టీవీక్షణం: కుక్కలు చూసేందుకు ఓ చానెల్!

టీవీక్షణం : కుక్కలు చూసేందుకు  ఓ చానెల్! - Sakshi


 వంటల చానెళ్లు, ఆటల చానెళ్లు, సినిమాల చానెళ్లు అంటూ చాలా రకాలు ఉన్నాయి. ఎవరికి నచ్చినవి వాళ్లు చూస్తుంటారు. అలాగే జంతువుల చానెళ్లు కూడా ఉన్నాయి. మూగజీవాలంటే ఇష్టం ఉన్నవాళ్లు వాటిని చూస్తారు. అయితే జంతువులు మాత్రమే చూసే చానెల్ ఏదైనా ఉందా? జంతువులు టీవీ చూడ్డమేంటి, పైగా వాటికో చానెల్ కూడానా అని ఆశ్చర్యపోకండి. ఇప్పుడు అలాంటివి కూడా రాబోతున్నాయి!

 

 డెరైక్ట్ టీవీ అనే అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ఓ కొత్త చానెల్‌కు రూపకల్పన చేసింది. అయితే అది మనుషులు చూడ్డానికి కాదు... శునకాలు వీక్షించడానికి! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కుక్కలు ఇంటికి కాపలా కాస్తాయి. యజమాని ఉన్నా లేకపోయినా ఇంటిని అంటిపెట్టుకునే ఉంటాయి. ఇంట్లో వాళ్లంతా బయటకు వెళ్లిపోతే, ఇంట్లోనే కాలం గడుపుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటికి బోర్ కొడితే? ఈ ఆలోచన ఇప్పటి వరకూ ఎవరికీ వచ్చి ఉండదు. కానీ డెరైక్ట్ టీవీ వాళ్లకు వచ్చింది. అందుకే కుక్కల కోసం వాళ్లు ఏకంగా ఓ చానెల్‌నే తెచ్చేస్తున్నారు.

 

 ఓ కుక్కల చానెల్‌ని తీసుకు రాబోతున్నాం అని ప్రకటించినప్పుడు, కుక్కలకు సంబంధించిన విషయాలను చెప్పేందుకు ఈ చానెల్‌ను తెస్తున్నారేమో అనుకున్నారట జనం. కానీ కుక్కల గురించి మనుషులకు చెప్పడానికి కాదు, కుక్కలు చూసి ఎంజాయ్ చేయడానికే ఆ చానెల్‌ని తెస్తున్నాం అని చెప్పేసరికి అందరూ అవాక్కయ్యారు. కుక్కల కోసం మంచి సంగీతం, యానిమేషన్ చిత్రాలు, వాటికి నచ్చే ఆహార పదార్థాల విషయాలు వంటి వాటిని ప్రసారం చేస్తారట ఇందులో. మొదట అమెరికాలో ట్రై చేసి, అక్కడ కనుక సక్సెస్ అయితే ఇతర దేశాలకు కూడా ప్రసారాలను విస్తరిస్తాం అని చెబుతున్నారు. మనుషుల కోసం ఇన్ని చానెళ్లు ఉన్నప్పుడు కుక్కలకూ ఒకటి ఉంటే ఏం పోయింది చెప్పండి. పాపం వాటిని కూడా ఎంజాయ్ చేయనివ్వాలి కదా!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top