అతడు - ఆమె... ఇతడు - ఈమె

అతడు - ఆమె... ఇతడు - ఈమె - Sakshi


కథ

ఎనిమిది గంటలప్పుడు ఎవడో ఎదురుగా వున్న స్టాల్‌లో న్యూస్‌పేపర్ కొంటున్నాడు. ఇంటికెళ్ళేవరకూ ఆగలేను అన్నట్టు అక్కడే పేపర్ విప్పి  చదివేస్తున్నాడు. నిన్నటికీ ఇవాళ్టికీ మధ్య దేశమేమైపోయిందా అన్న ఆతృత కాబోలు. ఎదురుగా వస్తున్నవాడు సెల్‌ఫోన్లో మాట్లాడుతూ పెద్దగా నవ్వుతున్నాడు. అంతగా నవ్వే విషయం ఏవుందో మరి..!? ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి వున్నారు. చూడబోతే నేను తప్ప అందరూ ఆనందంగానే వున్నట్టున్నారు. ఛీ.. వెధవ జీవితం..!



నేనే ఎందుకిలా ఉసూరంటూ ఏడుస్తున్నానో అర్థంకావడం లేదు. అజంతా హోటల్లోకి దారితీశాను.  ఆహా..! ఇక్కడ ఇడ్లీ తినేసింతర్వాత చచ్చిపోయినా ఫర్లేదనిపించింది. టిఫిన్ ముగించి బైటికొచ్చాను. ఇప్పుడేం చేద్దాం..? ఆలోచించాను. కాసేపు ఒంటరిగా వుండాలి. ఒంటరిగా.. ప్రశాంతంగా..  ఏ వెధవా పలకరించకుండా వుండాలి. ఆటో ఎక్కి పార్క్‌కి చేరుకున్నాను. ఉదయం ఫూట గాబట్టి నేననుకున్నట్టే పార్క్‌లో జనం లేరు. ఏవేవో గుర్తుకొస్తున్నాయి. శరత్‌గాడు వాడి భార్య అంజలి.. ఆ జంటని తల్చుకుంటే ఆశ్చర్యంగా వుంటుంది. ఎలాంటి అరమరికలు, భేదాభిప్రాయాలు లేకుండా అంత అన్యోన్యంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఎలా వుండగలుగుతున్నారో..?!



నాకెందుకు ఇలా అయింది? లోపం ఎక్కడుంది..? ఇంకెక్కడ.. కచ్చితంగా నాలోనే! నేనే అంతటికీ కారణం. ఎవరో సైకాలజిస్టు చెప్పాడట. భార్య కాఫీ ఇచ్చినప్పుడు ‘థాంక్స్’  అనే చిన్నమాట ఉపయోగిస్తే చాలు.. ఆమె ఎంతో సంతోషిస్తుందట. మంచి భోజనం పెట్టినప్పుడు ‘ఈరోజు నీ చేతి వంట అద్భుతం’ అంటే ఆమె పడిన కష్టాన్నంతా మర్చిపోయి ఉప్పొంగిపోతుందట. భార్యాభర్తల మధ్య ఇలాంటి చిన్న చిన్న విషయాలే వారి బంధం గట్టిపడ్డానికి ఎంతో సహకరిస్తాయట. మరి నేనెప్పుైడనా మా ఆవిడకి థాంక్స్ చెప్పానా..? చెప్పినట్టు గుర్తులేదు. అదలా వుంచితే ఒకరి పుట్టినరోజుకి మరొకరు హేపీ బర్త్ డే చెప్పుకోవడం,  చిన్న చిన్న గిఫ్టులు ఇచ్చుకోవడం లాంటివి చెయ్యాలట. ఇవన్నీ శరత్ గాడే చెప్పాడు. మరి నేనేం చేశాను..?

