అన్నం పెట్టిన అమ్మకు 500 అవార్డులు!

అన్నం పెట్టిన అమ్మకు 500 అవార్డులు! - Sakshi


అర్థవంతం

మహారాష్ట్రకు చెందిన 65 ఏళ్ల సింధుతాయి సప్కాల్‌ను మీకెందరు పిల్లలు అని అడిగితే 1,500 మంది పైనే అని చెబుతుంది. మీ కుటుంబం గురించి చెప్పమంటే... 207 మంది అల్లుళ్లు, 36 మంది కోడళ్లు, 1000 మంది మనవళ్లు, మనవరాళ్లు అని అంటుంది. ఆమెకు, వాళ్లకు రక్తసంబంధం లేదు కానీ, వాళ్లకు అన్నీ ఆమే. రోడ్డుమీద అనాథ కనిపించినా, ఎక్కడైనా అనాథ చిన్నారులున్నారన్నా తీసుకొచ్చి తన ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమాల్లో చేర్పించి, వాళ్ల ఆలనా పాలనా చూస్తారు సింధుతాయి.  వాళ్లమీద ఆమెకంత ప్రేమ ఏంటి? అంటే అర శతాబ్దం వెనక్కి వెళ్లాలి.

 

కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేకపోవడంతో సింధుతాయిని పదో ఏటే స్కూలు మాన్పించేసి, పెళ్లి చేసి పంపించేశాడు ఆమె తండ్రి. తన కన్నా ఇరవై ఏళ్లు పెద్దవాడైన భర్త ఆమెకు నరకం చూపించాడు. రోజూ గొడ్డును బాదినట్లు బాదేవాడు. తన బాధ చెప్పుకోవడానికి కూడా చుట్టూ ఎవరూ ఉండేవాళ్లు కాదు. ఎందుకంటే వాళ్ల ఇల్లుండేది అటవీ ప్రాంతంలో. ఇరవయ్యో ఏట తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న సమయంలో సింధుతాయిని బయటికి వెళ్లగొట్టాడు భర్త. కడుపులో బిడ్డ ఉందన్న కనికరం కూడా చూపించలేదు.



పశువుల పాకలో అమ్మాయిని ప్రసవించిన సింధుకు, బిడ్డ బొడ్డుతాడును ఓ మొన తేలిన రాయితో కోసుకోవలసిన దుస్థితి తలెత్తింది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డను తీసుకుని పది కిలోమీటర్లు నడుచుకుంటూ పుట్టింటికి వెళ్లింది. కానీ వాళ్లు ఆమెకు ఆశ్రయమివ్వలేదు. దీంతో తనకిక చావే శరణ్యమనుకుంది. కానీ పండంటి బిడ్డను చూసి మనసు మార్చుకుంది.

 

పుణెకు చేరుకుని రైల్వేస్టేషన్లలో, బస్టాండ్లలో యాచన చేసి బిడ్డను పోషించింది సింధుతాయి. రోడ్డుమీద ఆలనా పాలనా లేని పసిబిడ్డల్ని చూసినప్పుడల్లా, ఆమె గుండె తరుక్కుపోయేది. వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకుంది. పిల్లల్ని చేరదీసి వాళ్ల కోసం తాను భిక్షం ఎత్తి, అందరినీ పోషించడం మొదలుపెట్టింది. కొన్నాళ్ల తర్వాత ఈ పిల్లల్ని తీసుకుని వివిధ సేవాసంస్థల్ని కలవడం మొదలుపెట్టింది. సింధు నిజాయితీని, ఆమె సేవాదృక్పథాన్ని గుర్తించి, ఆమెకు సాయం చేయడానికి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి.



వాటి సహకారంతో అనాథ పిల్లల కోసం ఓ ఇల్లు కట్టించింది. రోడ్డుమీద కనిపించే అనాథ పిల్లలు మరింత మందిని చేరదీసింది. పోనుపోను పూణె నగరంలో సింధుతాయి ఫలానా అని అందరికీ తెలిసొచ్చింది. ఆర్థిక సహకారం మరింతగా పెరిగింది. ఇప్పుడు పూణెలో ఎక్కడ అనాథ పిల్లాడు కనిపించినా, సింధుతాయి దగ్గరికి చేర్చడం ఓ అలవాటుగా మారిపోయింది అక్కడి జనాలకు.

 

విశేషం ఏమిటంటే సింధుతాయి అండ కోసం వచ్చిన అనాథల్లో ఆమె భర్త కూడా ఉన్నాడు! అతణ్ని  కూడా మన్నించి తన అనాథ శరణాలయంలోనే చోటిచ్చింది. తాను చేరదీసిన పిల్లల్లో కొందరు డాక్టర్లయ్యారు. ఇంజనీర్లయ్యారు. మరికొందరు వేరే ఉన్నత చదువులు చదివారు.

 

మొత్తంగా సింధుతాయి ఆధ్వర్యంలో ఆరు ట్రస్టులు నడుస్తున్నాయి. రోజూ వివిధ కంపెనీలకు, కార్యాలయాలకు వెళ్లడం, సభలు, సమావేశాల్లో పాల్గొనడం, అనాథల కోసం విరాళాలు సేకరించడం, వారి కడుపు నింపడం, విద్యాబుద్ధులు చెప్పించడం... ఇదీ సింధుతాయి దినచర్య.

 

సింధు కృషిని గుర్తించి దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు 500 దాకా అవార్డులిచ్చాయి ఆమెకు. చివరికి రాష్ట్రపతి అవార్డు కూడా వరించింది. భవిష్యత్తులో మరిన్ని భవనాలు నిర్మించి, మరింతమంది పిల్లల్ని చేరదీయాలని ఆమె ఆలోచన. సింధు సొంత కూతురు కూడా ఓ అనాథ శరణాలయాన్ని నిర్వహిస్తుండటం విశేషం. అనాథల అమ్మగా పేరొందిన సింధు జీవితంపై మరాఠీలో ‘మీ సింధుతాయి సప్కాల్’ పేరుతో ఓ సినిమా కూడా తీశారు. దానికి జాతీయ అవార్డు  వచ్చింది. ఇంతమంది అనాథల్ని ఆదుకునే శక్తిని తనకు ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెబుతుంది సింధు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top