అనుమాన భూతాన్ని తరిమేదెలా?!

అనుమాన భూతాన్ని తరిమేదెలా?! - Sakshi


జీవన గమనం

నేను ఇంటర్ చదువుతున్నాను. ఈ మధ్య ఇంటర్వ్యూల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా సాఫ్ట్ స్కిల్స్ అనే మాట వినిపిస్తోంది. అసలు దానికి అర్థం ఏమిటి? వాటిని ఎవరు నేర్పుతారు?

 - రవివర్మ, ఊరు రాయలేదు


 

ఇంటర్వ్యూల్లో ఎంపిక రెండు అంశాల ఆధారంగా జరుగుతుంది... హార్డ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్. మొదటిది మీ చదువుకు సంబంధించినది. మీ మార్కులు, సబ్జెక్టుల్లో మీకున్న పరిజ్ఞానం మొదలైన విషయాలపై మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. రెండో విభాగం మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించినది. నాయకత్వ లక్షణాలు (గ్రూప్ లీడింగ్), మాట్లాడే విధానం, అర్థం చేసుకునే పద్ధతి, ఒత్తిడిలో సైతం పని చేయగలిగే నైపుణ్యం మొదలైన అంశాలను పరీక్షిస్తారు.



వీటినే సాఫ్ట్ స్కిల్స్ అంటారు. వీటిలో అన్నిటికంటే ముఖ్యమైనది కమ్యునికేషన్. మీరు చెప్పేది అవతలివారికి అర్థమవుతోందా? అవతలివారికి అర్థమయ్యే భాషలో, స్థాయిలో మీరు మాట్లాడగలుగు తున్నారా? అలాగే వారు చెప్పేది మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? ఈ విషయాలన్నీ కూడా కమ్యునికేషన్‌లోకి వస్తాయి.

 

ఎక్కువ జీతం ఆశించేవారికి ఈ స్కిల్స్ తప్పనిసరి. అయితే దురదృష్ట వశాత్తూ చాలా కాలేజీలు చదువుకు తప్ప, సాఫ్ట్ స్కిల్స్‌కి ఎక్కువ ప్రాముఖ్యత నివ్వడం లేదు. పరీక్షల్లో పాసవడమే ముఖ్య ఉద్దేశంగా చదువు నేర్పుతున్నారు. విద్యార్థులు కూడా చదువు పూర్తయిన తర్వాతే సాఫ్ట్ స్కిల్స్ ప్రాముఖ్యత తెలుసు కుంటున్నారు.



మీకు సబ్జెక్టు తెలుసు అన్న విషయం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి అవగతమవ్వాలంటే... మాట్లాడే కెపాసిటీ మీకుండాలి కదా! దానికితోడు మీపై మీకు నమ్మకం, ధీమా ఉండాలి. వాటినే సాఫ్ట్ స్కిల్స్ అంటారు. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడం, గ్రూప్ డిస్కషన్స్‌లో పాల్గొనడం, అవకాశం వచ్చినప్పుడు స్టేజి ఎక్కి మాట్లాడటం మొదలైన పద్ధతుల ద్వారా ఈ స్కిల్స్‌ని పెంపొందించుకోవచ్చు.

 

గుడ్డిగా ప్రేమించకూడదు, వెనుకా ముందూ చూసుకుని ప్రేమించాలి అంటూ ఉంటారు. నాది ప్రేమ వివాహం కాదు. అన్నీ పరిశీలించి పెద్దలు చేసిన వివాహం. కానీ పెళ్లయ్యీ అవ్వగానే అతడి నిజస్వరూపం నాకు తెలిసింది. అతడో అనుమాన పిశాచి. పాలవాడి దగ్గర్నుంచి కూరగాయల వాడి వరకూ ప్రతి ఒక్కరి విషయలోనూ సందేహమే. దానికితోడు ఆడది పడివుండాలి అనే తత్వం. అతను ప్రేమగా చూసుకుంటే పడివుండ టానికి నాకే అభ్యంతరం లేదు. కానీ అనుమానించి హింసించేవాడి మీద ప్రేమ ఎలా ఉంటుంది? అతని దగ్గర పడివుండాలని ఎందుకనిపిస్తుంది? ఈ విషయం నేనెంత చెప్పినా సర్దుకుపోవాలి అంటున్నారు మా ఇంట్లోవాళ్లంతా. మీరు చెప్పండి... నేను సర్దుకుపోవాలా?