 

పెళ్ళయిన తర్వాత మొదటి పుట్టినరోజుకు శ్రావణికి హేపీ బర్త్ డే అయితే చెప్పాను గానీ తనకేదో బహుమతి ఇవ్వాలన్న ఆలోచనే రాలేదు. ఇక రెండో సంవత్సరం మరీ ఘోరం.. పని ఒత్తిడిలో పడి ఆరోజు ఆమె పుట్టినరోజన్న సంగతే మర్చిపోయాను. అవన్నీ అలా వుంచితే ఆరోజు జరిగిన విషయం.. అది గుర్తుకొస్తే గుండెల్లో ముల్లు గుచ్చుకుంటున్నట్టే వుంటుంది. శ్రావణి నన్ను విడిచి వెళ్ళిపోతుందని నేను ఊహించలేదు.  ఏదో కోపంలో వెళ్ళిపోయినా తిరిగి వచ్చేస్తుందిలే అనుకున్నాను. కానీ నిన్న తెలిసిన వార్త.. మనిషిని మనిషిలా వుంచడం లేదు.. గుండెల్లో మంట రేపుతోంది.



శ్రావణి నామీద గృహ హింస కేసు పెట్టబోతోందిట. మా అత్తగారి వూళ్ళో వున్న ఓ చుట్టం ద్వారా విషయం తెలిసింది. అప్పట్నుంచి ఒకటే ఆలోచన.. ఏం కాదులే అని సర్దిచెప్పుకొని మనసు మళ్ళించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మళ్ళీ ఆలోచనలు అటే వెళ్తున్నాయి.

 

లోపలెక్కడో వున్న ఆశ మళ్ళీ బైటికొచ్చింది. పోనీ శ్రావణికి ఒకసారి ఫోన్ చేస్తే..? ఆత్మాభిమానం వున్న ఏ ఆడదీ మీ దగ్గిర వుండలేదు.. మళ్ళీ నాకు ఫోన్ చెయ్యడానికి గానీ, నన్ను కలవడానికి గానీ ప్రయత్నించకండి.. శ్రావణి వెళ్ళిపోతూ నిప్పులు కురిపిస్తూ అన్న మాటలు గుర్తొచ్చాయి. ఛ.. ఛ.. ఫోన్ చెయ్యడానికి నాకైనా సిగ్గుండాలి. ఫోన్ చేసి ప్రాధేయపడి.. తప్పైపోయిందని ఒప్పుకొని... ఆమెని రమ్మని బ్రతిమాలుకొని..  వద్దు.. వద్దు.. ఇక జీవితాంతం ఆమె ముందు వెధైవపోతాడు. అదీ ఒక బతుకేనా..?

 ఏం చెయ్యాలిప్పుడు..? సమస్యల్ని తట్టుకోవడానికి ముందు మానసికంగా సిద్ధపడాలట.



ఏం జరిగిపోదు అని మనకి మనవే ధైర్యం చెప్పుకోవాలట. ఒకరకంగా సెల్ఫ్ హిప్నాసిస్ లాంటిదన్నమాట. తర్వాత అసలు సమస్య మూలం ఏమిటి? దాన్ని పరిష్కరించుకోవడానికి ఏయే మార్గాలున్నాయి.. అని అన్వేషించాలట. అప్పటికి ఆ సమస్య కొంత తేలికైపోతుందట. ఇవన్నీ మొన్న ఓ వ్యాసంలో చదివాను. నేననుకునేదేమిటంటే ఒడ్డున నిలబడి ఇలాంటి ప్రవచనాలు ఎన్నయినా చెప్పొచ్చు.. సమస్యలో మునిగినోడికే దాని తీవ్రత తెలుస్తుంది.

 

అయినా ఆ రోజెందుకు అలా జరిగిందో అర్థంకావడం లేదు.. ఇప్పుడు తల్చుకుంటే విధి లిఖితం అలా వుందేమో అన్పిస్తోంది. లేకపోతే నేనెందుకంత కోపం తెచ్చుకోవాలి..? జరిగింది మరోసారి నా కళ్ళముందు మెదిలింది. ఆరోజు ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆనంద్‌గాడు పార్టీ ఇచ్చాడు. నిజానికి మందుకొట్టడం అనేది నాకేమాత్రం ఆసక్తి లేని విషయం. కానీ ఎప్పుడో ఇలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సరిగ్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ మధ్య కూర్చున్నప్పుడు కాదంటే వాళ్ళెలాగూ విడిచిపెట్టరు కాబట్టి ఏదో కొంచెం అలా సిప్ చేస్తానంతే..!



