ఓ ప్రియురాలి సంఘర్షణ

ఓ ప్రియురాలి సంఘర్షణ


ఆమె కంటికి చూపులేదు.

 అతడే చూపవుతాడనుకుంది.

 కానీ చివరికేం జరిగింది???


 

 ‘తేరీ ఇష్క్‌మే మేరీ జాన్ ఫనా హోజాయే’... నీ ప్రేమలో నా జీవితం నశించిపోవాలి.ప్రేమలో నెగిటివ్ నోట్ ఎప్పుడూ సక్సెస్‌ఫుల్ ఫార్ములానే బాక్సాఫీసు దగ్గర. ఆ నెగిటివ్ నోటే ఎన్నో చిత్రాల మాదిరి ‘ఫనా’ చిత్రానికి కూడా పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది. నిజానికి ఈ చిత్ర టైటిలే నెగిటివ్ టైటిల్. ఫనా అంటే... వినాశనం!హీరోయిన్‌ని కలసిన మొదటి సన్నివేశంలోనే.. ‘‘మిమ్మల్ని అందరూ చూసి చూసి దిష్టి తగలకూడదని దేవుడు మీకు చూపు లేకుండా చేశాడు’’ అంటాడు హీరో. అయితే దీన్ని నెగటివ్ డైలాగ్  అనుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఇలాంటి నెగిటివ్ మాటలని కవితలుగా, అందమైన షాయరీలుగా వర్ణిస్తాడు హీరో.

 

 ‘‘నీ స్నేహం కోసం ప్రాణాలిస్తాను, నీ స్నేహం కోసం శతృవునైనా ప్రేమిస్తాను’’... ఇలాంటి ఫ్లర్టింగ్‌కి ఏ అమ్మాయి మాత్రం పడిపోదు! అందుకే ఆ హీరోయిన్ కూడా పడిపోయింది. ‘చాంద్ సిఫారిష్ జో కర్‌తా హమారీ... దేతా వో తుమ్‌కో బతా/షర్మ్ ఓ హయాపే పర్‌దే గిరాకే... కర్నీహై హమ్‌కో ఖతా/ జిద్‌హై అబ్ తో హై ఖుద్‌కో మిటానా... హోనాహై తుఝ్‌మే ఫనా’... ప్రసూన్ జోషి రాసిన ఈ అందమైన భావజాలాన్ని, జతిన్-లలిత్‌ల అద్భుతమైన ట్యూన్‌లో హీరో పాడుతుంటే, మనసివ్వకుండా ఉండగలుగుతుందా ఆ అమ్మాయి!

 

 ఉండలేదు. అందుకే ‘ఫనా’ చిత్రంలో  హీరోయిన్ జూనీ (కాజోల్)... హీరో రేహాన్ (ఆమిర్‌ఖాన్)కి అతి తేలికగా మనసు ఇచ్చేస్తుంది. నీ ప్రేమలో నన్ను నశించిపోనీ అని అతడు అందంగా అడుగుతుంటే, ఆ చూపులేని అమ్మాయి గుడ్డిగా ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత తీవ్రవాదుల బాంబు దాడిలో అతడు మరణించాడని తెలిసి కుమిలిపోతుంది. కానీ అతడి ప్రతిరూపం తన కడుపులో పెరుగుతోందని తెలిసి, ఆ పసిప్రాణం కోసం జీవిస్తుంది. తర్వాత ఆమెకు చూపు వస్తుంది. కానీ రేహాన్ స్థానాన్ని మరెవ్వరికీ ఇవ్వలేక ఒంటరిగా మిగిలిపోతుంది.

 

