టీవీ సీరియవళ్ళకి వీళ్ళే పెద్ద దిక్కు

టీవీ సీరియవళ్ళకి వీళ్ళే పెద్ద దిక్కు


టీవీక్షణం

 

కుటుంబంలో అందరి కంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్లు అన్ని బాధ్యతలూ నెత్తిన వేసుకుంటారు. అన్నీ చక్కబెడతారు. అయితే ఇది ఓ పరిమితి వరకూ మాత్రమే ఉంటుంది. కానీ సీరియళ్లలో ఇంటి పెద్దల్ని ఎప్పుడైనా గమనించారా? వాళ్లు చెప్పిందే వేదం, పాటించేదే సంప్రదాయం అన్నట్టుగా ఉంటుంది. అలాంటి ఇంటిపెద్దలు ప్రతీ సీరియల్లోనూ కనిపిస్తున్నారు.



తల్లో, తండ్రో, బామ్మో... ఎవరైతేనేమి, కుటుంబంలో ఓ పెద్ద! నిలువెల్లా హుందాతనం ఉట్టిపడుతుంది.  మాట్లాడితే వారి స్వరం చెవుల్లో ఖంగుమంటుంది. చూపుల్లో తీక్షణత భయపెడుతుంది. కాస్త కన్నెర్రజేస్తే అవతలివారికి నిలువెల్లా వణుకు పుడుతుంది. అలాంటి ఇంటి పెద్దలను పోటీపడి సృష్టిస్తున్నారు దర్శకులు. హిందీలో... ‘న ఇస్ దేశ్ లాడో’లో అమ్మాజీ, ‘బాలికావధు’లో కళ్యాణీదేవి, ‘సాథ్ నిభానా సాథియా’లో కోకిల, ‘సంస్కార్’ లో అన్షుబా, ‘ససురాల్ సిమర్‌కా’లో మాతాజీ, ‘దియా ఔర్ బాతీ హమ్’లో సంతోష్ రాఠీ, ‘కైరీ’లో ఇమర్తీదేవి, ‘ఉతరన్’లో ఠాకూర్, ‘ముక్తిబంధన్’లో ఐ.ఎం.విరానీ ఇంటి పెద్దగా హల్‌చల్ చేశారు.

 

సీరియల్‌లో ఇంటి పెద్ద అంటే మంచివాళ్లే కానక్కర్లేదు. కొందరు విలన్స్... కొందరు శాంతమూర్తులు. వాళ్లు ఎలాంటి వాళ్లయినా సరే... ఆ ఇంట్లోని పాత్రలన్నీ వారి కనుసన్నల్లో మెలుగుతాయి. ఊరు ఊరంతా భయంతోనో, గౌరవంతోనో వారికి దణ్నాలు పెడుతుంటుంది. వారు చిటికె వేసినా, కనుసైగ చేసినా పనులు అయిపోతుంటాయి. వారిని అనుసరించే సీరియల్‌లోని మిగతా పాత్రలన్నీ సాగుతుంటాయి. తెలుగులో కూడా ఈ మధ్య ఇలాంటి పాత్రలు బాగానే వస్తున్నాయి.

 

‘మంగమ్మగారి మనవరాలు’లో శివ పార్వతి పాత్ర ఈ కోవలోకే వస్తుంది. ‘అపరంజి’లో నాగబాబు పాత్ర అలాంటిదే. కాకపోతే హిందీలో మాదిరిగా కడవరకూ ప్రాధాన్యత లేదా పాత్రకి. మధ్యలో డల్ అయిపోయింది. ‘గోరంతదీపం’లో జయలలిత పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ‘మొగలిరేకులు’లో శృతి పాత్ర కూడా దాదాపు అలాంటిదే. కానీ దుష్టపాత్ర కావడంతో రాను రాను మిగతా పాత్రలు తమ ప్రాధాన్యతను పెంచుకుంటూ పోయాయి.

 

అయితే నిజానికి ఈ ‘పెద్ద’ పాత్రలకు హిందీలో ఉన్నంత ప్రాధాన్యత తెలుగులో లేదనే చెప్పాలి. మనకి అవసరాన్ని బట్టి ఆ పాత్ర ఉంటోంది. కానీ వాళ్లకు ఆ పాత్ర చుట్టూనే కథ తిరుగుతోంది. ఇదంతా ‘బాలికావధు’లో దాదీసా పాత్రను చూసిన తర్వాత మరీ ఎక్కువయ్యిందంటారు కొందరు. ఆ పాత్రకి కళ్యాణీదేవి ప్రాణప్రతిష్ట చేయడంతో అద్భుతంగా పండింది. ఇక ప్రతి దర్శకుడూ అలాంటి ఓ పాత్రని సృష్టించేస్తున్నాడు. ప్రముఖ నటీనటుల్ని పెట్టడం కూడా ప్లస్ అవుతోంది!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top