 - సరళ, హైదరాబాద్


 

నా స్నేహితుడి కూతురికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త విపరీతంగా సిగరెట్లు తాగుతాడు. ఆ అమ్మాయికి ధూమపానం అస్సలు పడదు. మొదట్లో మర్యాదగా చెప్పి చూసింది. వినలేదు. విడాకులిస్తానని బెదిరించింది. అయినా మానలేదు. ఆ సమయంలో ఆమెకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడం మొదలుపెట్టాయి. క్రమక్రమంగా కృంగిపోసాగింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేది. ఒక స్టేజిలో సైకాలజిస్టులకి కూడా చూపించారు. దీనికంతటికీ కారణం భర్త నుంచి శారీరకంగా దూరంగా ఉండటమే అని ఒక మానసిక శాస్త్రవేత్త చెప్పాడు.



ఆమె భర్తను దగ్గరకు రానివ్వకపోవడానికి కారణం సిగరెట్టు అని బయటపడిన తర్వాత అతడు భార్యను వదులుకోవాలా, సిగరెట్టు మానేయాలా అనే సందిగ్ధంలో పడి... చివరికి ధూమపానాన్నే వదిలేశాడు. మూడు నెలల కాలంలోనే ఇదంతా జరిగింది. అతడు పొగ తాగడం మానేసిన మూడేళ్లకు గానీ ఆమె ఆ విధంగా సామ దాన భేద దండోపాయాలైన నాలుగింటిలో చివరిదాన్ని ఉపయోగించి, తన కోరిక నెరవేర్చుకుందన్న విషయం అతడికి తెలియలేదు. మొత్తమ్మీద ఎలాగైతేనేం... సాధించింది కదా!

 

మగవాడికి భార్య పట్ల అనుమాన ప్రవృత్తి ఏర్పడటానికి చాలా కారణాలు ఉండవచ్చు. పెళ్లికి ముందు అనుభవాలు, ఇంట్లో సభ్యులు లేక దగ్గరి బంధువుల క్యారెక్టర్ పట్ల అనుమానాలు, బాల్యంలో చూసిన దృశ్యాలు, స్నేహితుల ద్వారా విన్న చౌకబారు విషయాలు, వివాహత్పూర్వం తనకున్న స్త్రీల పరిచయాలు... ఇలాంటివెన్నో అనుమాన పిశాచాన్ని సృష్టిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆత్మన్యూనతా భావం. తనమీద తనకి నమ్మకం లేకపోవడం. వ్యక్తిత్వం పెంచుకోవడానికి ఆర్థిక స్వాతంత్య్రం ముఖ్యం.

 

మీకు రెండే మార్గాలు. అతడిని మార్చడం లేదా మీరు మారటం. అతన్ని మార్చాలనుకుంటే ఏం చేయాలో పై ఉదాహరణ చెబుతోంది. రకరకాలుగా ప్రయత్నించి చూడండి. అప్పటికీ అతడు మారకపోతే మళ్లీ రెండు మార్గాలు. అతని నుంచి విడిపోయి ఉండటం లేదా అతడు చెప్పినట్టు పడివుండటం. కలిసి ఉంటే మాత్రం చాలామంది ఆడవాళ్ల లాగే ‘కాలమే అతణ్ని మారు స్తుంది’ అనుకుంటూ, అతడు మారే వరకూ పాము పుట్టల్లో పాలు పోస్తూ భగవంతుడిని ప్రార్థించడం తప్ప చేయగలిగినదేమీ లేదు.  

- యండమూరి వీరేంద్రనాథ్

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top