అయితే ఆరోజు మాటల్లో సిప్‌లు కొంచెం ఎక్కువయ్యాయి. ఇంటికొచ్చేసరికే శ్రావణి కోపంగా వుంది. అప్పటికే చాలాసార్లు నా సెల్‌కు ఫోన్ చేసిందట. కానీ నా సెల్ ఛార్జింగ్ అయిపోవడం నేను గమనించనే లేదు. మాటల్లోనూ మత్తులోనూ పడి ఇంటికి రావడం ఆలస్యమవుతుందని కూడా శ్రావణికి చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడో ఒకసారి తాగే నాలాంటి వాడికి మేనేజ్ చెయ్యడం చేతకాదు.. శ్రావణి వెంటనే పసిగట్టేసింది.  తాగొచ్చారా..? అడిగింది.

 

అసలు ఆ విషయం నేనే తనకి నెమ్మదిగా చెప్దామనుకున్నాను. పరిస్థితి చెప్తే ఆమె అర్థం చేసుకుంటుందనే నా నమ్మకం. అర్థం చేసుకునేదేమో కూడా.. కానీ శ్రావణి అలా ఫోర్స్‌గా ఒకేసారి అడిగేసరికి నా ఇగో దెబ్బతింది. అవును.. తాగే వచ్చాను. ఇప్పుడేంటి..? అసహనంగా అన్నాను. సాయంత్రం నుంచి ఫోన్లు చేస్తున్నాను. కనెక్ట్ కావడం లేదు.. కనీసం ఆలస్యమౌతుందని చెప్పాలని కూడా అనిపించలేదా..?

 అనిపించలేదు..

 

ఓహొ.. ఇంటికెందుకు వచ్చారయితే..? తెల్లార్లూ అక్కడే వుండాల్సింది.. తీవ్రంగా అంది. సరే.. ఈసారి అలాగే చేస్తాన్లే..

 వాదన పెరిగిపోయింది.  ఒక స్థాయిలో నేనేం చేస్తున్నానో నాకే తెలీలేదు. ఫలితం.. నా చేయి విసురుగా ఆమె చెంపను తాకింది. శ్రావణి నిర్ఘాంతపడి చూస్తుండిపోయింది. అప్పుడు చూశాను వెనక్కి.. శ్రావణి మేనత్త, మావయ్య! వెనక గది ద్వారం దగ్గర నిలబడి వున్నారు..! వాళ్ళొచ్చారన్న సంగతి నాకప్పటివరకూ తెలీదు. శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చి మా ఇల్లు కూడా దగ్గరే కాబట్టి చూసి పోదామని ఇక్కడికి వచ్చారట.



తర్వాత్తెలిసింది నాకు. మా గలాటాకు నిద్రాభంగమై లేచినట్టున్నారు. ఒక్కసారిగా నా మత్తు దిగిపోయింది. కానీ అప్పటికే ఆలస్యమైంది..! శ్రావణి మనసు ముక్కలైంది. తర్వాత ఏం జరగాలో అదే జరిగింది.. నేను ఒంటరిగా మిగిలిపోయాను.

  పిచ్చెక్కేటట్టు వుంది.. ఏదయితే అదవుతుందని శ్రావణికి ఫోన్ చేశాను. ఆమె కోపంగా ఏమైనా అన్నా సహనంగా వుండాలి అనుకున్నాను. అట్నుంచి హలో.. ఎవరూ..? అని వినిపించింది. అది శ్రావణి గొంతు కాదు. నేను.. సురేష్‌ను మాట్లాడుతున్నాను.. శ్రావణి లేదా..? అడిగాను.

 

నువ్వా బాబూ.. శ్రావణిని రమ్మని చెప్పడానికి చేశావా..? ఎందుకూ..? కొట్టి చంపెయ్యడానికా..? అది రాదులే బాబూ.. కోర్టు నుంచి నోటీసొస్తుంది.. అందుకో.. ఫోన్ కట్టయింది.

