారు. క్రికెట్ మ్యాచ్‌లో ఆఖరి మూడు బంతుల్లో ఒక్క సిక్సర్ కొడితే మ్యాచ్ గెలుస్తారనిపించినపుడు ఎంత టెన్షన్ ఉంటుందో... అంత టెన్షనూ ఆ వచన కవితలో పెట్టారు ఉత్తేజ్‌గారు.విచిత్రమేంటంటే మధుర్ భండార్కర్, ఉత్తేజ్‌గారు ఇద్దరూ రామ్‌గోపాల్‌వర్మ శిష్యులే. ఆయన హిందీలో, ఈయన తెలుగులో. సో, ఈ ఇద్దరితో పాటు హ్యాట్సాఫ్ ఆర్‌జీవీ అనాల్సిందే... ట్విట్టర్‌లో!

 
Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top