సినిమా తోటలోకి కొత్త పాట ఒకటి వచ్చింది!

సినిమా తోటలోకి కొత్త పాట ఒకటి వచ్చింది! - Sakshi


పాటతత్వం

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు... సినిమా పాటల్లో ఆ లక్షణాలు బొత్తిగా లేని పాటలు కొన్ని అరుదుగానే వచ్చాయి. అలాంటి అరుదైన పాటల్లో ఓ ఆణిముత్యం ‘ముత్యాల ముగ్గు’ చిత్రంలోని చివరి పాట. ఇది విద్వత్కవి గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ఏకైక చలనచిత్ర గీతం కావడం విశేషం! ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యాలను మధించి ముప్ఫైకి పైగా కావ్యాలను, విమర్శనగ్రంథాలను రచించిన శేషేంద్ర సాహిత్య సంపద అంతా ఒక ఎత్తయితే ఈ పాట ఒక్కటీ ఒక ఎత్తనడం అతిశయోక్తి కాదేమో!

 

ఈ ఒక్క పాటతో ఆయన తెలుగు సినీ గేయసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరును సంపాదించారు.

 జనసామాన్యానికి పాట గుర్తున్నంతగా ఆయన ‘శేషజ్యోత్స్న’, ‘మండే సూర్యుడు’, ‘గెరిల్లా’ ఇత్యాది కావ్యాలు గుర్తుండవు. అది సినిమా మాధ్యమం మహిమ కూడా కావచ్చు!

 శేషేంద్రగారి చేత ఈ పాట రాయించాలని ప్రతిపాదించిన కవితాప్రియుడు ‘మెలోడియస్ వాయిస్ ఆఫ్ లిటరేచర్’ అని పేరు పడిన ‘ముత్యాల ముగ్గు’ నిర్మాత ఎమ్వీయల్.

 

‘ముత్యాల ముగు’్గ  ఔట్‌డోర్ షూటింగ్ జరిగిన ప్రాంతాల్లో ఇందిరా ధనరాజ్‌గిరి గారి ‘జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్’ ఒకటి కావడం కూడా ఈ ప్రతిపాదనకు దోహదం చేసి ఉండవచ్చు.

 బాపు దర్శకత్వాన్ని, ముళ్లపూడి వెంకటరమణ రచనను, కె.వి.మహదేవన్ సంగీతాన్ని, ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణ దర్శకత్వాన్ని నిర్వహించగా ఆరుద్ర, సినారె, శేషేంద్ర శర్మ పాటలు సమకూర్చగా, మొదట్లో శ్లోకాన్ని, పాటను మంగళంపల్లి వారు ఆలపించగా దృశ్యకావ్యంలా  రూపుదిద్దుకున్న ఈ కళాఖండానికి మొదటివారం ప్రేక్షకులు కరవయ్యారట!

 

ఉత్తర రామాయణానికి సాంఘిక రూపమే ‘ముత్యాల ముగ్గు’ ఇతివృత్తం.

 సీతారాముల్లాంటి ఆదర్శదంపతులు లక్ష్మి శ్రీధర్‌లు.

 సినిమా కథ ప్రకారం లక్ష్మి, శ్రీధర్‌ల వివాహం కాకతాళీయంగా జరుగుతుంది. లక్ష్మి శ్రీధర్ మిత్రుని చెల్లెలు. లక్ష్మి వివాహం ఒక మోసగాడితో నిశ్చయమవుతుంది. ఆ పెళ్లికి తన తండ్రి తరఫున సహాయం అందించడానికి శ్రీధర్ వెళ్తాడు.

 

వరుడు నిత్య పెళ్లి కొడుకని తెలిసి అతని అరెస్ట్‌తో పెళ్లి ఆగిపోవడంతో అపవాదుపాలయిన లక్ష్మి మెళ్లో మూడు మూళ్లు వేస్తాడు శ్రీధర్. ఆ గతాన్ని తలచుకొని తనను ఆపదలో ఆదుకొని జీవితభాగస్వామిని చేసుకున్న ఉన్నత సంస్కారం గల శ్రీధర్ తన జీవితంలో అనూహ్యంగా ఓ పాటలా అడుగు పెట్టి తనకు ఓదార్పును, కమ్మని కలలాంటి బతుకును ఇచ్చాడని- ఆమె మనసు తన అదృష్టానికి మురిసిపోతుంది.