 ఆ గొంతు శ్రావణి మేనత్తది..! శ్రావణికి నా మీద కోపం తగ్గలేదన్న మాట.. కేసు పెట్టడానికే సిద్ధమైందన్న మాట..! అయిపోయింది.. అంతా అయిపోయింది.. సర్వనాశనం..! పరువు పోయినట్టే..!  ‘వీడి మీదేరా.. పెళ్ళాం గృహహింస కేసు పెట్టింది.. స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు’  నాకు వినిపించేలా ఎవరూ అనరు.. నేను వెళ్తుంటే వెనక మాట్లాడుకుంటారంతే..! విరిగిన మనసులు అతకవన్నట్టు శ్రావణితో కలిసుండడం కూడా ఇక అసాధ్యమే అవుతుంది. ఇప్పుడేం చెయ్యాలి..? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి?

   

మధ్యాహ్నం రెండు గంటలు.. గది తలుపులు దగ్గరికి వేశాను. మనసంతా బరువుగా అయిపోయింది. ఎన్ని రకాలుగా ఆలోచించినా నేను చేస్తున్న పని కరక్టే అనిపించింది. వేరే దారి లేదు. నేనంటే వీధిలో.. ఆఫీసులో.. మా ఏరియాలో.. ఓ గుర్తింపు వుంది. మంచివాడు.. ఎవరి జోలికీ వెళ్ళడు.. అని.  ఈరోజు.. ఇలాంటి మచ్చతో కాలనీలో నలుగురిలో తిరగడం అంటే.. లేదు.. లేదు.. అంతకంటే చావడం మంచిది.  నా సమస్యా సమసిపోతుంది.. శ్రావణి మీద రివెంజ్ తీర్చుకున్నట్టు కూడా వుంటుంది.. అవును.. అదే కరెక్ట్..!

 

జేబులో నుంచి బైటికి తీశాను.. విషం..! పంటలకు వాడేది.. పెస్టిైసడ్..!  గేరంటీగా ఛస్తాను.. ఎంతసేపట్లో చస్తానో..? కడుపులో నొప్పేమైనా వస్తుందా..?

 సెల్ మోగింది. ఇప్పుడెవడు..? విసుగ్గా తీసి చూశాను. శరత్ గాడు.. ఇప్పుడెందుకు చేస్తున్నట్టో..? కట్టెయ్యబోయి మళ్ళీ మనసు మార్చుకుని పచ్చ బటన్ నొక్కాను. ఎక్కడున్నావ్ రా..? అర్జెంటుగా ఇంటికొచ్చేయ్.. పార్టీ చేసుకుందాం.. అన్నాడు. పార్టీయా..? అవును.. నీలాంటి ఆదర్శదాంపత్యం వున్నవాడికి ప్రతిరోజూ పండగే.. నాలాంటోడి బాధెవడికి చెప్పుకోను..? ఏం పార్టీ..? ఇప్పుడేంటి..? చెల్లెమ్మ ఇంట్లో లేదా..? అయినా నేనిప్పుడు రాలేను.. సహనంగా చెప్పాను.

 

ఏం..? సెలవేగా ఈరోజు..? ఇంకేం చెప్పకు.. నువ్వు రావాల్సిందే.. లేదంటే నేనే మీ ఇంటికొచ్చేస్తాను. వాడి సంగతి నాకు తెలుసు. పట్టుపడితే వదిలే రకం కాదు.. వాడింటి నుంచి మా ఇంటికి రావడానికి ఐదు నిముషాలు కూడా పట్టదు. వస్తున్నాను.. ఇంకేమనాలో తోచక చెప్పాను. ఎందుకిలా జరుగుతోంది..? ఇది కూడా విధి లిఖితమేనా..? సరే.. కానీ.. ఒకసారి నిర్ణయించుకున్నాక నన్నెవడు ఆపగలడు..? కాకపోతే ఓ రెండు మూడుగంటల ఆలస్యం...బాటిల్‌ని కప్ బోర్డ్ లో పెట్టేసి శరత్ దగ్గరికి బెల్దైరాను.

 

ఆలోచించకు.. కాస్ట్లీ సరుకు.. వేసేయ్.. గ్లాసులో మందు నింపి నావైపు తోసి అన్నాడు. అప్పటికే వాడు గుర్రం ఎక్కి వున్నాడు.

