ఆదర్శవంతులు

ఆదర్శవంతులు - Sakshi


పంచామృతం



స్మోకింగ్‌ను సరదాగా మొదలు పెట్టి, హాబీగా మార్చుకుని, అనంతరం దాన్నొక మానలేని అలవాటుగా చేసుకున్న వాళ్లెంతోమంది. ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా సిగరెట్ స్మోకింగ్‌కు అతీతులు కాదు. అయితే తనను తాను చంపుకుంటూ, ఎదుటి వాడిని చంపడానికి మనిషి కనిపెట్టుకున్న ఆయుధం సిగరెట్... అనే విషయాన్ని గ్రహించి దాన్ని దూరంగా నెట్టిన వాళ్లూ ఉన్నారు. సిగరెట్ అలవాటును మానుకున్నందుకు గానూ వీళ్లను ఆదర్శవంతులని చెప్పవచ్చు. మానాలని అనుకొంటున్న వారికి స్ఫూర్తిదాతలుగానూ పరిచయం చేయవచ్చు!

 

ఆమిర్‌ఖాన్

మిస్టర్ పర్ఫెక్షనిస్టుగా పేరు పొందిన ఆమిర్‌కు సిగరెట్.. మానుకోలేని అలవాటుగానే ఉండిందట. తొలి భార్య సంతానం అయిన జునైద్, ఇరాలు తండ్రి చేత ఈ అలవాటును మాన్పించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆ విషయంలో తను అశక్తుడినని ఆయన చెప్పేవాడట. అయితే సరోగసి పద్ధతిలో పిల్లాడు పుట్టిన ఆనందం ఆమిర్ చేత సిగరెట్ మాన్పించిందట. ఎలా మానగలిగావు? అంటే మాత్రం... దానిపై ఒక గ్రంథమే రాయొచ్చని అంటాడు ఖాన్.

 

సల్మాన్ ఖాన్

చాలా సంవత్సరాల పాటు ఆ అలవాటును మానాలనే ఆలోచనే లేదట సల్లూభాయ్‌కి. అయితే మూడేళ్ల కిందట ఒకసారి సల్మాన్ హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. నరాల సంబంధిత సమస్యతో తీవ్రమైన ఇబ్బందుల పాలయ్యాడు. అప్పటికి గానీ జ్ఞానోదయం కాలేదు. అప్పటి నుంచి మళ్లీ సిగరెట్ ముట్టింది, ముట్టించిందీ లేదు!

 

హృతిక్ రోషన్

ఈయన ఒకసారి కాదు, గతంలోనే ఐదు సార్లు మానేశాడట! చివరిసారి మాత్రం అలెన్ కార్ రచించిన ఒక మోటివేషనల్ పుస్తకాన్ని చదివి సిగరెట్‌కు శాశ్వతంగా సెలవిచ్చాడట. అందులో సిగరెట్ స్మోకింగ్‌ను వదిలించుకోవడానికి సులభమైన మార్గాలు చదివి వాటిని అమల్లో పెట్టానని హృతిక్ చెబుతాడు.

 

బరాక్ ఒబామా

ప్రస్తుత అమెరికన్ ప్రెసిడెంట్‌కు టీనేజ్‌నుంచే సిగరెట్ అలవాటు ఉందట. అయితే అమెరికా అధ్యక్షుడవ్వడానికి ఎన్నికలను ఎదుర్కొంటున్న సమయంలో తీవ్రమైన ఒత్తిడికి సిగరెట్ తోడయితే మరింత ఇబ్బంది కలిగేదట. దాంతో అప్పుడు స్మోకింగ్‌కు స్వస్తి చెప్పేశాడట.  2009లో అధ్యక్షుడి హోదాలో సగర్వంగా ‘యాంటీ స్మోకింగ్ బిల్లు’ ను ప్రవేశ పెట్టగలిగానని ఆయన అంటాడు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top