 

రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది

 దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది

 శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది

 ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది

 అనే మొదటి చరణంలో శ్రీధర్ సాంగత్యంలో చిగురు తొడిగిన లక్ష్మి జీవితాన్ని కవి హృద్యంగా చెప్పారు. లక్ష్మి పెట్టిన రంగవల్లులను శ్రీధర్ తన్మయంతో తిలకించడం, దీపాలు వెలిగించుకోవడానికి అనువైన గూళ్లతో కూడిన తులసికోట ముందు లక్ష్మి పరవశమై నిలబడడం వంటి దృశ్యాలు కవి భావనకు దర్శకుడు, ఛాయాగ్రాహకుడు  ఇచ్చిన సహకారాన్ని తెలియజేస్తాయి.

 

ఆలుమగల అన్యోన్యత శూన్యమైన వేణువుకు స్వరాలు ఒదిగినట్టుగా ఉందనడం, లక్ష్మి వైవాహిక జీవితాన్ని శిశిరానికి వీడ్కోలు చెప్పిన వసంతంలా భావించడం... మామూలు సినిమా పాటలకు భిన్నమైన రమణీయమైన భావచిత్రాలు!

 ‘విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో

 ఆశల అడుగులు వినబడి, అంతలో పోయాయి...’

 అనే పంక్తులు సహృదయులకు రసస్పందనను కలిగిస్తాయి. నిరాశామయ జీవితాన్ని గడుపుతున్న లక్ష్మి హృదయంలో ఆశ ఎలా దోబూచులాడిందో కవి ఎంత ఆర్ద్రంగా చెప్పాడు!

 

‘కొమ్మల్లో పక్షుల్లారా, గగనంలో మబ్బుల్లారా

 నది దోచుకు పోతున్న నావను ఆపండి

 రేవు బావురుమంటోందని నావకు చెప్పండి’... అనే ముక్తాయింపు గుండెలను పిండేస్తుంది.

 మానవసహాయం అందదని తెలిసి సీతాదేవిలాగే నాయిక ప్రకృతికి మొరపెట్టుకుంటుంది. దూరమవుతున్న నావను నది దోచుకుపోవడంగాను, మెరుపులా మెరిసి మాయమైన మనిషి కోసం అలమటిస్తున్న నాయిక ఆవేదనను రేవు విలపిస్తున్నట్టుగాను ఊహించడం కవి భావుకతకు పరాకాష్ఠ!

 

నిజానికి ఈ పాటను శర్మగారు ఇంకా దీర్ఘంగా రాశారని, సినిమా పాట కొలతను దృష్టిలో పెట్టుకొని దానిని సంక్షిప్తీకరించామని ఎమ్వీయల్ చెప్పారు. ఎడిట్ చేసిన భాగంలో ఎన్ని అందాలు జారిపోయాయో మరి!

 జీవనసత్యాన్ని వెల్లడించే తాత్విక ప్రధానమైన గీతం కనుక, ఈ శీర్షికలో విశ్లేషణకు దీనిని ఎంచుకున్నాను. జీవితం చీకటి వెలుగుల, ఆశ నిరాశల ఊగిసలాట అనీ, సహనం వహిస్తే మంచికి అంతిమ విజయం లభిస్తుందని ఆశావహ దృక్పథంగల ఈ గీతానికి కవితాత్మ తోడు కావడం పూవుకు తావి అబ్బినట్లయింది. ఇది నిదురించిన సినిమా తోటలోకి దారి తప్పి వచ్చిన కమ్మని కలలాంటి పాటే!

 - పైడిపాల

 సినీగేయ సాహిత్య పరిశోధకులు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top