సాయమడగండి... తప్పు లేదు!

సాయమడగండి... తప్పు లేదు!


వాయనం:

‘ఓ పక్క ఆఫీసులో చాకిరీ చేసి రావాలి... ఇంట్లో పనీ నేనే చేయాలి, నాకు మాత్రం విశ్రాంతి అవసరం లేదా?’... చాలామంది వర్కింగ్ ఉమన్ తరచుగా అనే మాట ఇది. భర్తతో సమానంగా భార్య సంపాదిస్తున్నా, భార్యతో సమానంగా భర్త ఇంటి పని చేయడం ఎక్కడో కానీ కనిపించదు. దానికి కారణాలు రెండు. ఇంటి పని చేయడం ఆడవాళ్ల బాధ్యత అని మగవాళ్లు అనుకోవడం, రెండోది... తనకు సాయం అవసరం అన్న విషయాన్ని భార్యలు భర్తలకు అర్థమయ్యేలా చెప్పలేకపోవడం.

 

చాలామంది భార్యలు రెండు బాధ్యతలనూ నిర్వర్తించలేక అవస్తపడుతుంటారు. తమలో తామే కుమిలిపోతుంటారు తప్ప తమ అవస్థను భర్తకు అర్థమయ్యేలా చెప్పరు. దాని వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా? పైగా కొందరైతే... ఏం చేస్తాం, వాళ్లకు తప్పినా మనకు తప్పదు కదా అంటుంటారు. అదీ సరికాదు. ఇంటిని నిలబెట్టుకోవడం కోసం మీకు ఉద్యోగం చేయడం తప్పడం లేదు. అలాంటప్పుడు ఇంటి పనులు చేయడం అతడికి మాత్రం ఎందుకు తప్పుతుంది?

 

ఈ సమస్యను తీర్చుకోవడం కచ్చితంగా ఇల్లాలి చేతిలోనే ఉంది. మీరు మౌనంగా చేసుకుంటూ పోతే, చేయగలుగుతోంది కదా అనుకుంటారు. అందుకే మీరెంత కష్టపడుతున్నారో, ఎంతగా అలసిపోతున్నారో వారికి వివరించండి. కాస్త పనిని పంచుకోమని అడగండి. మరీ వంటిల్లు శుభ్రం చేయడం, వంట చేయడం లాంటివి చేయలేకపోయినా... బట్టలు వాషింగ్ మెషీన్లో వేయడం, తీసి ఆరబెట్టడం, ఆరినవి మడత పెట్టడం, పక్కలు సర్దడం, పిల్లలను స్కూలుకు రెడీ చేయడం వంటివి వారు చేయగలరు కదా! అలాంటివి వారిని చేయమనండి.

 

అది మానేసి వారంతట వారే వచ్చి మీకు సాయం చేసేయాలని మాత్రం చూడకండి. కొందరు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. కొందరు చెబితేగానీ గ్రహించరు. మీ భర్త మొదటి కోవకు చెందినవారైతే సమస్య లేదు. ఒకవేళ రెండో కోవకు చెందినవారైతే మాత్రం మీరు వారితో మాట్లాడి తీరాల్సిందే. అర్థమయ్యేలా చెప్పాల్సిందే. సంపాదించే బాధ్యతను ఎలా పంచుకున్నామో, ఇంటిని తీర్చిదిద్దుకునే బాధ్యతను కూడా అలానే పంచుకుందాం అని చెబితే మీవారు తప్పక అర్థం చేసుకుంటారు. అడగందే అమ్మయినా పెట్టదంటారు. ఆయన మాత్రం ఎలా చేసేస్తారు? కాబట్టి ధైర్యంగా మీవారిని సాయమడగండి... తప్పు లేదు!

 

హాట్‌డాగ్స్... హాట్ హాట్‌గా!

హాట్‌డాగ్... పాశ్చాత్య దేశాల్లో పుట్టి మన దేశ బేకరీల్లో తిష్ట వేసుక్కూచున్న స్నాక్ ఇది. పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో వారికి కూడా దీని రుచి పరిచయమై చాలా కాలమైంది. అయితే వీటిని ఇంట్లో తయారు చేయడం పెద్ద పని. ఒకవేళ బయటి నుంచి తీసుకొద్దామన్నా ఇంటికొచ్చేసరికి చల్లారిపోతాయి. వాటిని వేడి చేయాలంటే మైక్రో అవన్ ఉండాలి. అది కొనాలంటే బోలెడు డబ్బులుండాలి. కానీ అంత పెట్టక్కర్లేకుండా పనైపోయే మార్గం ఒకటుంది!

 

ఈ ఫొటోలో కనిపిస్తున్న యంత్రాన్ని హాట్‌డాగ్ టోస్టర్ అంటారు. చల్లారిపోయిన హాట్‌డాగ్స్‌ను చిటికెలో వేడి చేసేస్తుందిది. ఇది ఇంట్లో ఉంటే చక్కగా బన్స్, ఫిల్లింగ్స్‌ని తెచ్చి ఫ్రిజ్‌లో దాచి పెట్టుకోవచ్చు. పిల్లలు బడి నుంచి వచ్చాక, మీరు-మీవారు ఆఫీసుల నుంచి వచ్చాక అప్పటికప్పుడు వీటిని టోస్టర్‌లో పెట్టేస్తే... పది,పదిహేను నిమిషాల్లో వేగిపోతాయి. వేడి వేడిగా ఆరగించవచ్చు. పిక్నిక్స్‌కి వెళ్లినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని వెల రెండు వేల వరకూ ఉన్నా ఆన్‌లైన్ స్టోర్స్‌లో రూ.1775కే లభిస్తోంది!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top