వి ఫర్‌ విక్టరీ!

వి ఫర్‌ విక్టరీ! - Sakshi


వ్యాపారంలో ఎన్ని విజయాలు సాధించినా...

ఆర్థిక క్రమశిక్షణ గురించి ఎప్పుడూ మరవకూడదు


– కొచ్చవుసేప్, వి–గార్డ్‌ వ్యవస్థాపకులు



‘కష్టంతో కూడిన కార్యచరణ  ఏ విజయానికైనా కీలక సూత్రం’ అని వ్యాపార ప్రారంభంలోనే కాదు ఇప్పటికీ నమ్ముతారు ‘వి–గార్డ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌’ స్థాపకులు, ఛైర్మన్‌ కొచ్చవుసేప్‌ చిటిలపిలియే. ఒకప్పుడు కేవలం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన ఆయన వ్యాపారం ఇప్పుడు ఎంతోమంది ఉద్యోగులతో దశదిశలా వ్యాపించింది. వోల్టేజ్‌  స్టెబిలైజర్స్, వైరింగ్‌ కేబుల్స్, ఎలక్ట్రిక్‌ పంపులు, ఎలక్ట్రిక్‌ మోటారులు, గీజర్‌లు, సోలార్‌ వాటర్‌ హీటర్‌లు, ఎలక్ట్రిక్‌ ఫ్యాన్‌లు... మొదలైనవి వి–గార్డ్‌ ప్రధాన ఉత్పత్తులు. ఒక లక్ష రూపాయలతో మొదలైన ‘వి–గార్డ్‌’ ఇప్పుడు 1,500 టర్నోవర్‌ దాటింది.



ఫిజిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తరువాత కొచిన్‌(కేరళ)లో ఒక ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేశారు కొచ్చవుసేప్‌. మూడు సంవత్సరాల తరువాత ఆ కంపెనీ మూతపడింది. ఉద్యోగం పోయింది అనే బాధ కంటే... కొత్త వ్యాపారం ప్రారంభించడానికి తనకొక అవకాశం వచ్చిందనుకున్నారు కొచ్చవుసేప్‌.తండ్రి దగ్గర లక్ష రూపాయలు అప్పుగా తీసుకొని, 1977లో ఇద్దరు ఉద్యోగులతో కొచిన్‌లో ఒక చిన్నగదిలో ‘వి–గార్డ్‌’ను ప్రారంభించారు. మొదట ఓల్టేజ్‌ స్టెబిలైజర్లు మాత్రమే తయారుచేసినా ఆ తరువాత యూపీఎస్‌ సిస్టమ్స్, హౌస్‌వైరింగ్‌ కేబుల్స్, ఎల్‌టీ కేబుల్స్‌... మొదలైనవి తయారుచేయడం ప్రారంభించింది వి–గార్డ్‌.



‘‘నేను నా ఇంజనీర్లకు, మార్కెట్‌ డిపార్ట్‌మెంట్‌కు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటాను. మార్కెట్‌కు ఎవరి మీదా దయ ఉండదు. ఎవరి మీదా ప్రత్యేక అభిమానం ఉండదు. మార్కెట్‌ను గెల్చుకోవడానికి షార్ట్‌కట్స్‌ ఉండవు. కాలంతో పాటు మారుతూ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిపుచ్చుకోవాలి. ఇరవై సంవత్సరాల క్రితం మేము తయారుచేసిన వాటర్‌ పంప్‌లకు ఈరోజు తయారుచేస్తున్న వాటికి తేడా కనిపిస్తుంది. ఇది కేవలం వి–గార్డ్‌కు సంబంధించినది మాత్రమే కాదు ఏ కంపెనీ విజయానికైనా ఉపకరించే విధానం.



ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించడం, నాణ్యతాప్రమాణాలను పాటించడం మాత్రమే మార్కెట్‌లో మనం నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతాయి’’ అంటారు కొచ్చవుసేప్‌.1977లో స్టెబిలైజర్ల తయారీ ప్రారంభించినప్పుడు...‘భవిష్యత్‌లో వీటి డిమాండ్‌ తగ్గవచ్చు’ అనుకున్నారు కొచ్చవుసేప్‌. అయితే ఇప్పటికీ స్టెబిలైజర్ల  డిమాండ్‌ స్ట్రాంగ్‌గా ఉండడం కొచ్చవుసేప్‌ను ఆశ్చర్యానందాలకు గురి చేస్తుంది. కంపెనీ రెవెన్యూలో స్టెబిలైజర్ల  వాటా... 30 శాతం. ‘ప్రతి ప్రొడక్ట్‌కు తనదైన స్వభావం ఉంటుంది. ఆడంబరం కంటే అవసరమే కీలక పాత్ర వహిస్తుంది’ అని నమ్ముతారు కొచ్చవుసేప్‌.



‘‘మార్కెట్‌లోకి కొత్తగా  లార్జ్‌ ఎల్‌ఈడీ టీవీ వస్తే వాయిదా వేస్తాం తప్ప వెంటనే కొనుగోలు చేయలేము. ఎప్పుడో డబ్బులు ఉన్నప్పుడు కొంటాం. మనకు అత్యవసరాలైన వాటర్‌ పంపు, ఫ్యాన్‌లాంటి వాటిని కొనడాన్ని వాయిదా వేయలేము కదా. వి–గార్డ్‌ వృద్ధికి అత్యవసరం అనేది ఉపయోగపడింది’’ అంటారు కొచ్చవుసేప్‌.‘తీరని మార్కెట్‌ దాహమే మీ కంపెనీ విజయ సూత్రమా?’ అనే ప్రశ్నకు ఇలా జవాబు చెబుతారు కొచ్చవుసేప్‌.‘‘ఏ మేరకు వినియోగదారులను సంతృప్తిపరచగలం? ధరలను వారికి ఏ మేరకు అందుబాటు లోకి తీసుకురాగలం?... మొదలైన విషయాలను ఆలోచించిన తరువాతే మార్కెట్‌లోకి దిగుతాం’’  ‘ఫలానా వస్తువు మార్కెట్‌లోకి వచ్చి మంచి డిమాండ్‌లో ఉంది’ అనే మాట వినిపించినప్పుడు...



‘మనం మాత్రం ఎందుకు బరిలో దిగకూడదు’ అని హడావిడి పడిపోయే స్వభావం కొచ్చవుసేప్‌లో లేదు.తమ పరిమితులేమిటో గ్రహిస్తారు. మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి అవసరమైన బలాబలేమిటో తెలుసుకుంటారు. ఆలోచనకు, సాంకేతిక నైపుణ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ‘‘సాధించిన విజయం దగ్గరే ఆగిపోయి సంతృప్తి పడకూడదు. ఇంకా ఏమి సాధించాలి అనే దాని గురించి ఆలోచించాలి’’ అని వర్ధమాన వ్యాపారవేత్తలకు సలహా ఇస్తున్నారు కొచ్చవుసేప్‌.



కొచ్చవుసేప్‌ అత్యుత్తమ వ్యాపారి మాత్రమే కాదు... ఆయనలో రచయిత కూడా ఉన్నారు. తన అనుభవాల ఆధారంగా 2005లో ‘ప్రాక్టికల్‌ విజ్‌డమ్‌’ పేరుతో పుస్తకం రాశారు. ఈ పుస్తకానికి మంచి స్పందన లభించడంతో కొనసాగింపుగా మరో రెండు పుస్తకాలు రాశారు. వీటితో పాటు ‘డౌన్‌ మెమొరీ లేన్‌’ పేరుతో తన ఆత్మకథ రాసుకున్నారు. తన కిడ్నీలలో ఒకటి ఒక ట్రక్‌ డ్రైవర్‌కు దానం చేసి అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన కొచ్చవుసేప్‌  ‘కె.చిటిలపిలియే’ పేరుతో రకరకాల స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top