 మందా..? ఇప్పుడా..? నా గొంతు ఏదోలా ధ్వనించింది. మందేన్రా.. ఏదో విషమన్నట్టు మాట్లాడతావేంటి..? విషం అన్న మాట వినగానే ఉలిక్కిపడ్డాను. ఇప్పుడెందుకీ పార్టీ ఇస్తున్నావో చెప్పనే లేదు.. కంగారును కప్పి పుచ్చుకుంటూ అన్నాను.  ఓహో... చెప్తేగానీ తాగవా..? సరే.. అంజలి వూరికెళ్ళింది.

 

మీ ఆవిడ వూరికెళ్ళినప్పుడెప్పుడూ నువ్వు పార్టీ ఇచ్చిన గుర్తు లేదే..?!

 కరెక్ట్.. ఇప్పుడు కూడా అందుకివ్వడం లేదు.. ఇదసలు పార్టీ కూడా కాదు.. నీతో కొన్ని విషయాలు చెప్పాలి.

 ఏం చెప్పాలి..?

 ముందు తాగు.. గద్దించినట్టు అన్నాడు.

 గ్లాస్ తీసుకొని గడగడా గొంతులో వొంపేసుకున్నాను. ఇప్పుడు చెప్పు.. అయినా భార్య వూరికెళితే విరహంలో మునిగి గంటకోసారి ఆమెకు ఫోన్ చేస్తూ నీ ప్రేమను గుర్తు చెయ్యాల్సినోడివి.. అదే గదా నీ ఫిలాసఫీ.. ఇప్పుడీ దుకాణం ఎందుకు పెట్టావో అర్థం కావడం లేదు.. విసుగ్గా అన్నాను.

 

ట్రాష్.. అదే..నే చెప్పాలనుకుంటున్నది.. ప్రతీ చిన్న విషయంలో భార్యకు థాంక్స్ చెప్పడం, ఎప్పటికప్పుడు ఏదో రకంగా మన ప్రేమను వ్యక్తపరచడం.. అన్నీ ట్రాష్.. అరిచాడు వాడు.

 ఏమైంది వీడికి..?  ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావ్..? కాస్త భయంగా అన్నాను.

 నరకం.. నరకం చూస్తున్నాన్రా.. ప్రతీ విషయంలో ఆవిడ చెప్పినట్టే వినాలి. నాకంటే పెద్ద జాబ్‌లో వుంది. ఎందుకులే అని ఎంతగానో కంట్రోల్ చేసుకుంటూనే వున్నాను..

 

అదేంట్రా.. భార్యాభర్తలు ఎలా వుంటే వారి బంధం బలపడుతుందని సైకాలజిస్టులు చెప్పారో అదే పాటిస్తుంటావ్.. నాక్కూడా పదే పదే చెప్తుంటావ్.. ఈరోజు నువ్వేమిటి ఇలా..?! నా గొంతులో ఎడతెగని ఆశ్చర్యం!

 నీ మొహం సైకాలజీ.. అవన్నీ నా పద్ధతులు కావు.. తనవి.. ఎమ్మే సైకాలజీ చదివింది నేను కాదు తను..! అక్కడికీ తను చెప్పినట్టు నడుచుకుంటూనే వున్నాను. కానీ నా సహనానికి కూడా ఓ హద్దుంటుంది కదా..! అయినా నిజంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ వున్నవాళ్ళు దాన్ని ప్రతిసారీ ఏవో పదాల్లోనో లేక మరో రకంగానో వ్యక్తం చేసుకోవాలా..?  అలా చేసుకుంటే అది రాన్రాను కృత్రిమంగా తయారౌతుంది. ఏం.. మీ ఆవిడ కాఫీ



ఇచ్చినప్పుడల్లా నువ్వు థాంక్స్ చెబుతావా..? చెప్పకపోతే నీ ప్రేమ మీ ఆవిడకి అర్థం కాదా..? నీ కళ్ళు, నీ మాట తీరు, నీ బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ.. అసలివి కూడా అక్కర్లేదురా.. వైబ్రేషన్.. అవును.. ఇద్దరి మధ్య కనిపించని ఒక వైబ్రేషన్.. అది చాలు.. భార్యాభర్తల మధ్య అనురాగం నిలిచి వుండడానికి.

 అసలేమైందిరా..? గొంతు తగ్గించి నెమ్మదిగానే అడిగాను.

