అంతకు ముందు.. ఆ తర్వాత!

అంతకు ముందు.. ఆ తర్వాత!


అద్భుతాలు జరిగేటప్పుడు చాలా సార్లు సాక్షాలు ఉండవు. అవి సంభవించిన తర్వాతే అందరూ వాటిని గమనిస్తారు. అద్భుతాలు సాధించే వ్యక్తుల విషయంలో కూడా ప్రపంచం ఇలాగే వ్యవహరిస్తుంటుంది. వారు ప్రపంచానికి పరిచయమై, పరిచయం కాని వ్యక్తుల్లా ఉంటారు. అలాంటి వ్యక్తులు... సందర్భాలు ఇవి..

 

ఎగెనీ బుచార్డ్


టెన్నిస్ కోర్టులో ఆటతీరుతోనే గాక తన అందంతో కూడా సరికొత్త సంచలనంగా మారిన ప్లేయర్ ఎగెనీ బుచార్డ్. ప్రస్తుతం డబ్ల్యూటీవో ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న బుచార్డ్ వెలుగులోకి వచ్చాక ఒక కొత్త సంగతి ప్రచారంలోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం ఈ కెనడియన్ టీనేజర్, రష్యన్ టెన్నిస్ స్టార్ షరపోవాతో కలిసి ఫోటోలు దిగిందట. అప్పటికి యువ  క్రీడాకారిణిగా షరపోవా అభిమానిగా ఎగెనీ ఆ పని చేసింది. అయితే ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో షరపోవాతో కలిసి బరిలోకి దిగింది! ఒకప్పుడు అనామకురాలిగా షరపోవా పక్కన నిలబడి ఇప్పుడు ఆమెస్థాయి క్రీడాకిరిణి కావడం అద్భుతమే కదా!

 

మెగాన్ ఫాక్స్

యువత కలల రాణిగా ఇమేజ్‌ను కలిగిన మెగాన్‌ఫాక్స్ నటిగా పేరు తెచ్చుకోక ముందే మీడియా ద్వారా అనేక మందికి పరిచయం. మెగాన్‌ఫాక్స్ తన స్నేహితురాళ్లతో కలిసి తీయించుకొన్న ఫోటోలు ఒక మ్యాగజీన్ కవర్ పేజ్ పై పడ్డాయి. ఆ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయి అంతటితో వదిలేసిందామె. అయితే ఆ తర్వాత అనుకోకుండా మోడలింగ్ ఆమె కెరీర్ అయ్యింది. నటిగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది!

 

సచిన్ టెండూల్కర్

ముంబయిలోని వాంఖేడ్ స్టేడియం ఎన్నో అద్భుతాలకు వేదిక. ప్రపంచకప్ మ్యాచ్‌లతో సహా ఎన్నో గొప్ప క్రికెట్ పోరాటాలకు ఇది కేంద్రంగా నిలిచింది. ఈ స్టేడియంకు సంబంధించిన మరో అద్భుతం ఏమిటంటే... ఇదే స్టేడియంలో సచిన్ ప్రస్థానం మొదలైంది. క్రికెటర్‌గా కాదు.. బాల్ బాయ్‌గా. సచిన్ పిల్లాడిగా ఉన్నప్పుడు ఈ స్టేడియంలో జరిగే అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లకు బాల్‌బాయ్‌గా చేసేవాడు. బౌండరీ రోప్ ఆవలకు బంతి వచ్చినప్పుడు దాన్ని అందించేవాడు. పాత మ్యాచ్‌లకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌లో కూడా బుల్లి సచిన్‌ను చూడవచ్చు!

 

శాండ్రాబులాక్

ఈ అమెరికన్ హాలీవుడ్ నటి, నిర్మాత కూడా ఒకనాటి ఉల్లాసినే. చీర్‌లీడర్‌గా బేస్‌బాల్, వాలీబాల్ ఆటగాళ్లను, వీక్షకులను ఉల్లాసపరిచిన వ్యక్తే. అలాంటి ఉత్సాహమే క్రమంగా ఈమె నటిగా మారడానికి కారణం అయ్యింది.

 

మడోన్నా

ఆమెను చూసినా, గొంతును విన్నా.. ఆమె తన వయసును తప్పుగా చెబుతున్నారనే అభిప్రాయం కలుగుతుంది. దాదాపు 35 యేళ్ల నుంచి ఒకే పాపులారిటీతో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది మడోన్నా.  అంతకు ముందు కూడా (పాప్‌స్టార్‌గా పేరు తెచ్చుకోక ముందు) మడోన్నా మీడియా గర్లే! మ్యూజిషియన్  అవడానికి మునుపు ఈ పాప్‌తరంగం స్టేడియంలో చీర్‌గర్ల్‌గా చేసేది. తన తోటి వారితో కలిసి క్రీడాకారులను ఉత్సాహపరిచే బాధ్యతలో ఉండేది!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top