అంతరిక్షం వాణిజ్య గవాక్షం

అంతరిక్షం వాణిజ్య గవాక్షం


యూరి గెగరిన్ రెక్కలు తొడుక్కుని అంతరిక్షం అంచుల్ని తాకింది ఈ రోజే. అంటే అంతరిక్షంలోకి మనిషి వెళ్లి నేటితో కచ్చితంగా 54 ఏళ్లు! ఈ కాలమంతా ఒక ఎత్తు... రానున్నది మరో ఎత్తు! యుగాలుగా ఊరిస్తూ, ఉడికిస్తూ, నడిపిస్తూ వస్తున్న చుక్కల్ని, గ్రహాలను అబ్బురంగా చూస్తూనే... అందిపుచ్చుకోవాలని, వాటి ఆనుపానూ తెలుసుకోవాలని తపనపడ్డ మానవుడు రూటు మార్చాడు! సిరిమంతుల విలాస ప్రయాణానికి  మాత్రమే కాదు... అంతరిక్షాన్ని... రేపటి గూడుగా. కల్పవక్షంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు!

 

 నిన్నమొన్నటివరకూ అంతరిక్ష ప్రయోగమంటే... దేశాల స్థాయిలో జరిగే శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే. మరి నేడు... కొంచెం ఆసక్తితోపాటు... బోలెడంత డబ్బున్న ఎవరైనా కంపెనీ పెట్టేసి మనుషుల్ని సొంతంగా అంతరిక్షంలోకి పంపేయవచ్చు. లేదా... వేల కోట్లతో నాసా వంటి సంస్థలు జరుపుతున్న ప్రయోగాల్లో పాలుపంచుకోవచ్చు. బ్రిటన్‌కు చెందిన వర్జిన్ అట్లాంటిక్ స్పేస్ ట్రావెల్ ద్వారా అంతరిక్షాన్ని వాణిజ్యానికి వాడుకునే ప్రయత్నం చేస్తూంటే... మాడ్రన్ ఐరన్ మ్యాన్‌గా కీర్తి గడించిన టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు, ఎలన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ పేరుతో రాకెట్లు తయారు చేస్తూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకు రవాణా చేస్తున్నాడు. అంతరిక్షం నుంచి డబ్బులు రాబట్టుకునేందుకు ముందుకురుకుతున్న కంపెనీల్లో ఇవి మచ్చుకు రెండు మాత్రమే. మారుతున్న పరిస్థితులు.. అవసరాలు సాంకేతిక పరిజ్ఞానాలు అన్నీ కలిసి అంతరిక్షాన్ని... వ్యాపారానికి గవాక్షంగా మార్చేస్తున్నాయి!

 

చిన్నింటి వేట...

జనాభా ఏటికేడాదీ పెరిగిపోతోంది. ఉన్న వనరులేమో తక్కువ. పరిస్థితి మరింత దిగజారే ప్రమాదమూ లేకపోలేదు. మరి తరుణోపాయం... పొరుగున ఉన్న చందమామనో... కొంచెం దూరంగా ఉన్న అంగారకుడినో చిన్నిల్లుగా మార్చేసుకోవడమే అన్నది చాలాకాలంగా వినిపిస్తున్న మాట. ఇప్పుడు త్రీడీ ప్రింటింగ్‌తో పాటు అనేక కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో అమెరికా ముందుగా అనుకున్నట్లే 2020 నాటికి చందమామపై స్థావరం ఏర్పాటు చేయడం, ఆ తరువాత మానవులతో కూడిన నివాస సముదాయాన్ని ఏర్పాటు చేయడం పక్కా అనుకోవచ్చు. ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్... చంద్రుడిపైకి పంపే రోవర్ ఎలా ఉండాలి? అన్న అంశంపై ఓ పోటీ పెట్టడం ప్రై వేట్ కంపెనీలు అంతరిక్ష రంగంపై చూపుతున్న ఆసక్తికి మచ్చుతునక.

 

 ఖనిజాల మూటలు...

 గ్రహశకలాలు, తోకచుక్కల వల్ల ఎదురయ్యే సమస్యనే ఓ మంచి అవకాశంగా మార్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు మనిషి తెలివికి నిదర్శనం. మనిషి జీవించడానికి అతిముఖ్యమైన నీటితోపాటు.. ఎలక్ట్రానిక్స్, విద్యుత్ తయారీ రంగాల్లో కీలకపాత్ర పోషించగల ప్లాటినమ్ వంటి ఖనిజాలను గ్రహశకలాల నుంచి కొల్లగొట్టేందుకు ప్లానెటరీ రిసోర్సస్ పేరుతో ఇటీవలే ఓ కంపెనీ ఏర్పాటైంది.