 కొన్నాళ్లకు అనుకోకుండా మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడు రేహాన్. భార్యని, బిడ్డని ప్రేమగా అక్కున చేర్చుకుంటాడు. ఇక అంతా ఆనందమే అనుకున్న సమయంలో రేహాన్ తీవ్రవాది అని, ఆ రోజు బాంబుదాడి చేసిందే అతడని తెలుస్తుంది. దాంతో ఆ దేశద్రోహిని చంపేస్తుంది జూనీ... అతడికి తన మీద ఉన్న ప్రేమ నిజమే అని తెలిసినా కూడా!ఒక తీవ్రవాదిని ప్రేమించి, తన జీవితాన్ని నాశనం చేసుకున్న చూపులేని అమ్మాయిగా కాజోల్ నటన అనిర్వచనీయం. మొదట ప్రేమికుడిగా, తర్వాత తీవ్రవాదిగా... తనకు ఏమాత్రం నప్పని పాత్రలో ఆమిర్‌ఖాన్ ఫర్వాలేదనిపించాడు. కొన్ని సినిమాలు రిలీజైనప్పుడు బాగుంటాయి. కానీ కొన్నేళ్ల తర్వాత మళ్లీ చూస్తే... అప్పుడెలా ఆడిందో అనుకుంటాం. ‘ఫనా’ అలాంటి సినిమానే. ప్రథమార్థంలో వచ్చే ప్రేమ సన్నివేశాల కోసం, సంభాషణల కోసం, పాటల కోసం ఈ సినిమా ఓసారి చూడొచ్చు. అయితే అదంతా యశ్‌రాజ్ ఫిల్మ్స్ వల్ల అని కూడా చెప్పొచ్చు.

 

 తెరమీద రొమాన్స్‌ని పండించడంలో సిద్ధహస్తులు యశ్‌చోప్రా, ఆయన పుత్రుడు ఆదిత్యచోప్రా. తండ్రి కింగ్ అయితే కొడుకు ప్రిన్‌‌స. వీరి ప్రేమకథా చిత్రాలు సినిమాలు తీయాలనుకునేవాళ్లకు టెక్స్ట్ బుక్స్. వీళ్ల సినిమాల్లో మాత్రమే ప్రేమ సన్నివేశాల్లో క్లోజప్ షాట్ ఎంతసేపుంటే ప్రేక్షకుడు పాత్ర భావాన్ని తను అనుభవిస్తాడో తూకం వేసినట్టుగా ఉంటుంది. ఆదిత్య నిర్మించిన ‘ఫనా’లో కూడా ప్రేమ, రొమాన్స్ బాగుండటానికి కారణం అదే.

 

 నిజానికి ఈ చిత్ర దర్శకుడు కునాల్ కోహ్లీ అయినా... దర్శకత్వ పోకడ అంతా యశ్‌చోప్రా చిత్రాల శైలిలోను, స్థాయిలోనూ ఉంటుంది. కునాల్ తీసిన ఇతర చిత్రాలు అలా అనిపించవు. దాన్నిబట్టి నిర్మాతల అభిరుచికి, స్థాయికి అనుగుణంగా కునాల్ పని చేశాడని అర్థమవుతుంది ‘ఫనా’ను చూస్తే. ఆమిర్‌ఖాన్... చోప్రా సంస్థలో పని చేయడం ఇదే మొదటిసారి! చెప్పాలంటే... తీవ్రవాదం, దేశభక్తి నేపథ్యంలో తీసిన ప్రేమ చిత్రాలు పెద్దగా ఆడవు. ఒకవేళ ఆడినా కూడా గొప్ప పేరు తెచ్చుకోవు. దానికి ఉదాహరణ ‘దిల్ సే’, ‘1942 ఎ లవ్‌స్టోరీ’ సినిమాలు. అయితే ఫనా కాస్త ఫర్వాలేదు. ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు... పెట్టిన ఖర్చుకి మూడు రెట్లు లాభాలను వసూలు చేసింది. దానికి కారణం కచ్చితంగా బలమైన భావోద్వేగాలు, మనసుల్ని కదిలించే ప్రేమ సన్నివేశాలు అని నేననుకుంటున్నాను.

 

 ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఆమిర్‌ఖాన్... నర్మద డ్యామ్ విషయంలో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి, నేటి ప్రధాని అయిన మోదీని మీడియాలో విమర్శిం చాడు. అది పెద్ద సంచలనం సృష్టించింది. ఆ వివాదం వల్ల బీజేపీ అనుయాయులు, ప్రభుత్వం ‘ఫనా’ గుజరాత్‌లో విడుదల కాకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. దర్శక నిర్మాతలు విన్నవించుకున్నా పట్టించు కోలేదు. ఏ థియేటర్‌లో ఫనా విడుదలైనా, ఆ థియేటర్‌ని ఫనా చేస్తామని బెదిరించారు.

