కోడి కూత... రాంబాబు మేత!

కోడి కూత... రాంబాబు మేత!


హ్యూమర్

‘‘ఆహా...  ఆ గారెలను చూశావా... వాటిని చూస్తుంటే గుండ్రటి నూనె స్విమ్మింగ్‌పూల్‌లో ఈదుతున్న గజ ఈతగాడు ఫెల్ప్స్‌కు తాతల్లా  అనిపించడం లేదూ?’’ అన్నాడు మా రాంబాబు గాడు బజ్జీల బండి దగ్గర మూకుడులో వేగుతున్న గారెలను చూస్తూ.

 నేను జవాబిచ్చేలోగా మళ్లీ వాడే అందుకొని... ‘‘ఒలింపిక్స్‌లో మనకు పతకాలూ అవీ  రాకపోతేనేం...! చూశావా..? బాగా వేగి గోల్డ్ కలర్‌లోకి మారిన ఆ గారెలను చూడు. వాటిని చూస్తుంటే మూకుడు నిండా కళకళలాడుతున్న బంగారు పతకాల్లాగే లేవూ?’’ అన్నాడు వాడు.

 

‘‘అవున్రా’’ అన్నాను నేను. వాడు పెట్టించిన గారెలు తింటూ వాడితో ఏకీభవించకపోతే బాగుండదని మొహమాటంగా ఏదో అన్నాను.

 ‘‘అయితే... గారెలకు వ్యతిరేకంగా ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. గారెలకు ఉన్న మంచి పేరు దెబ్బతీయడానికి ఒక వ్యవస్థే పనిచేస్తోంది రా. గారెలకు వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ నడుస్తోంది. గారెలకు జరుగుతున్న ఈ అన్యాయానికి కుమిలిపోతున్నానురా’’ అన్నాడు రాంబాబు.

 

రోజూ సాయంత్రం కాగానే బజ్జీల బండి వాడి దగ్గరికి వెళ్తుంటాడు వాడు. ఇవ్వాళ నన్ను కూడా తీసుకెళ్లాడు. అక్కడ ప్లేట్లో నిండుగా గారెలు తింటూ మొదట తన్మయత్వంలో మునిగిపోయాడు. అంతలోనే తన తన్మయత్వాన్ని భగ్నం చేసుకొని అకస్మాత్తుగా ఆ మాట చెప్పేసరికి ఆశ్చర్యపోయాను.

 ‘‘ఎవరురా? గారెలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదెవరు?’’ అడిగాను నేను.

 ‘‘ఇంకెవరూ డాక్టర్లు. ఎందుకో డాక్టరంతా మూకుమ్మడిగా గారెలను వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు ఇచ్చే ప్రతి సలహాలోనూ మసలుతున్న నూనెలో వేగినవి తినవద్దని అంటూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే మొత్తం వైద్యవర్గాలన్నీ గారెలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నట్లు ఉంది’’ అన్నాడు వాడు.

 

‘‘పండగలు పబ్బాలు వస్తే చేసుకునే వంటకాల్లో గారెలే ముఖ్యమైనవి. డాక్టర్లు కూడా బహుశా గారెలు తింటూనే ఉంటారు. అలాంటప్పుడు వాటికి వ్యతిరేకంగా డాక్టర్లు కుట్ర పన్నుతున్నారని ఎలా అంటావు? ఒకవేళ చేసినా ఆ కుట్ర ఎందుకు నిలుస్తుంది?’’ అడిగా.

 ‘‘లేదురా. మనలాంటి గారె అభిమానుల మనోభావాలను డాక్టర్లు మాటిమాటికీ  గాయపరుస్తున్నారు. అంతేకాదు అనేక మంది గారె కార్మికుల ఉపాధిని కూడా వాళ్లు  దెబ్బతీస్తున్నారు. ఇదే డాక్టర్లు చేస్తున్న కుట్ర. వాళ్లు మాటిమాటికీ నూనెలో వేయించేవాటిని తినవద్దని చెబుతున్నారు కదా! తద్వారా పరోక్షంగా గారెలనూ తినవద్దని డాక్టర్లు చెబుతున్నట్లే కదా’’ లాజిక్ లాగాడు వాడు.



‘‘ఒరేయ్... మిరపకాయ బజ్జీలు, బోండాలూ, గారెలూ... ఇవన్నీ నూనెలో వేయించేవే. ప్రత్యేకంగా గారెల మీదే కుట్ర పన్నుతున్నారని నువ్వెలా అంటావ్’’ అడిగాను వాణ్ణి.

 ‘‘మిరపకాయ బజ్జీలే అనుకో. శనగపిండి వల్ల కొద్దిగా తినగానే కడుపు ఉబ్బినట్టు అవుతుంది. దాంతో ఒకటి రెండు కంటే ఎక్కువగా ఎవ్వడూ తినలేడు. ఇక బోండాలంటావా? అంతగా నైపుణ్యం లేకపోతే పైన ఒక లేయర్ వేగి ఉంటుంది.  లోపల పిండి అంతా పచ్చిగానే ఉంటుంది. గారెలనుకో... బల్లపరుపుగా ఉంటాయ్ కాబట్టి అన్నివైపులా సమానంగా కాల్తాయి.



అందుకే మిర్చి బజ్జీల బండి మీద ఉన్న అన్నిటికంటే గారెలే బెస్టు. బజ్జీల బండి అని పేరు మాత్రమే వాటిది. రాజ్యమంతా గారెలదే. పైగా మహాభారతంతో పోలిక మరి దేనికైనా ఉందా? బజ్జీలకుందా? బొండాలకుందా? అందుకే ఎవరెన్ని కుట్ర చేసినా సరే... గారెల మనుగడ ఖాయం. పొద్దు కుంగడానికి ఆకాశం...  పిండిలో చిల్లు పొడవడానికి మనిషికి వేలు... ఈ రెండూ ఉన్నంత కాలం ఈ సమాజంలో గారెలు ఇలా విలసిల్లుతుంటాయని నా నమ్మకంరా’’ అన్నాడు మా రాంబాబుగాడు.

 ‘‘చిల్లుగారెలో పొడవడానికి వేలు ఉన్నంత కాలం గారెలు ఉంటాయన్నావు. అది ఓకే. కానీ పొద్దు పొడవడానికీ... గారెలకూ సంబంధం ఏముంది?’’ అడిగాను.

 

‘‘పొద్దు కుంగగానే... అనగా సాయంత్రం కాగానే ఎంత పెద్దవాడినైనా అలా బజ్జీల బండి వద్దకు నడిపిస్తుంటాయి గారెలు. పొద్దుపొడుస్తూ ఉండగా కోడికి కూయాలనిపించినట్టుగానే, రోజూ సాయంత్రం అవుతూ ఉండగా... అంటే పొద్దు గుంకుతూ ఉండగానే గారెలు తినాలపిస్తుందిరా. కాళ్లు ఆటోమేటిగ్గా మిర్చిబజ్జీల బండి వైపుకు తిరుగుతున్నాయి. దీంతో నాకు ఒక విషయం అర్థమైంది’’ అన్నాడు వాడు.

 ‘‘ఏమిటి?’’

 ‘‘ఏం లేదురా... కోడికి కూత... నాకు మేత... ఒక నేచురల్ ఇన్‌స్టింక్ట్‌రా. కోళ్లు కూస్తున్నంత కాలం ఇలా నేను గారెలూ మేస్తూనే ఉంటా. అలా గారెలు తింటూనే  కన్నుమూస్తా’’ అన్నాడు వాడు.

 - యాసీన్

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top