గ్రహశకలాల్లోని నీటి ద్వారా భవిష్యత్తులో అంగారకుడు లేదా అంతకంటే దూరమైన గ్రహాలను కూడా అందుకునేందుకు అవసరమైన ఇంధనాన్ని అంతరిక్షంలోనే తయారు చేసుకోవచ్చునని, వ్యోమగాములకు అవసరమైన నీరు, గాలిని కూడా అక్కడికక్కడే తయారు చేసుకుంటే అనేక ప్రయోజనాలుంటాయని ఈ కంపెనీ అంటోంది. అంతరిక్షంలో సువిశాలమైన సౌరశక్తి ఫలకాలను ఏర్పాటు చేసుకుని... మైక్రోవేవ్ తరంగాల ద్వారా భూమ్మీదకు విద్యుత్తు ప్రసారం చేసుకుని వాడుకోవాలన్న జపాన్ ఆశ, ఆశయం ఇప్పుడు పాతవార్తే!

 

 బీజమేసిన ఒబామా...

 అంతరిక్షాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడం ఐదేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన ప్రకటనతో మొదలైంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించేందుకు నాసాకు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు ఒబామా చేసిన ప్రకటనతో అమెరికాలో సరికొత్త అంతరిక్ష విప్లవం మొదలైంది. బోయింగ్‌తోపాటు స్పేస్ ఎక్స్ ఈ మొత్తంలో సింహభాగాన్ని అందుకున్నాయి. 2017 నాటికల్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అమెరికా వ్యోమగాములను చేర్చే లక్ష్యంతో ఈ రెండు కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఆర్బిటల్ సైన్స్, మూన్ ఎక్స్‌ప్రెస్ వంటి కంపెనీలు జాబిల్లి పైకి సరుకు రవాణా చేసే ప్రయత్నాల్లో ఉంటే.. ఇంకొన్ని కంపెనీలు గ్రహశకలాల మైనింగ్ వరకూ అనేక అంతరిక్ష వాణిజ్య కలాపాలను చేపడుతున్నాయి.

 

 పోటీలతో మరుగైన టెక్నాలజీలు

 పీటర్ డెమండిస్ అనే బిలియనీర్ స్థాపించిన ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్ అంతరిక్ష ప్రయోగాలను వాణిజ్య స్థాయికి చేర్చడంలో కీలకపాత్ర పోషించింది. భారీ నగదు బహుమతితో పోటీలు పెట్టడం.. తద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో ఎదురవుతున్న సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయడం ఈ కంపెనీ లక్ష్యాలు. స్పేస్ ట్రావెల్‌ను సులభతరం చేసే లక్ష్యంతో కొత్త విమానం తయారీకి పెట్టిన పోటీలో కంపెనీలు, ఔత్సాహికులు కూడా పాల్గొన్నారు. ఈ పోటీలో నెగ్గిన విమానం డిజైన్‌ను ప్రైవేట్ కంపెనీ  వాడుకుంటూండటం విశేషం. ఎక్స్ ప్రైజ్ పోటీలు అంతరిక్ష రంగంతో మొదలైనప్పటికీ ప్రస్తుతం వాటితోపాటు విద్యుత్తు, రవాణా, పర్యావరణం వంటి అనేక రంగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. గూగుల్, నార్తరప్ గ్రమ్మన్ వంటి ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో చంద్రుడిపై రోవర్ నిర్మాణం వంటి పోటీలు ఇక్కడే జరుగుతున్నాయి.  

 

 546...

ఇప్పటివరకూ అంతరిక్షంలోకి వెళ్లిన మానవుల సంఖ్య

 

 437.749. రోజులు...

 రికార్డు స్థాయిలో వాలలీ పోల్యకోవ్ అనే వ్యోమగామి ఖగోళంలో గడిపిన కాలం.

 

 రూ. 3000000-10000000

 నాసా వెబ్‌సైట్ ప్రకారం ఓ వ్యోమగామి వార్షిక ఆదాయమిది!

 

 రూ.12000000...