 

 అయినా కూడా వారికి క్షమాపణ చెప్పేందుకు ఆమిర్ నిరాకరించాడు. తను తప్పేం చేయలేదని, ప్రజల తరఫున మాట్లాడే నైతిక హక్కు ఈ దేశ పౌరుడిగా తనకు ఉందని, దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదని చాలా ఘాటుగానే స్పందించాడు. ఈ వివాదాల మధ్య జామ్‌నగర్ అనే ఊళ్లో ఓ థియేటర్ యజమాని తెగించి, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుని మరీ సినిమాని విడుదల చేశాడు. కానీ ఇంటర్వెల్ సమయంలో ప్రవీణ్ జోషి అనే వ్యక్తి టాయిలెట్‌లోకి వెళ్లి, పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఎనభై అయిదు శాతం గాయాలతో ఎనిమిది రోజుల తర్వాత మరణించాడు. దాంతో అక్కడ కూడా ఈ చిత్రం ఆడలేదు. 2001లో గుజరాత్‌లోనే ‘లగాన్’ తీసినందుకు, భూకంప బాధితులకు భారీగా విరాళాలు ఇచ్చినందుకు కూడా ఆమిర్‌ని క్షమించలేదు గుజరాత్ ప్రభుత్వం. సినిమా వాళ్లంటే భారతీయ సమాజంలో ఉన్న వివక్షకి ఇదో పెద్ద ఉదాహరణ. ఎంత సాయం చేసినా, కొంచెం తేడా వస్తే బురద చల్లడానికి వెనుకాడరు. ‘వెలుగుతున్న ప్రతి నక్షత్రం వెనకాల వెలగలేని కొన్ని కోట్ల నయనాల ఈర్ష్య, అసూయలు దాగి ఉంటాయి’.

 

 ఇక మళ్లీ సినిమా విషయానికొస్తే... 2001లో ‘కభీ ఖుషీ కభీ ఘమ్’లో నటించిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయింది కాజోల్. ఐదేళ్ల తర్వాత, 2006లో వచ్చిన ‘ఫనా’తో రీ ఎంట్రీ ఇచ్చింది. డ్రైవింగ్, వంట, నటన ఓసారి బాగా చేయడం వచ్చేస్తే, మళ్లీ జీవితంలో ఎప్పుడు చేసినా పదును తగ్గదు. ఆ విషయం ఎంత వాస్తవమో కాజోల్ నిరూపించింది. అలాగే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌‌సగా టబు, శరత్ సక్సేనాలు కూడా ఆకట్టుకున్నారు.

 

 ఈ చిత్రాన్ని నిజానికి కశ్మీర్‌లో నిర్మిద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ సెక్యూరిటీ కారణాల వల్ల, ఆమిర్‌తో షూటింగ్ కాంప్లికేట్ అవుతుందన్న భయంతోను పోలెండ్‌లోని టాట్రా మౌంటెయిన్స్‌లో తీశారు. ఫస్ట్ హాఫ్‌లోని ఢిల్లీ సీన్లు మాత్రం రెడ్‌ఫోర్ట్, జంతర్ మంతర్, రాష్ట్రపతిభవన్, కుతుబ్ మినార్ లాంటి చారిత్రక ప్రదేశాల్లో తీశారు... హీరో టూరిస్ట్ గైడ్ కాబట్టి.ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఈ సినిమా క్లయిమాక్స్ గురించి. క్లయిమాక్స్ చూశాక... ఈ సినిమాలో ఫస్ట్ షాట్‌లో భారత జాతీయ పతాకానికి గౌరవ వందనం చేస్తూ హీరోయిన్ క్యారెక్టర్‌ని పరిచయం చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఒక కథకి పర్‌ఫెక్ట్ సర్కిల్ అంటే ఇదే!

 

 ఇక మ్యూజిక్ గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతి పాటా హిట్టే!

 ఇలా కొన్ని గొప్పదనాలు, కొన్ని లాజిక్‌కి అందని విషయాల నడుమ మిక్స్‌డ్ ఫీలింగ్ కలిగింది ఈ సినిమాని రెండోసారి చూస్తున్నప్పుడు. వచ్చేవారం మరో మంచి సినిమాతో కలుద్దాం!                                                   

 

 ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఆమిర్‌ఖాన్... నర్మద డ్యామ్ విషయంలో నేటి ప్రధాని, నాటి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన మోదీని మీడియాలో విమర్శించాడు. అది పెద్ద సంచలనం సృష్టించింది. ఆ వివాదం వల్ల బీజేపీ అనుయాయులు, ప్రభుత్వం ‘ఫనా’ గుజరాత్‌లో విడుదల కాకుండా కఠిన చర్యలు తీసుకున్నారు.



 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top