 నటన.. ముసుగు తగిలించుకొని నటించడం నా వల్ల కావట్లేదురా.. మొన్న.. తన పుట్టినరోజు నాడు అలిగింది.. ఉదయాన్నే హేపీ బర్త్ డే చెప్పాన్రా.. మంచి చీర కూడా ముందే కొనేసి వుంచాను. ‘ఎప్పుడూ అర్ధరాత్రి పన్నెండు దాటాక లేపి మరీ చెప్పేవాడివి.. ఈసారి తెల్లారాక తీరిగ్గా చెబుతున్నావ్.. నా మీద ప్రేమ అంతకంతకూ తగ్గిపోతోంది..’ అంది. ఓ వెర్రినవ్వు నవ్వేసి వూరుకున్నాను. అక్కడితో ఆపలేదు.. ఆ సొద కంటిన్యూ అవుతూనే వుంది.  నేను బరస్ట్ అయ్యాను. ఇలా వుంటే మరీ కృత్రిమంగా అన్పిస్తోందని చెప్పాను.



నా బర్త్ డే రోజు కూడా అర్ధరాత్రి లేపి చెప్పకు... చిరాగ్గా వుంటోంది..  ఇంక ఈ పిచ్చి పనులు చాలు.. ఈసారి మళ్ళీ ఇలా సైకలాజికల్ విషయాలు చెప్తే దవడ పగుల్తుందన్నాను.. అంతే..! యుద్ధం జరిగింది. ఆమె వెళ్ళిపోయింది.

 నాకంతా ఆశ్చర్యంగా వుంది.. అయినా బాధపడకురా.. ఏదో కోపం మీద వెళ్ళిపోయుంటుంది.. మళ్ళీ వచ్చేస్తుందిలే.. నాకు చేతైననట్టు ఓదార్చాను.

 రాదు.. మళ్ళీ రాదు.. ఆవిడ సంగతి నీకు తెలీదు.. ఆత్మ.. ఆత్మా.. అదేమిటది..? నాలిక తడబడింది వాడికి.

 ఆత్మాభిమానం.. అందించాను.

 

అవును అదే.. ఆవిడకి టన్నులకొద్దీ వుందది.. అంచేత ఆవిడ రాదు.. నేను మనసులో విషం పెట్టుకుని ఇంతకాలం నటించానట..  విడాకుల పత్రాలు పంపిస్తుందట.. జీవితాంతం ఒంటరిగా బతికే ధైర్యం తనకి వుందట. మళ్ళీ నాదగ్గరికొచ్చేంత నీచమైన పని చెయ్యదట.. పోయింది.. అంతా పోయింది.. పరువూ మర్యాదా అంతా పోయింది.. నేను పిరికివాణ్ణి.. చాలా పిరికివాణ్ణి.. ఎలాగోలా బతికెయ్యగల గట్టి గుండె నాకు లేదు.. పెళ్ళాం వదిలేసి పోయిందని నలుగురూ అనుకుంటుంటే ఆ అవమానం తట్టుకొని మామూలుగా తిరిగే ధైర్యం అసలే లేదు.. అందుకే తాగాను.. విషం తాగాను.. నువ్వు రాకముందే.. నేను.. విషం.. వాడు టేబుల్ మీద తల వాల్చేశాడు.

 

నా గుండెలు అదిరిపోయాయి.. విషం.. విషం తాగాడా వీడు..?! ఇప్పుడేం చెయ్యాలి..? కాళ్ళు చేతులు ఆడ్డం లేదు.. అంబులెన్స్.. అవును.. అంబులెన్స్‌కి ఫోన్ చెయ్యాలి.. నెంబరెంత..? చేతులు వొణుకుతున్నాయి.. నెంబర్ నొక్కాను. ఎమర్జెన్సీ వార్డ్ బైట కూర్చున్నాను.. సమయం ముళ్ళ మీద వున్నట్టుగా గడుస్తోంది.. ఎట్టకేలకు కొన్ని యుగాల తర్వాత శరత్ వున్న ఆ గది తలుపు తెరుచుకుంది. నా గుండె శబ్దం నాకే వినిపిస్తోంది. నేనేమీ అడక్కమునుపే మీవాడు సేఫ్.. సరైన సమయంలో తీసుకొచ్చారు.. ఇంకాస్త లేటైతే కష్టమయ్యేది.. అన్నాడు లోపల్నుంచి వచ్చిన డాక్టర్. హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్నాను.



