ఆ అవకాశం నాకు లేదా?

ఆ అవకాశం నాకు లేదా?


 నా వయసు 18. నేనింతవరకూ మెచ్యూర్ కాలేదు. డాక్టర్లకు చూపించే స్తోమత లేక అమ్మానాన్నలు నన్నిలా వదిలేశారు. ఒకవేళ నేను వైద్యం చేయించుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? నాకు కూడా అందరు అమ్మాయిల్లాగా పెళ్లి చేసుకుని సుఖపడాలని అనిపిస్తోంది. అందరు అమ్మాయిల్లాగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండే అవకాశం నాకు లేనే లేదా? రజస్వల కావాలంటే నేను ఏం చేయాలి?

 - మృణాళిని, ఖమ్మం



 మీరు మీ ఎత్తు, బరువు రాయలేదు. సాధారణంగా అమ్మాయిలు పదకొండు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల లోపు... వారి వారి బరువు, హార్మోన్ల నిష్పత్తిని బట్టి రజస్వల అవుతారు. పద్దెనిమిదేళ్లు దాటినా మీరు రజస్వల కాలేదు అంటే కచ్చితంగా ఏదో సమస్య ఉండి ఉండవచ్చు. థైరాయిడ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, ప్రొలాక్టిన్ వంటి పలు హార్మోన్లలో లోపం... గర్భాశయం, అండాశయాలు లేకపోవడం లేదంటే వాటి పరిమాణం చిన్నగా ఉండటం, జన్యు పరమైన సమస్యలు, మరీ సన్నగా లేక లావుగా ఉండటం, గర్భాశయ టీబీ, యోనిభాగం మూసుకుపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల ఇలా పదహారేళ్లు దాటిన తర్వాత కూడా మెచ్యూర్ కాకపోవడం జరుగుతుంది.



మీకు పరిష్కారం చెప్పాలంటే ముందు మీలో ఉన్న సమస్య ఏమిటో తెలుసుకోవాలి. దాన్నిబట్టి తగిన చికిత్స చేస్తే మీరు తప్పకుండా మెచ్యూర్ అవుతారు. అందరు అమ్మాయిల్లాగే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. మీకు ఖర్చుపెట్టే స్తోమత లేకపోయినా ఫర్వాలేదు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పెద్దాసుపత్రులు ఉన్నాయి. అక్కడి గైనకాలజిస్టును సంప్రదిస్తే స్కానింగ్, రక్తపరీక్షల వంటివి ఉచితంగా చేస్తారు. కారణాన్ని బట్టి తగిన చికిత్స అందిస్తారు.

 

  నాకు ఇద్దరు పిల్లలు. సిజేరియన్ ద్వారా పుట్టారు. రెండో సిజేరియన్ అయ్యి రెండేళ్లు అయ్యింది. ఆరు నెలల నుంచి పీరియడ్స్ సమయంలో నా పొట్ట మీద, కుట్ల మధ్యలో చిన్న గడ్డలాగా అవుతోంది. అది బాగా నొప్పి పుడుతోంది. పీరియడ్‌‌స తగ్గాక మళ్లీ పది రోజులకు మెత్తబడిపోతోంది. ఎందుకలా అవుతోంది?

 - స్వర్ణ, విజయవాడ



 సిజేరియన్ చేసేటప్పుడు గర్భసంచి  మీద గాటు పెట్టి, అందులో నుంచి బిడ్డను బయటకు తీస్తారు. ఆ సమయంలో మాయను, గర్భసంచి లోపలి పొర అయిన ఎండోమెట్రియమ్‌ను కూడా బయటకు తీసివేయడం జరుగుతుంది. ఒక్కోసారి పొరపాటుగా చిన్న ఎండోమెట్రియమ్ ముక్క పొట్టమీద పైన పొరలో కుట్ల కింద ఉండిపోవచ్చు. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి అది అక్కడే కరిగిపోతుంది. కొందరిలో మాత్రం అలా జరగదు.



హార్మోన్ల ప్రభావం వల్ల నెలనెలా పీరియడ్స్ సమయంలో గర్భసంచి నుంచి బ్లీడింగ్ ఎలా అవుతుందో, పొట్టమీద కుట్ల కింద ఉన్న ఎండోమెట్రియమ్ ముక్క ఉత్తేజితం అయ్యి అక్కడ కూడా బ్లీడింగ్ అవుతుంది. ఆ రక్తం గడ్డకట్టి అక్కడ మీరు చెప్పినట్టుగా గట్టిగా తయారవుతుంది. మళ్లీ వారం పది రోజులకు ఆ గడ్డ దానంతటదే కరిగిపోతుంది. అందువల్లే నెలసరి సమయంలో మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. మీరు కొంతకాలం డాక్టర్ పర్యవేక్షణలో హార్మోన్ ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లు వాడి చూడండి. అలా కూడా తగ్గకపోతే... ఆ గడ్డకట్టే ప్రాంతం వరకు చిన్నగా కట్ చేసి, ఎండోమెట్రియమ్ పొరను తొలగించాల్సి ఉంటుంది.

 

నా వయసు 25. రెండేళ్లక్రితం పెళ్లయ్యింది. ఇంతవరకూ గర్భం దాల్చలేదు. డాక్టర్‌కి చూపిస్తే...   గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయన్నారు. ఏవో మందులు వాడమంటే వాడుతున్నాను. ఎన్నాళ్లు ఇలా వాడాలి, ఎప్పటివి అవి తగ్గుతాయి అని అడిగితే డాక్టర్ కచ్చితంగా చెప్పడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. అసలు నాకు పిల్లలు పుడతారా?

 - వనజ, కర్నూలు



 గర్భాశయానికి ఇరువైపులా ఉండే అండాశయాల్లో హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన మార్పులు... ఇలా ఎన్నో కారణాల వల్ల పాలిసిస్టిక్ ఓవరీస్ (నీటి తిత్తులు) ఏర్పడతాయి. ఇవి పదేళ్ల వయసు నుంచి నలభయ్యేళ్ల వయసు వారి వరకు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు. వాటి వల్ల ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లక్షణాలు కనిపిస్తాయి. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అవాంఛిత రోమాలు, గర్భం దాల్చడంలో ఇబ్బంది, అబార్షన్ అయిపోవడం వంటి సమస్యలు రావొచ్చు. సమస్యను బట్టి చికిత్స ఎంతకాలం అవసరం అనేది తెలుస్తుంది. ఎవరికీ కూడా మందుల వల్ల నీటి బుడగలు తగ్గిపోవు. కాకపోతే ఆరు నెలల పైన వాడటం వల్ల అవి ఇంకా పెరగకుండా చూడొచ్చు.



 వాటివల్ల వచ్చే హార్మోన్ల అసమతుల్యత కూడా తగ్గే అవకాశం ఉంది. మీరు ఎంత బరువు ఉన్నారో రాయలేదు. నీటి బుడగల వల్ల కొందరిలో అండం సక్రమంగా పెరగదు. కాబట్టి మీరు వ్యాయామం చేస్తూ, నీటి బుడగలు పెరగకుండా మందులు వాడుతూ ఉండాలి. అండం తయారవడానికి మందులు, అవసరమైతే ఇంజెక్షన్లు తీసుకుంటూ ఆరు నుంచి పన్నెండు నెలల వరకూ ప్రయత్నించవచ్చు. అయినా కూడా గర్భం రాకపోతే... లాపరోస్కోపి అనే చిన్న ఆపరేషన్ ద్వారా నీటి బుడగలను తొలగించుకుని, తర్వాత మందులు వాడితే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top