నిజమైన సేవకుడు

నిజమైన సేవకుడు - Sakshi


 గుజరాత్ రాష్ట్రంలోని సబర్కాంత జిల్లాలో ‘సహయోగ్’ అనే గ్రామం ఉంది. అక్కడికి వెళ్లి సురేశ్ సోనీ గురించి అడిగి చూడండి. వెంటనే వారి కళ్లలో ఓ మెరుపు, ఆ వెంటనే వెచ్చటి కన్నీళ్లు కనిపిస్తాయి. ‘ఆయన మా దేవుడయ్యా’ అన్న మాట వారి నోట వెలువడుతుంది. అది వారి మనసు లోతుల్లోంచి వచ్చిన మాట. అసలింతకీ ఎవరా సురేశ్ సోనీ?!1966లో ఎం.ఎస్.యూనివర్సిటీ ఆఫ్ బరోడా నుంచి ఎమ్మెస్సీ మ్యాథ్‌‌స పూర్తి చేశారు సురేశ్. లెక్చెరర్‌గా ఉద్యోగం దొరికింది. సరిపడా సంపాదన, భార్యా పిల్లలతో జీవితం సాఫీగానే సాగుతోంది.

 

  కానీ మనసే ఎందుకో తృప్తిగా లేదు. దానికి కారణం కేవలం ఆయన మంచితనం. చుట్టుపక్కల ఎవరైనా కాస్త బాధలో ఉంటే ఆయన మనసు పాడైపోతుంది. వాళ్లకి తనవంతుగా ఏదో ఒకటి చేసేవరకూ శాంతి ఉండదు. అలాంటి వ్యక్తి కళ్లు ఓసారి కుష్టు వ్యాధిగ్రస్తుల మీద పడ్డాయి. ఇక నాటి నుంచీ వారి గురించే ఆలోచన.కుష్టు... మనిషిని వికారంగా మార్చే స్తుంది. దాంతో చాలామంది వాళ్లని చూసి ముఖాలు తిప్పుకుంటారు. కొందరైతే చీదరించుకుంటారు కూడా. అది వాళ్ల మనసుల్ని ఎంత మెలిపెడుతుందో ఎవరూ ఆలోచించరు. కానీ సురేశ్ ఆలోచించారు. అలా అందరూ అసహ్యిం చుకుంటే పాపం వాళ్లెలా తట్టుకుంటారు అని ఆలోచించారు. ఆ ఆవేదన ఓ గొప్ప పనికి పురికొల్పింది. ‘సహయోగ్ కుష్టాయజ్ఞ ట్రస్టు’కు ఊపిరి పోసింది.

 

 ఊరినే నిర్మించారు...

 1988లో తన సహధర్మచారిణి ఇందిరతో కలిసి ఓ మహాయజ్ఞం మొదలు పెట్టారు సురేశ్. మొదట తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దాతల సాయంతో గుజరాత్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో 20 ఎకరాల స్థలాన్ని కొని,‘సహయోగ్ కుష్టాయజ్ఙ ట్రస్ట్’ను స్థాపించారు. వ్యాధిగ్రస్తులతో పాటు తమ కుటుంబం కూడా నివసించేందుకుగాను గృహాలు నిర్మించారు. వాటితో పాటు ఓ ఆసుపత్రి, లైబ్రరీ, పిల్లలు చదువుకోవడానికి బడి... ఇలా ఒక్కొక్కటిగా నిర్మిస్తూ ఓ గ్రామాన్నే తయారుచేశారు. దానికి ‘సహయోగ్ విలేజ్’ అని పేరు పెట్టారు. నాటి నుంచి... నిరాదరణకు గురై అష్టకష్టాలు పడుతోన్న కుష్టువ్యాధులకు ఆశ్రయం కల్పించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా కుష్టురోగులు వస్తున్నారు. సహయోగ్ గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు.సహయోగ్‌లో అందించే వైద్యంతో ఇప్పటివరకు వేల మంది కుష్టువ్యాధి నుంచి విముక్తి పొంది తమ కుటుంబా లతో హాయిగా జీవిస్తున్నారు. కొందరైతే తిరిగి వెళ్లడం ఇష్టం లేక, అక్కడే ఉండి వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్నారు. అలాంటి వారికి అక్కడ ఇళ్లు కట్టించారు సురేశ్.

 

 సహయోగ్ గ్రామస్తులకు భోజనం, వసతి, వైద్యం వంటివన్నీ మొత్తం ట్రస్టే చూసుకుంటుంది. అరవైమంది ట్రస్ట్ సభ్యులు వారికి కావలసినవన్నీ సమ కూరుస్తుంటారు. ఏ కష్టం కలగకుండా కంటిరెప్పలా చూసుకుంటారు. చికిత్స చేయించుకుంటున్న వారి పిల్లలు అక్కడున్న స్కూల్లో చదువుకుంటున్నారు.  కుష్టువ్యాధి నుంచి విముక్తి పొందిన కొందరు యువతీ యువకులకు పెళ్లిళ్లు కూడా చేశారు సురేశ్. వాళ్లకు ఇళ్లు ఇచ్చి జీవనోపాధి చూపించారు. కొందరికి కుట్టు మిషన్లు ఇప్పించారు. జిల్లా గ్రామీణాభి వృద్ధి సంస్థ సహకారంతో షాపులు, కర్మా గారాలు ఏర్పాటు చేయించారు. దాంతో వాళ్లు సుఖంగా జీవితాన్ని సాగిస్తున్నారు.  ప్రస్తుతం సహయోగ్ గ్రామంలో 111 కుటుంబాలున్నాయి. ఆ గ్రామ ప్రజల పోషణ, వైద్య సేవల ఖర్చు సంవత్సరానికి రూ. కోటి దాటుతోందట. అందులో ప్రభుత్వం ఇచ్చేది కేవలం రూ.20 లక్షలు. మిగతా మొత్తాన్ని సురేశ్ ఎంతో కష్టపడి సేకరిస్తుంటారు. ఎంత కష్టమైనా పడతారు కానీ, అక్కడి వారికి ఏ లోటూ రానివ్వ నంటారాయన. మరి ఆయన వారికి దేవుడు కాక మరేమవుతారు!

 - నిఖిత నెల్లుట్ల

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top