నేను మరో ఇద్దరు ఫ్రెండ్స్‌కు మాత్రమే ఫోన్ చేశాను. వార్త అలా అలా పాకిపోయింది. గంట గడిచేసరికి అక్కడకి చాలామంది చేరుకున్నారు. సెల్ మోగుతోంది.. చూశాను.. శ్రావణి చేస్తోంది.. నమ్మలేకపోయాను.. ఆన్సర్ చేశాను..ఉదయం మీరు ఫోన్ చేశారా..? అడుగుతోంది. అవును.. మీ మేనత్త మాట్లాడింది.. చెప్పాను. ఆవిడ నాకు చెప్పనే లేదు.. ఇప్పుడే కాల్ లిస్టులో చూశాను.. అడిగితే చెప్పింది.

 

ఆవిడ కోర్టు నోటీసు అదీ ఇదీ అంటోందేమిటి..? ఎంత వొద్దనుకున్నా నా గొంతు కొంచెం వణికింది. అదా.. ఆవిడ కొంచెం ఫెమినిస్టు భావాలున్నావిడ.. మీకు తెలీదా ఏంటి..? అబ్బాయిని కొంచెం జడిపిస్తే గానీ దార్లోకి రాడంది. అక్కడికీ నేను వొద్దని చెప్తూనే వున్నాను..

 మరి మీ పెదనాన్న కొడుక్కి నిన్న ఫోన్ చేస్తే అతను కూడా అలాగే అన్నాడు..?!

 వాడే కదా మీకు బాగా దోస్తు.. వాడికి మీరు చేస్తారని ఆవిడకి తెలుసు. అందుకే ఒకవేళ మీరు ఫోన్ చేస్తే అలాగే చెప్పమని గట్టిగా ఆర్డరేసింది..

 నిజమా.. అంతేనా.. నామీద కోపం లేదా నీకు..? ఆశ్చర్యంగా అడిగాను.

 

ఎందుకు లేదు..? మనింటి కెళ్ళాక చూసుకుందాం.. చెప్పింది శ్రావణి. ఆ గొంతులో కోపం లేదు. నా మనసు దూదిపింజలా తేలిైకపోయింది.

 సారీ శ్రావణి.. ఏదో మత్తులో.. కోపంలో చెయ్యి చేసుకున్నాను.. తప్పే..! ఇంటికెప్పుడొస్తున్నావ్..?

  ఇప్పుడు బయల్దేరుతున్నాను.. మీరు ఇంటి దగ్గరే వున్నారు కదా.. అడిగింది.

  నేనెక్కడున్నదీ చెప్పి.. శరత్ విషం తాగిన సంగతి చెప్పాను.  అలా ఎలా జరిగింది..? ఆశ్చర్యంగా అడిగింది శ్రావణి. అదంతా నువ్వొచ్చాక చెప్తాన్లే.. అన్నాను. సరేనంటూ ఫోన్ కట్ చేసింది. లోపలికెళ్ళాను. శరత్ గాడు కొంచెంగా తేరుకున్నాడు. బలహీనంగా మాట్లాడుతున్నాడు.



నన్నెందుకు బతికించావంటూ అడిగాడు. ఆ మాత్రం మాట్లాడుతున్నాడంటే ఇంక వాడికి ఫర్వాలేదనుకున్నాను. అక్కడ మిగతా వాళ్ళకి చూసుకోమని చెప్పి కాసేపట్లో వస్తానని బయటకొచ్చాను.

  రోడ్డు మీద కొచ్చి కనిపించిన ఆటో ఎక్కి మా ఇంటి అడ్రస్ చెప్పి పొమ్మన్నాను. శ్రావణికి వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి రావడానికి అరగంట కూడా పట్టదు. నేను విషం బాటిల్ పెట్టిన కప్ బోర్డ్ శ్రావణిది.. తనొచ్చేలోగా ఆ బాటిల్‌ని తీసి పారెయ్యాలి..!    

- ఎం. రమేష్ కుమార్

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top