దేవతల ఊరు!

దేవతల ఊరు!


 జకూబాయి మీద అభిమానంతో ఆమెనే దేవతగా చేసుకున్నారు గ్రామస్తులు. ఆమెని తప్ప మరెవరినీ పూజించకూడదని నిర్ణయించుకున్నారు. మగ దేవతలకు గ్రామంలో చోటు కల్పించకూడదని అనుకున్నారు.

 

 పట్టణీకరణ పెరిగి గ్రామాలు మాయమై పోతున్నాయి. వాటి జ్ఞాపకాలూ మాయమై పోతున్నాయి. వాటి విలువను తెలుసుకునే టైమ్ కూడా మాయమైపోతుంది. నువ్వు ఎంత పెద్ద మహానగరంలో పుట్టినా పల్లె ఆత్మను చూడలేకపోతే మాత్రం వృథానే అన్నాడో మహానుభావుడు. ఆ మాట ఎంత నిజమో పురుష్‌వాడి గ్రామాన్ని చూస్తే అర్థమవుతుంది.



 మహారాష్ట్రలో ఉన్న ఈ గిరిజన గ్రామం అన్ని గ్రామాల్లానే కనిపిస్తుంది. కానీ వేరే గ్రామాల్లో లేని ఓ విచిత్రమైన ఆచారం ఇక్కడుంది. పురుష్‌వాడి గ్రామంలో ఎవరూ మగ దేవతలను పూజించరు. కేవలం ఆడ దేవతలకే పూజాదికాలు. జకూబాయి వారి ప్రధాన దేవత.

 

 నిజానికి చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ దేవతని పూజిస్తాయి. కానీ ఇతర దేవుళ్లనీ పూజిస్తాయి. కానీ పురుష్ వాడి అలా కాదు. ఇక్కడ అసలు మగ దేవుళ్ల పేర్లేవీ వినిపించవు. ఓసారి గతంలో మగ దేవుళ్ల విగ్రహాలను ఊళ్లో ప్రతిష్ఠించాలని కొందరు ప్రయత్నిస్తే గ్రామస్తులంతా వ్యతిరేకించారు. ఇంకోసారి అలాంటి ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు కూడా!



 అసలు ఇక్కడ ఈ ఆచారం ఎలా వచ్చింది! దేవతలను మాత్రమే కొలిచే ఈ ఊరికి ‘పురుష్‌వాడి’ అనే పేరు ఎలా వచ్చింది! ఈ రెండూ చాలామందికి వచ్చే సందేహాలు. అయితే దీనికి ఒక వివరణ ఉంది. ఆ ఊరి అసలు పేరు ‘పుర్- వుంచ్-వాడీ’ అట. దీని అర్థం ‘కొండల మీద ఉన్న గ్రామం’ అని. అది రాను రాను పురుష్‌వాడి అయింది. అంతేతప్ప పురుష అన్న పదానికి మగ అన్న అర్థం లేదు.

 

 ఇక ఇక్కడ దేవతలనే ఎందుకు కొలుస్తారు అన్నదానికి కూడా ఓ కథ ఉంది. గతంలో జకూబాయి అన్న ఓ మహిళ పురుష్‌వాడిలో నివసించేది. అప్పటికి మాతృస్వామిక వ్యవస్థ మనుగడలో ఉండటంతో ఊరికి ఆమే పెద్దగా ఉండేది. ఊరిని, ఊరి జనాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేది. ఏ కష్టం వచ్చినా క్షణాల్లో పరిష్కరించేది. అందరికీ అండగా ఉండేది. ఆమె అంటే అందరూ ప్రాణం పెట్టేవారు. దేవతలా కొలిచేవారు. వయసు ఉడిగిన తర్వాత... మరణానికి చేరువవుతున్న సమయంలో ఆమె ఊరి జనాన్ని ఓ కోరిక కోరింది. ఈ ఊళ్లో ఎప్పటికీ మహిళలే మహారాణుల్లా ఉండాలి, వారిదే ఆధిపత్యం కావాలి అని. అలాగే చూస్తామని ఊరివారంతా ఆమెకు మాట ఇచ్చారు. ఆ మాట మీదే నిలబడ్డారు.



 జకూబాయి మీద అభిమానంతో ఆమెనే దేవతగా చేసుకున్నారు గ్రామస్తులు. ఆమెని తప్ప మరెవరినీ పూజించకూడదని నిర్ణయించుకున్నారు.

 

 ఆడవారిదే ఆధిపత్యం ఉండాలి కాబట్టి మగ దేవతలకు కూడా గ్రామంలో చోటు కల్పించకూడదని అనుకున్నారు. నేటికీ ఆ సిద్ధాంతాన్నే అనుసరిస్తున్నారు. ఇదీ పురుష్‌వాడి గురించి ప్రచారంలో ఉన్న కథ. ఈ గ్రామానికి సంబంధించి మరో ప్రత్యేకత పరిశుభ్రత, పచ్చదనం. ఏ వీధి చూసినా, ఏ ఇల్లు చూసినా పరిశుభ్రంగా కనిపిస్తుంది.



 ప్రస్తుతం పురుష్‌వాడి ఓ టూరిస్టు ప్రాంతం. ‘గ్రాస్‌రూట్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఊరిని దత్తత తీసుకొని ‘విలేజ్ టూరిజం’ను ప్రమోట్ చేస్తోంది. వేలాది మంది టూరిస్టుల్ని ఆకర్షిస్తోంది. పట్టణాల్లో పుట్టి పట్టణాల్లోనే పెరిగిన పట్నపుబాబులు మాత్రమే కాదు, అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఊళ్లో గడిపి పట్నానికి పరిమితమైన మాజీ పల్లెవాసులు కూడా, తమ జ్ఞాపకాల జాడను ఈ ఊళ్లో వెదుక్కోవడానికి వస్తున్నారు. కొందరు తమ పిల్లలను ఇక్కడికి తీసుకువచ్చి గ్రామజీవితం గురించి అవగాహన చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలపై అకృత్యాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో మహిళను దేవతగా ప్రతిష్టించి కొలుస్తోన్న ఈ ఊరికి హ్యాట్సాఫ్ చెప్తున్నారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top