 అంతరిక్షంలో కొద్ది సమయం గడిపేందుకు వర్జిన్ గలాటిక్ సర్వీసెస్ వసూలు చేస్తున్న మొత్తం! ప్రభుత్వాలే అంతరిక్ష ప్రయోగాలు చేపట్టాలన్న భావనకు కాలం చెల్లిపోతోంది. యూవింగో వంటి సంస్థలు క్రౌడ్‌ఫండింగ్ (ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించడం) ద్వారా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

 

 గ్రహశకలాల్లో డబ్బే డబ్బు...!

 ప్లాటినమ్‌తో నిండినవి...

 భూమ్మీద ఇప్పటివరకూ తవ్వి తీసిన ప్లాటినమ్ కంటే ఎక్కువ మోతాదులో ప్లాటినమ్ గ్రూప్ ఖనిజాలుంటాయి. యుగాలకు సరిపడా వనరులు అపారమైన  ఖనిజ వనరులకు నెలవులు

 పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేందుకు ఇప్పటివరకూ అనేక ప్రయత్నాలు చేశాం.. చేస్తున్నాం కూడా. తాజాగా మనిషి కన్ను అంతరిక్షంపై పడింది. నీటితోపాటు, అనేక ఖనిజాలు పుష్కలంగా ఉన్న గ్రహశకలాలను కొల్లగొట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.

 ప్లానటరీ రిసోర్సెస్ వంటి కంపెనీల అంచనాల ప్రకారం... భూమి చుట్టూ

 ఎడాపెడా తిరుగుతున్న గ్రహశకలాలను సద్వినియోగం చేసుకోగలిగితే... అనంత ఐశ్వర్యాన్ని కళ్లజూడవచ్చు.

 ప్లాటినమ్ గ్రూప్ ఖనిజాల ఉపయోగాలివి...

 ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు గణనీయంగా తగ్గుతాయి.

 పెట్రోలు, డీజిళ్ల అవసరం లేకుండా విద్యుత్ వాహనాలు వాడుకోవచ్చు.  పర్యావరణానికి మేలు చేయవచ్చు.

 

 500 మీటర్ల ప్లాటినమ్ గ్రహశకలంలో...

 2.9 లక్షల కోట్ల డాలర్ల విలువైన ప్లాటినమ్ గ్రూప్ ఖనిజాలు ఇవి భూమ్మీద ఏటా వెలికితీస్తున్న

 ప్లాటినమ్‌కు 174 రెట్లు.. ఔన్సు ప్లాటినమ్ ధర... 1500 డాలర్లు

 (రూ.75,000)

 

 జలసిరి గ్రహశకలాలు...

 ఒక్కో గ్రహశకలంలోని నీటితో ఇప్పటివరకూ ప్రయోగించిన అన్ని రాకెట్లకు కావల్సిన ఇంధనాన్ని తయారు చేసుకోవచ్చు.

 

 500 మీటర్ల సైజున్న జల గ్రహశకలం ద్వారా... లక్ష కోట్ల డాలర్ల విలువైన నీరు పొందవచ్చు.

 ప్రస్తుతం లీటర్ నీటిని అంతరిక్షంలోకి పంపేందుకు 20 వేల డాలర్లు ఖర్చు అవుతోంది.

 

 విశ్వంలో నీటితో ఉపయోగాలు

 సుదూర అంతరిక్ష ప్రయాణాలకు అవసరమైన ఇంధనం తయారు చేసుకోవచ్చు.

 వ్యోమగాములు పీల్చేందుకు గాలి...

 తాగేందుకు నీటిని సమకూర్చుకోవచ్చు.

 

మన అవసరాల కోసం అంతరిక్షాన్ని వాడుకునే విషయంలో గ్రహశకలాల మైనింగ్ కొత్త అధ్యాయాన్ని సృష్టించనుంది. భూమ్మీద, అంతరిక్షంలోనూ మనిషి మరింత ఎదిగేందుకు అవసరమైన  ప్లాటినమ్ ఖనిజం, నీరు వంటి వనరులను అందించనుంది.

 

 వేలకు వేలు...

 1500: జాబిల్లికంటే దగ్గరగా ఉన్నవి

 8800: ఇప్పటివరకూ గుర్తించినవి.

 1000:  ఏటా గుర్తిస్తున్న కొత్త గ్రహశకలాలు.

 - గిళియార్ గోపాలకృష్ణ మయ్యా

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top